14న సుబ్రహ్మణ్యం గెలుస్తాడు

‘హరోం హర’ లాంటి బ్యాక్‌డ్రాప్‌తో తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు సినిమా రాలేదు. అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా ఉంటుందీ చిత్రం’ అని అంటున్నారు కథానాయకుడు సుధీర్‌ బాబు.

Published : 13 Jun 2024 00:42 IST

‘హరోం హర’ లాంటి బ్యాక్‌డ్రాప్‌తో తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు సినిమా రాలేదు. అభిమానులు కాలర్‌ ఎగరేసుకునేలా ఉంటుందీ చిత్రం’ అని అంటున్నారు కథానాయకుడు సుధీర్‌ బాబు. ఆయన హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’. సుమంత్‌ జి.నాయుడు నిర్మించారు. మాళవిక కథానాయిక. కుప్పం నేపథ్యంలో సాగే ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకను నిర్వహించింది చిత్రబృందం. కథానాయకులు విష్వక్‌ సేన్, అడివి శేష్, దర్శకుడు మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో భాగంగా హీరో మహేశ్‌ బాబు ఆడియో ద్వారా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ..ట్రైలర్‌ చాలా ఆసక్తిగా ఉంది. సుధీర్‌ బాబు చాలా కొత్తగా కనిపించారు. ఇలాంటి నేపథ్యమున్న చిత్రాల్నే ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ ప్రాజెక్టు పెద్ద హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘మా నాన్న తొలిసారి నా సినిమాకి సంబంధించిన వేడుకకు రావడం ఆనందంగా ఉంది. మా మావయ్య కృష్ణ నా హీరో. ఈ సినిమా ఆయన కోరుకున్నదే. ఆయన నన్ను ఎలాంటి పాత్రలో చూడాలని కోరుకున్నారో, అలాంటిదే ఈ సినిమా అని చాలా గర్వంగా చెబుతున్నాను. జూన్‌ 4 ఎన్నికల ఫలితాలొచ్చాయి. కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. జూన్‌ 14న సుబ్రహ్మణ్యం వస్తున్నాడు. వాడూ గెలుస్తాడు’’ అని అన్నారు సుధీర్‌బాబు. జ్ఞానసాగర్‌ మాట్లాడుతూ..‘‘హరోం హర’ పక్కాగా గుర్తుండిపోయే సినిమా అవుతుంద’న్నారు. నిర్మాత సుమంత్‌ మాట్లాడుతూ..‘ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడి పనిచేశాం. ఆ కష్టానికి ప్రతిఫలం శుక్రవారం అందుతుందని నమ్మకంగా ఉంద’న్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, శశిధర్‌ రెడ్డి, దామోదర్‌ ప్రసాద్, బెక్కం వేణుగోపాల్‌ తదితర చిత్రబృందం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని