27ఏళ్ల తర్వాత ‘బార్డర్‌’లోకి సన్నీ

‘బార్డర్‌’.. దేశ సైనికుల త్యాగాలను, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. ఇండో-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది.

Published : 14 Jun 2024 00:21 IST

బార్డర్‌’.. దేశ సైనికుల త్యాగాలను, వారి పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించిన చిత్రమిది. ఇండో-పాకిస్థాన్‌ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సన్నీ దేవోల్, జాకీ ష్రాఫ్, సునీల్‌ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జేపీ దత్తా తెరకెక్కించారు. కథ, భావోద్వేగాలు, సంగీతంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కదిలించిన ఈ చిత్రం విడుదలై ఈరోజుతో 27ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీనికి సీక్వెల్‌ను ప్రకటిస్తూ.. ఓ వీడియోను పంచుకున్నారు సన్నీ దేవోల్‌. 

‘‘ఓ సైనికుడు 27ఏళ్ల తర్వాత తన మాటను నిలబెట్టుకోవడానికి ‘బార్డర్‌’లోకి తిరిగొచ్చాడు. భారీ బడ్జెట్‌తో అతి పెద్ద వార్‌ ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అనురాగ్‌ సింగ్‌ రూపొందిస్తున్న ఈ సినిమా త్వరలో మీ ముందుకు రాబోతుంద’’ని వ్యాఖ్యల్ని జోడించారు. జేపీ దత్తా, భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 


ఎన్ని రూ.కోట్ల సినిమాకైనా కథే ముఖ్యం

చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంలో బాల రాజశేఖరుని తెరకెక్కిస్తున్నారు. కేకేఆర్, బాలరాజ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ సినిమా విడుదలకు ముందస్తు వేడుకను నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘రూ.వందల కోట్ల సినిమా అయినా.. పదికోట్ల రూపాయల చిత్రమైన ప్రేక్షకుడిని మెప్పించేది కంటెంట్‌ మాత్రమే. అలాంటి మంచి కంటెంట్‌ మా చిత్రంలో కూడా ఉంది. చైతన్య, హెబ్బాల జోడీ సినీప్రియులకు కొత్త అనుభూతి కలిగించేలా కనిపిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దీన్ని తీర్చిదిద్దామ’’న్నారు. ‘‘ప్రతి నటుడికి అన్ని రకాల భావోద్వేగాలున్న పాత్రలు చేయాలనే కోరిక ఉంటుంది. అది నాకు ఈ సినిమాతో నెరవేరింది. అందరినీ మెప్పించేలా ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఉంటుంది. ఈ సినిమాతో ఎలాంటి సందేశం చెప్పడం లేద’’న్నారు చైతన్య రావ్‌. 


హమారే బారహ్‌ విడుదల నిలిపివేత

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అన్ను కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘హమారే బారహ్‌’. కమల్‌ చంద్ర దీన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. శుక్రవారం ఈ సినిమా రానున్న నేపథ్యంలో ఇటీవలే ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘మేము ఈ సినిమా ట్రైలర్‌ను చూశాము. ఇందులో ఇస్లామిక్‌ మత విశ్వాసాలను, ముఖ్యంగా ముస్లిం మహిళల వివాహబంధాన్ని కించపరిచే విధంగా సంభాషణలు ఉన్నాయి. దీన్ని ముంబయి హైకోర్టు పరిష్కరించే వరకు ఈ సినిమా విడుదలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము’’ని పేర్కొంది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, అమర్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది. అజర్‌ బాషా తాంబోలీ అనే వ్యక్తి పిటిషన్‌ వేయగా.. ఫౌజియా షకీలా అనే న్యాయవాది కోర్టులో ఈ పిటిషన్‌పై వాదించారు. చిత్ర విడుదల నిలిపివేతపై తొందరగా నిర్ణయం తీసుకోవాలని ముంబయి హైకోర్టును కోరారు.


భావోద్వేగాల.. నీ దారి

స్నేహం, సంకల్పం, తండ్రీ తనయుల మధ్య ఉండే బంధం చుట్టూ తిరిగే కథనంతో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘నీదారే నీకథ’. ప్రియతమ్‌ మంతిని, అంజన బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించారు. శైలజ జొన్నలగడ్డ, తేజేష్‌ వీరలతో కలిసి వంశీ జొన్నలగడ్డ స్వయంగా నిర్మిస్తూ..దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ రోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకనిర్మాత వంశీ జొన్నలగడ్డ మాట్లాడుతూ..‘సినిమా ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసినప్పటి నుంచి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సంగీతంపై ఆధారపడిన ఈ కథ మంచి అనుభవాన్ని అందిస్తుంది. టీజర్, ట్రైలర్‌ చూసిన వాళ్లు సినిమా గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. భావోద్వేగాలు పంచే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. సురేశ్, విజయ్‌ విక్రాంత్, అనంత్‌ పద్మశాల, వేద్‌ తదితరులు నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని