పెద్ద కల కని సాహసం చేశాడు

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా!’. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సుధా కొంగర హిందీలో ‘సర్ఫిరా’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

Published : 15 Jun 2024 00:15 IST

జాతీయ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా!’. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని సుధా కొంగర హిందీలో ‘సర్ఫిరా’ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ఈ నెల 18న విడుదల కానున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు అక్షయ్‌. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని పంచుకున్నారు. ‘పెద్ద కలలు కనడం ఓ సాహసం. అలాంటి సాహసం చేసిన ఓ వ్యక్తి కథ ఇది. నాకు ఈ కథ, ఇందులోని పాత్ర, ఈ సినిమా, జీవితకాల అవకాశం’ అంటూ చిత్రం పట్ల తన ఉత్సాహాన్ని జోడించారు. కళ్లజోడు పెట్టుకొని, ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూస్తున్న అక్షయ్‌ కొత్త లుక్‌ ఆసక్తి కలిగిస్తోంది. రాధికా మదన్, పరేష్‌ రావేల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు కానుంది.


మగవాడినే అనుసరించాలి.. జస్ట్‌ కిడ్డింగ్‌! 

‘రాజ రాజ చోర’ విజయం తర్వాత శ్రీవిష్ణు - హసిత్‌ గోలి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘శ్వాగ్‌’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ కథానాయిక. మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, సునీల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. దీనిలో భాగంగా శుక్రవారం రేజర్‌ పేరుతో ఓ గ్లింప్స్‌ను బయటకొదిలారు. అందులో శ్రీవిష్ణు వయసు పైబడిన వ్యక్తిలా.. మహిళా ద్వేషిగా భిన్నమైన క్యారెక్టరైజేషన్‌తో కనిపించారు. ‘‘ఆడ దేవుళ్లని.. ఆడవాళ్లని ఏమీ అడుక్కోనక్కర్లేదు. మగవాడినే అనుసరించాలి. వంశాలైనా.. ఆస్తులైనా.. ఆడవాళ్లైనా’’ అని చెబుతూ ఆఖర్లో ‘‘జస్ట్‌ కిడ్డింగ్‌’ అని విష్ణు చెప్పడం ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఆయన మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి సంగీతం: వివేక్‌ సాగర్, ఛాయాగ్రహణం: వేదరామన్‌ శంకరన్‌.


బాల్యమే గొప్పది 

సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, త్రినాథ్‌ వర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ తెరకెక్కించిన ఈ సినిమాని నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక సంయుక్తంగా నిర్మించారు. సాయికుమార్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్‌ను హీరో నితిన్‌ శుక్రవారం విడుదల చేశారు. ‘‘చిన్నప్పుడే బాగుండేది కదా.. ఒక బరువుండేది కాదు. బాధ్యత ఉండేది కాదు’’ అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌తో మొదలైన టీజర్‌ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఎలాంటి పొరపొచ్చాలు, అడ్డుగోడలు, బాధలు లేకుండా స్నేహితులతో కలిసి సరదాగా గడిపే బాల్యమే గొప్పదనే అంశాన్ని ఆధారం చేసుకొని ఈ సినిమా తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్‌ దేవ్, ఛాయాగ్రహణం: రాజు ఎడురోలు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని