‘వెల్‌కమ్‌’ రాక ఆలస్యం

అగ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. ‘వెల్‌కమ్‌’ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో భాగమిది.

Published : 17 Jun 2024 01:00 IST

గ్ర కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో అహ్మద్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. ‘వెల్‌కమ్‌’ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో భాగమిది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా రాకకు మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ‘‘భారీ బడ్జెట్‌తో తీర్చిదిద్దుతున్న ఈ ప్రాజెక్టు షూటింగ్‌ అనుకున్న దానికన్నా ఎక్కువ సమయాన్ని తీసుకుంటోంది. నిర్మాణానంతర పనులు కూడా జాప్యం కానున్నాయి. దీంతో ప్రకటించిన తేదీకి సినిమాను తీసుకురావడం అసాధ్యమని భావించిన చిత్రబృందం దీన్ని 2025లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది’ అని సన్నిహితవర్గాలు తెలిపాయి. దిశా పటానీ, సంజయ్‌ దత్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, రవీనా టాండన్‌ లాంటి నటీనటులందరూ నటిస్తున్న ఈ సినిమాకు సాజిద్‌ నడియాడ్‌వాలా, జ్యోతి దేశ్‌పాండే నిర్మాతలు.


తొలి భాగాన్ని మించేలా ‘బార్డర్‌ 2’..

సైనికుడు 27ఏళ్ల తర్వాత తన మాటను నిలబెట్టుకోవడానికి తిరిగొచ్చాడంటూ ఇటీవలే ‘బార్డర్‌ 2’ను ప్రకటించింది చిత్రబృందం. బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయకుడు సన్నీదేవోల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అనురాగ్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా 2026 జనవరి 23న రాబోతున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అక్టోబరులో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని జేపీ దత్తా, భూషణ్‌ కుమార్, కృష్ణ కుమార్‌ నిర్మిస్తున్నారు. భారత్‌-పాకిస్థాన్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో తొలి భాగాన్ని మించేలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలిపారు.

‘సూర్య’ మళ్లీ మొదలు: సన్నీ దేవోల్‌ నటిస్తున్న ‘సూర్య’ రెండేళ్ల కిందటే ప్రకటించినా అనివార్య కారణాలతో ఎనభై శాతం షూటింగ్‌ పూర్తయ్యాక ఆగిపోయింది. తాజాగా చిత్రం షూటింగ్‌ తిరిగి నవంబరు నుంచి ప్రారంభిస్తామని చిత్రబృందం ప్రకటించింది. దీనికి ఎమ్‌.పద్మకుమార్‌ దర్శకుడు. కమల్‌ ముకుత్‌ నిర్మాత.


దెయ్యం వేటకు దిగితే! 

నందితా శ్వేత, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రల్లో శంకర్‌ మార్తాండ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఓఎమ్‌జీ’. ఓ మంచి ఘోస్ట్‌.. అన్నది ఉపశీర్షిక. అబినికా ఇనాబతుని నిర్మించారు. రఘుబాబు, నాగినీడు, షకలక శంకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తోందని కథలుకథలుగా చెప్పుకుంటున్నారు’’ అంటూ ఓ వ్యక్తి చెప్పే డైలాగ్‌తో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘‘ఇప్పటివరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం’’ అంటూ ఆఖర్లో నందిత చెప్పిన డైలాగ్‌ ట్రైలర్‌కు ఆకర్షణగా నిలిచింది.


‘నిమ్మకూరు మాస్టారు’.. కొబ్బరికాయ కొట్టేశారు 

ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌చంద్ర మనవడు శ్యామ్‌ సెల్వన్‌ను హీరోగా పరిచయం చేస్తూ అముదేశ్వర్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నిమ్మకూరు మాస్టారు’. జె.ఎమ్‌.ప్రదీప్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ క్లాప్‌ కొట్టి.. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు అముదేశ్వర్‌ మాట్లాడుతూ.. ‘‘నిమ్మకూరు మాస్టారు’తో తెలుగులోకి అడుగు పెడుతున్నందుకు గర్వంగా ఉంది. ఈనెల 25నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంద’’న్నారు. ‘‘రాజేంద్రప్రసాద్‌ లాంటి సీనియర్‌ నటుడితో తెర పంచుకుంటున్నందుకు ఎంతో ఉద్వేగంగా ఉంద’’న్నారు హీరో శ్యామ్‌ సెల్వన్‌. మాధవపెద్ది సురేశ్‌ చంద్ర సంగీతమందిస్తుండగా.. జొన్నవిత్తుల సాహిత్యం సమకూరుస్తున్నారు.


లగ్గం పాటలొస్తున్నాయ్‌ 

కొన్ని తరాలు గుర్తు పెట్టుకునే సాంస్కృతిక కుటుంబ కథా చిత్రమే మా ‘లగ్గం’ అన్నారు రమేశ్‌ చెప్పాల. ఆయన దర్శకత్వంలో సాయిరోనక్, ప్రగ్యా నగ్రా జంటగా తెరకెక్కుతున్న చిత్రమిది. రాజేంద్రప్రసాద్, రోహిణి, సప్తగిరి, ఎల్బీ శ్రీరామ్‌ ప్రధాన పాత్రధారులు. వేణుగోపాల్‌రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న ఈ సినిమాలోని పాటల్ని ఈ నెల 21 నుంచి విడుదల చేస్తున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు. ‘‘పెళ్లిలో ఉండే సంబురాల్ని... భావోద్వేగాల్ని కనువిందుగా తెరపై ఆవిష్కరిస్తున్నాం. ఈ నెల 21న ‘లగ లాగ లగ్గం...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేస్తున్నాం’’ అని సినీవర్గాలు తెలిపాయి. ఎల్బీ శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చరణ్‌ అర్జున్, కూర్పు: బొంతల నాగేశ్వరరెడ్డి, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని