వరుణ్‌ ఫెయిల్యూర్‌ నటుడు కాదు

‘‘నా కెరీర్‌లో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాల్లాగా... వరుణ్‌ సందేశ్‌ కెరీర్‌కి ‘నింద’ చిత్రం ఓ మైలురాయి కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌. ఆయన ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్‌లో ‘నింద’ విడుదలకి ముందుస్తు వేడుక జరిగింది.

Updated : 18 Jun 2024 01:09 IST

‘‘నా కెరీర్‌లో ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాల్లాగా... వరుణ్‌ సందేశ్‌ కెరీర్‌కి ‘నింద’ చిత్రం ఓ మైలురాయి కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌. ఆయన ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్‌లో ‘నింద’ విడుదలకి ముందుస్తు వేడుక జరిగింది. వరుణ్‌ సందేశ్‌ కథానాయకుడిగా రాజేశ్‌ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ, నిర్మించారు. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 21న రానుంది. వేడుకని ఉద్దేశించి నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘ఎంతో నాణ్యతతో సినిమాని తెరకెక్కించారు. ‘నింద’తో వరుణ్‌ సందేశ్‌కు మంచి విజయం రాబోతోంద’’న్నారు. వరుణ్‌ సందేశ్‌ మాట్లాడుతూ ‘‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేశాను కానీ, ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు. ఈ సినిమాని పరిశ్రమలో కొంతమందికి చూపించాం. అక్కడ స్పందన మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. మైత్రీ సంస్థ మా సినిమాని పంపిణీ చేస్తోంది. నా కెరీర్‌లో ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారు లోకం’, ‘ఏమైంది ఈ వేళ’ తర్వాత ‘నింద’ అని గర్వంగా చెబుతా. దాదాపు నా సగం జీవితం పరిశ్రమలోనే గడిచింది’’ అన్నారు. దర్శకనిర్మాత రాజేశ్‌ జగన్నాథం మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రయాణంతో వరుణ్‌సందేశ్‌ ఓ సోదరుడిలా నాకు దగ్గరయ్యాడు. ఈ సినిమాతో తను మళ్లీ తప్పకుండా విజయం అందుకుంటాడ’’న్నారు. వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక మాట్లాడుతూ ‘‘వరుణ్‌కి ఎలాంటి అండదండలు లేకపోయినా 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. తను ఫెయిల్యూర్‌ నటుడు కాదు. ఎప్పుడైనా వంద శాతం కష్టపడతారు. ‘నింద’తో పెద్ద విజయాన్ని అందుకుంటార’’న్నారు. ఈ కార్యక్రమంలో శ్రేయారాణి, అన్నీ, క్యూ మధు, మైత్రీ మూవీస్‌ శశిధర్‌ రెడ్డి, సంగీత దర్శకుడు సాంతు ఓంకార్, మాధురి తదితరులు పాల్గొన్నారు.  


ఒకప్పుడు దేశ రక్షణ.. ఇప్పుడు కుటుంబం కోసం పోరాటం 

ఒకప్పుడు దేశాన్ని రక్షించడానికి ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తి.. ఇప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తపిస్తున్నాడు. మరి ఆయన కథేంటో తెలుసుకోవాలంటే ‘సుబేదార్‌’ చూడాల్సిందే అంటున్నాయి చిత్రవర్గాలు. ‘ఫైటర్‌’, ‘యానిమల్‌’ లాంటి చిత్రాలతో మంచి విజయాల్ని అందుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయకుడు అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను సురేశ్‌ త్రివేణి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని తన పాత్రకు సంబంధించిన కసరత్తులను ప్రారంభించినట్లు తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఫొటోను పంచుకున్నారు అనిల్‌. అర్జున్‌ సింగ్‌ అనే రిటైర్డ్‌ మిలటరీ అధికారి జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం.  


అవారన్‌గా టొవినో 

‘2018’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న టొవినో థామస్‌ ఈమధ్యే కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా అందులో నుంచి తన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని పంచుకుంటూ.. చిత్ర టైటిల్‌ని సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించాడు టొవినో. ఈ యాక్షన్‌ డ్రామాని శిల్పా అలెగ్జాండర్‌ తెరకెక్కిస్తున్నారు. ఆ పోస్టర్‌లో మూత పడుతున్న కళ్లతో ఒక పెద్ద రాయిపై పంచెకట్టులో కూర్చొని ఉండగా.. బ్యాగ్రౌండ్‌లో వింత ఆకారంలో రకరకాల వస్తువులు, జంతువులు కనిపిస్తూ.. ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. రోనెక్స్‌ జేవియర్, సచిన్‌ సుధాకరన్, రోహిత్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


కలే అయినా… మర్చిపోలేను!

‘వీరసింహారెడ్డి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కథానాయిక హనీరోజ్‌. తన అందం, అభినయంతో కుర్రకారుని ఉర్రూతలూగించే ఈ భామ.. ‘రాహేలు’ అనే సినిమాతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఆమె టైటిల్‌ పాత్రలో నటిస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఆనందినీ బాలా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పోస్టర్‌ విడుదలై సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఇన్‌స్టా వేదికగా విడుదల చేసింది హనీరోజ్‌. ఇందులో ఆమె సరికొత్త అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘‘చీకట్లో నేను చూసిన ఆ ఎరుపెక్కిన కళ్లు కల అయితే కాదు. అది కలే అయినా వాటిని నేను మర్చిపోలేను’’ లాంటి సంభాషణలతో సాగుతున్న ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది. బాదుషా ఎన్‌.ఎం, రాజన్‌ చిరాయిల్, అబ్రిడ్‌ షైన్‌ నిర్మిస్తున్నాయి.


ఇట్లు... సినిమా కష్టాలు 

అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు... మీ సినిమా’. ప్రదీప్, అమ్మ రమేశ్‌ ఇతర కీలక పాత్రలు పోషించారు. హరీశ్‌ చావా దర్శకత్వం వహిస్తున్నారు. నోరి నాగప్రసాద్‌ నిర్మాత. ఈ నెల 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.  దర్శకుడు మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమలో రాణించాలనుకున్న కొద్దిమంది కథే ఈ చిత్రం. ఎలాంటి సినిమా చేద్దామనే విషయంపై చర్చించుకుంటున్న సమయంలో నిర్మాత నాగప్రసాద్‌ ‘మన కథే తీద్దాం. మనం సినిమా పరిశ్రమలోకి రావాలనుకున్నప్పుడు ఎదురైన కష్టాలే ఇతివృత్తంగా సినిమా చేద్దాం’ అన్నారు. ఇలాంటి కథతో సినిమా చేస్తే పరిశ్రమలోకి వచ్చేవాళ్లకీ అవగాహన ఏర్పరిచినట్టు అవుతుందనే మేం ఈ ప్రయత్నానికి పూనుకున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందీ చిత్రం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘తపన ఉన్న నలుగురు యువకులు సినిమా రంగానికి వచ్చి ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? వాళ్లు అనుకున్నది సాధించారా అనే అంశం ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని