ఖల్లాసే.. నా బతుకే ఖల్లాసే!

ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘డార్లింగ్‌’. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 19 Jun 2024 00:53 IST

ప్రియదర్శి, నభా నటేష్‌ జంటగా అశ్విన్‌ రామ్‌ తెరకెక్కించిన చిత్రం ‘డార్లింగ్‌’. కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఖల్లాసే ఖల్లాసే.. మామ నా బతుకే ఖల్లాసే’’ అంటూ సాగుతున్న ఈ పాటకు వివేక్‌ సాగర్‌ స్వరాలు సమకూర్చగా.. కాసర్ల శ్యామ్‌ సాహిత్యమందించారు. రామ్‌ మిరియాల, సీహెచ్‌.హనుమాన్‌ ఆలపించారు. కొత్తదనం నిండిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబైన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాకి కూర్పు: ప్రదీప్‌ ఇ రాఘవ, ఛాయాగ్రహణం: నరేశ్‌ రామదురై.


మాస్‌ను ఆకట్టుకునేలా పేరు 

న్నీ అఖిల్, అజయ్‌ ఘోష్, రవి కాలే, గిడ్డేశ్‌ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘పోలీస్‌ వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. బెల్లి జనార్ధన్‌ నిర్మాత. ఈ సినిమా టైటిల్‌ లోగోని ప్రముఖ  దర్శకుడు తేజ మంగళవారం హైదరాబాద్‌లో  ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రేక్షకుల్ని ఆకర్షించేది...  వాళ్లని థియేటర్ల వరకూ నడిపించేది సినిమా పేరే. ‘పోలీస్‌ వారి హెచ్చరిక’ పేరు శక్తిమంతంగా, మాస్‌ని ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా దర్శకనిర్మాతలకి, బృందానికీ మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు బాబ్జీ మాట్లాడుతూ ‘‘ఆసక్తికరమైన కథతో రూపొందించిన చిత్రమిది. తెలుగు రాష్ట్రాల్లో మంచి లొకేషన్లలో చిత్రీకరణను పూర్తి చేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. శుభలేఖ సుధాకర్, సాయాజీ షిండే, హిమజ, జయవాహినీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గజ్వేల్‌ వేణు, ఛాయాగ్రహణం: నళినీ కాంత్‌.


క్లిష్టమైన పాత్రలే కోరుకుంటా! 

స్థాయికి చేరాక.. అన్నిరకాల సక్సెస్‌ అందుకున్నాక.. ఏ నటి అయినా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కోరుకోవడం సహజం. సీనియర్‌ నటి కృతి సనన్‌ సైతం అదే బాటలో వెళ్లాలనుకుంటోంది. పలు హిట్‌ చిత్రాల్లో మెరిసి, జాతీయ ఉత్తమ నటిగానూ నిలిచిన ఆమె ప్రస్తుతం నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాల్లోనే నటించాలనుకుంటోంది. తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘సంక్లిష్టమైన, ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో నటించడాన్ని నేను చాలా ఇష్టపడతా. సాఫీగా సాగిపోయే, ఆడిపాడే పాత్రలు కాకుండా ఛాలెంజింగ్‌గా ఉన్న పాత్రలనే ఇప్పుడు కోరుకుంటున్నా. సున్నితమైన, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి కాకుండా.. సవాళ్లతో కూడుకున్నవైతేనే ఆలోచిస్తా’ అంటూ మనసులో మాట బయట పెట్టింది. ‘దో పత్తీ’తో నిర్మాతగా మారడం వెనక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. ‘నటిగా చిత్ర నిర్మాణంలో నాకు కొన్ని మాత్రమే తెలుసు. నిర్మాత అయితే ప్రతి విషయంలో నా ప్రమేయం ఉంటుంది. నిర్మాణంలోని అన్ని దశల్నీ ఆస్వాదించొచ్చు. అందుకే నిర్మాతగా మారా’ అని తెలిపింది. ‘దో పత్తీ’లో కృతితోపాటు కాజోల్‌ ముఖ్య భూమిక పోషిస్తోంది.


అరవింద్‌ స్వామి కొత్తగా 

‘రోజా’, ‘బొంబాయి’ లాంటి సినిమాల్లో ప్రేమికుడిగా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు తమిళ నటుడు అరవింద్‌ స్వామి. ‘ధృవ’లో విలన్‌గానూ నటించి మెప్పించారీయన. మంగళవారం ఈయన పుట్టిన రోజు సందర్భంగా ‘మెయ్యాలగన్‌’ సినిమాలోని తన లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. హీరో కార్తి నటిస్తున్న 27వ చిత్రమిది. శ్రీ దివ్య కథానాయిక. ‘96’ ఫేం సి.ప్రేమ్‌ కుమార్‌ దర్శకుడు. ఈ యాక్షన్‌ డ్రామాని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అగ్ర కథానాయకుడు సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. రైలు ప్రయాణంలో పాటలు వింటూ.. ఏదో ఆలోచనలో ఉన్న అరవింద్‌ లుక్‌ ఆసక్తిగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని