మరో కథ విన్నారా!

వరుణ్‌ తేజ్‌ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం కరుణ కుమార్‌ దర్శకత్వంలో ‘మట్కా’ చేస్తున్న ఆయన.. ఆ తదుపరి చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించనున్నారు.

Published : 24 Jun 2024 00:54 IST

రుణ్‌ తేజ్‌ సినిమాల విషయంలో వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం కరుణ కుమార్‌ దర్శకత్వంలో ‘మట్కా’ చేస్తున్న ఆయన.. ఆ తదుపరి చిత్రాన్ని మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నటించనున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించనున్న ఈ సినిమా అక్టోబరులో చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదింకా సెట్స్‌పైకి వెళ్లకముందే వరుణ్‌ మరో ప్రాజెక్ట్‌కు సంతకాలు చేసినట్లు సమాచారం అందుతోంది. రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు విక్రమ్‌ సిరికొండ. ఆయన ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ కోసం ఓ ప్రేమకథను సిద్ధం చేసినట్లు తెలిసింది. దాన్ని ఇటీవలే వరుణ్‌కు వినిపించగా.. ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.


తెలుగు హీరోగా శివరాజ్‌కుమార్‌

‘గౌతమిపుత్ర శాతకర్ణి’, ‘జైలర్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ తదితర విజయవంతమైన చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు కన్నడ స్టార్‌ శివరాజ్‌కుమార్‌. ఇప్పుడాయన హీరోగా తెలుగులో తొలి సినిమా చేయనున్నారు. కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. ఎస్‌ఎన్‌.రెడ్డి, పి.సుధీర్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు. దీన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఇదొక ఆసక్తికర యాక్షన్‌ కథాంశంతో రూపొందనున్నట్లు సమాచారం. ఇందులో శివరాజ్‌కుమార్‌ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో.. సరికొత్త లుక్‌తో కనిపించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తయ్యాయి. సంగీత పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమాని పట్టాలెక్కించనున్నారు. మిగిలిన ప్రధాన తారాగణం వివరాల్ని త్వరలో ప్రకటించనున్నారు. సంగీతం: సామ్‌ సీఎస్, ఛాయాగ్రహణం: ఎ.జె.శెట్టి. 


షాంఘై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ 

తేడాది అక్టోబరులో విడుదలై, ప్రేక్షకుల మనసు గెల్చుకున్న స్ఫూర్తిదాయక చిత్రం ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ సినిమా చైనాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘షాంఘై ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ప్రదర్శనకు ఎంపికైంది. ‘షాంఘై ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’ చిత్రం జూన్‌ 23న ప్రదర్శితమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన ఈ సినిమా ప్రదర్శన సమయంలో విక్రాంత్‌ మాస్సే స్వయంగా పాల్గొన్నారు’ అంటూ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ శర్మ జీవితం ఆధారంగా విధూ వినోద్‌ చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో విక్రాంత్‌ మాస్సే మరపురాని నటన ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఆయనకు జోడీగా మేధా శంకర్‌ నటించింది. 


ప్రేమ ‘మధురం’

దయ్‌ రాజ్, వైష్ణవి సింగ్‌ జంటగా రాజేశ్‌ చికిలే తెరకెక్కించిన చిత్రం ‘మధురం’. ఎ మెమొరబుల్‌ లవ్‌.. అన్నది ఉపశీర్షిక. ఎం.బంగార్రాజు నిర్మాత. కోటేశ్వరరావు, కిట్టయ్య, దివ్యశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో నితిన్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ చాలా ఆసక్తికరంగా ఉంది. మంచి ప్రేమకథ చూపించనున్నట్లు అర్థమవుతోంది. ఇది కచ్చితంగా విజయవంతమవుతుంది. చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘1990ల నేపథ్యంలో జరిగే టీనేజ్‌ ప్రేమకథ ఇది. అప్పటి స్కూల్‌ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపించనున్నాం’’ అన్నారు దర్శకుడు రాజేశ్‌.


మత్స్యకారుల సమస్యలతో.. ‘రేవు’

వంశీరామ్‌ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏవూరి హరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రేవు’. హరినాథ్‌ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాని మురళీ గింజుపల్లి నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ఫ్యాషన్‌ షో, ప్రత్యేక పార్టీని నిర్వహించారు. మురళీ మోహన్, రామ్‌గోపాల్‌ వర్మ, అనన్య నాగళ్ల, సంపత్‌ నంది తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ మాట్లాడుతూ.. ‘‘మత్స్యకారుల జీవితాల్లోని సమస్యల్ని ఇతివృత్తంగా చేసుకుని ఇంత మంచి చిత్రం చేయడం బాగుంది. దీని ద్వారా చిత్ర బృందానికి విజయం దక్కాలని కోరుకుంటున్నా’’ అన్నారు.  ఈ కార్యక్రమంలో మురళీ గింజుపల్లి, ఉత్తేజ్, ప్రభు, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని