విభిన్నమైన ఆధ్యాత్మిక థ్రిల్లర్‌

ఆది సాయికుమార్, అవికా గోర్‌ జంటగా షణ్ముగం సాప్పని తెరకెక్కిస్తున్న చిత్రం ‘షణ్ముఖ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Published : 26 Jun 2024 01:31 IST

ది సాయికుమార్, అవికా గోర్‌ జంటగా షణ్ముగం సాప్పని తెరకెక్కిస్తున్న చిత్రం ‘షణ్ముఖ’. తులసీరామ్‌ సాప్పని, షణ్ముగం, రమేశ్‌ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు షణ్ముగం మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన ఆధ్యాత్మిక థ్రిల్లర్‌. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని ఆసక్తికర అంశంతో తెరకెక్కిస్తున్నాం. గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. తప్పకుండా ఇది ఆది కెరీర్‌లో మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.


‘ఆయ్‌’.. వస్తున్నాం 

జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై నార్నే నితిన్, నయన్‌ సారిక జంటగా తెరకెక్కుతున్న ‘ఆయ్‌’ విడుదల ఖరారైంది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాణ సంస్థ మంగళవారం ప్రకటించింది. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బన్నీ వాస్, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పకులు.  ‘‘గోదావరి ప్రాంతం   నేపథ్యంలో సాగే చిత్రమిది. వినోదం, ఆహ్లాదం మేళవింపుగా ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. ఇప్పటికే పాటలతోపాటు, పాత్రలకు సంబంధించిన టీజర్‌ని విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సరైన సమయంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌ కళ్యాణి, సంగీతం: రామ్‌ మిర్యాల, కూర్పు: కోదాటి పవన్‌కల్యాణ్, కళ: కిరణ్‌ కుమార్‌ మన్నె.


దెయ్యాన్ని బంధించేదెవరు? 

భిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘స్త్రీ 2’ ఒకటి. ఈ హారర్‌ కామెడీలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠీ, అపర్శక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. అమర్‌ కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా ఓ ప్రత్యేక పాత్రలో మెరవనుంది. మంగళవారం ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. చండేరీ పట్టణంలో వరుసపెట్టి భయానక సంఘటనలు జరుగుతుంటాయి. ఆ దుష్ట ఆత్మలను బంధించి, తమ పట్టణాన్ని రక్షించుకునే సాహసానికి కొందరు పూనుకుంటారు. ఇంతకీ వాళ్లు ఆ దెయ్యాన్ని పట్టుకున్నారా.. లేదా? అన్నది తెరపైనే చూడాలి. ‘ఈ స్వాతంత్య్ర దినోత్సవాన చండేరీ మరింత భయోత్పాతానికి గురవుతుంది’ అని టీజర్‌లో ఆఖర్లో ప్రకటించడంతో ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మడోక్‌ ఫిల్మ్స్‌ పతాకంపై దినేష్‌ విజన్‌ ఈ సినిమాని నిర్మించారు.


ప్రతిభకు పట్టం 

సినిమా రంగంలో ప్రతిభకు పట్టం కట్టడమే ధ్యేయంగా విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు పేరుపై పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నట్టు కళా వేదిక, రాఘవి మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నెల 29న హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ఫిలిం అవార్డ్స్‌ని సినీ పరిశ్రమలోని అన్ని విభాగాల్లోని ప్రతిభావంతులకు ప్రదానం చేస్తున్నట్టు ఆ సంస్థలు తెలిపాయి. ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరవుతున్నట్టు పేర్కొన్నాయి. వేడుకకి సంబంధించిన పోస్టర్‌ని మంత్రి మంగళవారం ఆవిష్కరించారు. సినీ, వ్యాపార, రాజకీయ రంగ ప్రముఖులతోపాటు, ఎన్టీఆర్‌ అభిమానుల సమక్షంలో పురస్కారాల్ని ప్రదానం చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, శ్రీను, భువన పాల్గొన్నారు.

en

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని