‘సికందర్‌’ సెట్లో సత్యరాజ్‌

‘సికందర్‌’ కోసం తొలిసారి తెరపై రొమాన్స్‌ చేయనుంది సల్మాన్‌ఖాన్, రష్మికల జోడీ. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాత.

Published : 05 Jul 2024 01:17 IST

‘సికందర్‌’ కోసం తొలిసారి తెరపై రొమాన్స్‌ చేయనుంది సల్మాన్‌ఖాన్, రష్మికల జోడీ. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నారు. సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మాత. ఎన్నో అంచనాల మధ్య ముస్తాబవుతున్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు సత్యరాజ్‌ భాగమయ్యారు. ఈ విషయాన్ని చిత్రబృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ.. ఆయనకి స్వాగతం పలికింది. ఇందులో బాలీవుడ్‌ నటుడు ప్రతీక్‌ బబ్బర్‌ కూడా కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపింది. ఈ ఇద్దరితో దర్శకుడు, నిర్మాత భార్య వర్దా నడియాడ్‌వాలా కలిసి ఉన్న ఫొటోని నిర్మాణ సంస్థ ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఇటీవలే తొలి షెడ్యూల్‌ని ముంబయిలో పూర్తి చేసుకున్నారు సల్మాన్‌. తదుపరి షెడ్యూల్‌ని ఆగస్టులో మొదలుపెట్టనున్నట్లు సమాచారం. త్వరలో రష్మిక కూడా చిత్రీకరణలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.


రాజ్‌కుమార్‌ యాక్షన్‌కు సిద్ధం  

ప్రేమకథలు, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకులను మెప్పిస్తున్న రాజ్‌  కుమార్‌ రావ్‌.. ఇప్పుడు రూటు మార్చి యాక్షన్‌ బాట పట్టాడు. ఆయన ప్రధాన పాత్రలో ‘భక్షక్‌’ ఫేమ్‌ పుల్కిత్‌ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు  తెలుస్తోంది. ‘‘ఈ ప్రాజెక్టుతో రాజ్‌కుమార్‌ మునుపెన్నడూ చూడని విధంగా కనిపించబోతున్నారు. పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్న ఈ చిత్రానికి ‘మాలిక్‌’ పేరు పరిశీలనలో ఉంది. ‘ట్వెల్త్‌ ఫెయిల్‌’తో మెప్పించిన మేధా శంకర్‌ ఇందులో కథానాయికగా నటించనుంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం ఇప్పటికే కసరత్తులు కూడా ప్రారంభించారు. సెప్టెంబరులో దీన్ని సెట్స్‌ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నార’’ని సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘స్త్రీ 2’తో బిజీగా ఉన్నాడు రాజ్‌కుమార్‌. 


ఇకపై నేర్చుకోబోయేదే పాఠం 

‘జైలర్‌’, ‘కెప్టెన్‌ మిల్లర్‌’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిసిన కన్నడ సీనియర్‌ కథానాయకుడు శివరాజ్‌కుమార్‌.. తాజాగా ‘భైరవనకొనే పాట’ అనే ప్రాజెక్టును ప్రకటించారు. ‘సప్తసాగరాలు దాటి’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హేమంత్‌ రావ్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా టైటిల్‌ పోస్టర్‌ను పంచుకుంది చిత్రబృందం. ‘‘మనం ఇకపై నేర్చుకోబోయేదే అన్నింటి కన్నా పెద్ద పాఠం’’ అని వ్యాఖ్యల్ని జోడించింది. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైశాఖ్‌ జే గౌడ నిర్మిస్తున్నారు. త్వరలో చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు తెలిపారు.


యాక్షన్‌ జీబ్రా 

త్యదేవ్, డాలీ ధనంజయ హీరోలుగా ఈశ్వర్‌ కార్తీక్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘జీబ్రా’. ఎస్‌ఎన్‌ రెడ్డి, ఎస్‌.పద్మజ, బాలసుందరం, దినేష్‌ సుందరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, జెన్నిఫర్‌ పిచినాటో కథానాయికలు. సత్యరాజ్, సునీల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గురువారం సత్యదేవ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సత్య అందులో సూట్‌లో స్టైలిష్‌ లుక్‌లో సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ‘‘ఇదొక ఆసక్తికర యాక్షన్‌ థ్రిల్లర్‌. దీంట్లో సత్యదేవ్‌ పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్రవర్గాలు తెలిపాయి. సంగీతం: రవి బస్రూర్, ఛాయాగ్రహణం: సత్య పొన్మార్‌. 


అండగా ఉంటాం

సమాజాన్ని పట్టి పీడిస్తున్న మాదక ద్రవ్యాలు, సైబర్‌ నేరాల నిర్మూలనలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ అండగా నిలుస్తుందని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్ష, కార్యదర్శులు దిల్‌రాజు, కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్, కె.శివప్రసాద్‌ ఓ ప్రకటనలో తెలిపారు. బాధ్యతాయుతమైన విషయాల్లో పరిశ్రమ ముందుందని, ఈ విషయంపై త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కలవనున్నట్టు అందులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని