అందాల ప్రణయ గోదారి

సదన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ కథానాయిక. సునీల్‌ రావినూతల ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

Published : 06 Jul 2024 01:20 IST

సదన్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రణయ గోదారి’. ప్రియాంక ప్రసాద్‌ కథానాయిక. సునీల్‌ రావినూతల ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. పి.ఎల్‌.విఘ్నేశ్‌ దర్శకుడు. పి.ఎల్‌.వి.క్రియేషన్స్‌ పతాకంపై పారుమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సాయికుమార్‌... పెదకాపు అనే ఓ శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. ఆ పాత్రకి సంబంధించిన పోస్టర్‌ని శుక్రవారం మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విడుదల చేశారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘గోదావరి అందాలే కాదు, అక్కడి ప్రజల జీవన విధానాలు ఈ చిత్రంలో కనిపిస్తాయ’’న్నారు.


శివతాండవం 

షెరాజ్‌ మెహ్దీ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పౌరుషం - ది మ్యాన్‌ హుడ్‌’. సుమన్‌ తల్వార్, మేకా రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశోక్‌ ఖుల్లార్, దేవేంద్ర నేగి నిర్మాతలు. లాస్‌ ఏంజెలిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాల చుట్టూ... నేటి సమాజానికి అద్దం పట్టే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు  సినీ వర్గాలు తెలిపాయి. ‘వాడు మనిషి కాదు.. శివుడి అంశ. తేడా వస్తే తాండవమే...’ అనే సంభాషణతోపాటు, యాక్షన్‌ ఘట్టాలు ట్రైలర్‌కి ఆకర్షణగా నిలిచాయి. ఆమని, గీతారెడ్డి, జ్యోతిరెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కావేటి ప్రవీణ్‌.


నజభజ జజర... కథలెన్నో వినరా 

హర్షరోహన్, కార్తికేయ దేవ్, సాన్వీ మేఘన, నిహాల్‌ కోదాటి ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘టుక్‌ టుక్‌’. సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనతో కలిసి రాహుల్‌ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్, శ్రీరాములరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘నజభజ జజర కథలెన్నో వినరా... మన కథ విననిది రా...’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. సంతు ఓంకార్‌ స్వరకల్పనలోని ఈ పాటను, ఆయనే ఆలపించారు.  దర్శకుడు సుప్రీత్‌ సాహిత్యం అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సరికొత్త ఫాంటసీ అంశాలతో కూడిన ఆహ్లాదకరమైన చిత్రమిది. కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు పూర్తిగా సంతృప్తిని పంచుతుంది. యువతరానికి నచ్చే అంశాలెన్నో ఈ చిత్రంలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కార్తీక్‌ సాయికుమార్‌.


జీవితమే ఓ పరీక్ష 

‘ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతారు... కానీ జీవితం పరీక్షలు పెట్టి గుణపాఠం చెబుతుంద’ని తన విద్యార్థులకి బోధించాడు ఓ ఉపాధ్యాయుడు. మధ్య తరగతి తండ్రిగా, ఉపాధ్యాయుడిగా జీవితంలో ఆయనకి ఎదురైన అనుభవాలు ఎలాంటివో తెలియాలంటే ‘సారంగదరియా’ చూడాల్సిందే. రాజా రవీంద్ర, శ్రీకాంత్‌ అయ్యంగార్, శివ చందు, యశస్విని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమిది. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఉమాదేవి, శరత్‌చంద్ర చల్లపల్లి నిర్మాతలు. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా కథానాయకుడు నిఖిల్‌ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.


పిలగాడి పాట 

తెలంగాణ నేపథ్యంలో సాగే హాస్యభరితమైన వ్యంగ్య చిత్రం ‘పైలం పిలగా’. సాయితేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించారు. ఆనంద్‌ గుర్రం దర్శకత్వం వహించారు. రామకృష్ణ బొద్దుల, ఎస్‌.కె.శ్రీనివాస్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘సోడు సోడు నొక్కమే నీ సోకు...’ అంటూ సాగే పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. యశ్వంత్‌ నాగ్‌ స్వరపరిచిన ఈ గీతానికి ఆనంద్‌ గుర్రం సాహిత్యం సమకూర్చగా, రామ్‌ మిర్యాల ఆలపించారు. పాట విడుదల అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘మంచి సాహిత్యానికి మంచి బాణీ తోడైతే ఆ పాట ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాంటి మంచి పాటల్లో ఇది నిలుస్తుందని ఆశిస్తున్నా. పాటతోపాటు, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నా’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఫీల్‌గుడ్‌ కథలు, మంచి కాన్సెప్ట్‌ ఉన్న సినిమాలతో  విజయాల్ని సొంతం చేసుకోవచ్చని నిరూపించారు శేఖర్‌ కమ్ముల. అలాంటి చిత్రమే ఇది కూడా. ఆయన ప్రోత్సాహం మరువలేనిది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని