ఆలస్యంగా సబర్మతీ రిపోర్ట్‌

ఎంతో మంది జీవితాల్ని మార్చేసిన గోద్రా రైలు దహన కాండలోని రహస్యాలను ప్రపంచానికి చూపించడానికి వస్తోంది ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది.

Published : 07 Jul 2024 01:52 IST

ఎంతో మంది జీవితాల్ని మార్చేసిన గోద్రా రైలు దహన కాండలోని రహస్యాలను ప్రపంచానికి చూపించడానికి వస్తోంది ‘ది సబర్మతీ రిపోర్ట్‌’. బాలీవుడ్‌ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. రజన్‌ చందేల్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 2న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే తెలిపింది చిత్రబృందం. ఇప్పుడు దీని కోసం ప్రేక్షకులు మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే. తాజాగా ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ‘‘ఇందులో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను మరోసారి చిత్రీకరించడానికి మరింత సమయం తీసుకోవడమే ఈ చిత్ర వాయిదాకు ముఖ్యకారణం. త్వరలో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నార’’ని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో జర్నలిస్ట్‌ సమర్‌ కుమార్‌ పాత్రలో కనిపించనున్నారు విక్రాంత్‌. 


చూశాలే నాలో నీకలనే.. దాచానే నాలో ఆ కలనే! 

ల్లు శిరీష్‌ త్వరలో ‘బడ్డీ’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. శామ్‌ ఆంటోన్‌ దీన్ని తెరకెక్కించారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా, అధన జ్ఞానవేల్‌ రాజా నిర్మాతలు. గాయత్రి భరద్వాజ్‌ కథానాయిక. అజ్మల్‌ కీలక పాత్ర పోషించారు. ఈ నెల 26న రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఈ చిత్రం నుంచి ‘‘ఫీల్‌ ఆఫ్‌ బడ్డీ’ పాటను విడుదల చేశారు. ‘‘చూశాలే చూశాలే.. నాలో నీకలనే.. దాచాలే దాచాలే.. నాలో ఆ కలనే’’ అంటూ సాగిన ఆ గీతానికి హిప్‌హాప్‌ తమిళ స్వరాలు సమకూర్చడమే గాక ఐరా ఉడుపితో కలిసి స్వయంగా ఆలపించారు. సాయి హేమంత్‌ సాహిత్యమందించారు. 


పిల్లా.. ప్రేమించానే 

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో రైటర్‌ మోహన్‌ తెరకెక్కించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’. వెన్నపూస రమణ రెడ్డి నిర్మించారు. స్నేహ గుప్తా, బాహుబలి ప్రభాకర్, మురళీధర్‌ గౌడ్, రవితేజ మహాదాస్య తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ‘‘ప్రేమించానే పిల్లా’’ అనే గీతాన్ని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. ఈ పాటకు సునీల్‌ కశ్యప్‌ స్వరాలు సమకూర్చగా.. పూర్ణాచారి సాహిత్యమందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ‘‘వినోదం నిండిన క్రైమ్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఓవైపు ఉత్కంఠభరితంగా సాగుతూనే ఆద్యంతం నవ్విస్తుంది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: అవినాష్‌ గుర్లింక..


ప్రేమకథకి ముగింపు ఆ రోజే 

ళ్ల ప్రేమకథలో ఎన్ని మలుపులో..దశాబ్దాలు గడిచిన ఆ ప్రేమ కోసం ఎన్ని ఎదురుచూపులో...ఇలా మరణంలేని ఓ వినూత్నమైన ప్రేమకథను తెరపై చూపించేందుకు ‘ఔరో మే కహా దమ్‌ థా’ చిత్రబృందం సిద్ధమైంది. బాలీవుడ్‌ సీనియర్‌ నాయకానాయికలు అజయ్‌ దేవగణ్, టబు ప్రేమికులుగా నటిస్తున్న చిత్రమిది. నీరజ్‌ పాండే దర్శకత్వంలో తెరకెక్కింది. సయీ మంజ్రేకర్, జిమ్మీ షెర్గిల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 5న విడుదల కావల్సి ఉండగా...అనుకోని కారణాల వల్ల కొత్త తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఆగస్టు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని