రాజమౌళి జీవితంపై డాక్యుమెంటరీ

భారతీయ సినిమాను ఆస్కార్‌ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించిన ఈయనపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌:ఎస్‌ ఎస్‌ రాజమౌళి’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ.

Published : 07 Jul 2024 01:57 IST

భారతీయ సినిమాను ఆస్కార్‌ వేదికపై సగర్వంగా నిలబెట్టిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి చిత్రాలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించిన ఈయనపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌:ఎస్‌ ఎస్‌ రాజమౌళి’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ. అనుపమ చోప్రా సమర్పణలో రాఘవ్‌ ఖన్నా దీన్ని రూపొందించారు. అప్లాజ్‌  ఎంటర్‌టైన్‌మెంట్, ఫిల్మ్‌ కంపెనీయన్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టర్‌ను పంచుకుందీ సంస్థ. ‘‘ఒక వ్యక్తి..  ఊహకందని ఆలోచనలు.. ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు. మరి ఇంత గొప్ప దర్శకుడి స్థానంలో నిలబడడం వెనక ఆయన పడిన కష్టమేంటి..? లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది..? తదితర అంశాలతో రూపొందించినదే ‘మోడ్రన్‌ మాస్టర్స్‌:ఎస్‌ఎస్‌ రాజమౌళి’. ఆగస్టు 2న విడుదల కాబోతుంద’’ని వ్యాఖ్యల్ని జోడించింది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌ మోనిక మాట్లాడుతూ.. ‘‘రాజమౌళి ఒక ఐకాన్‌. భారతీయ సినిమా రూపు రేఖల్ని మార్చిన ఆయన ఆలోచనలు..కథలతో, పాత్రలతో చేసే ప్రయోగాలే.. సినిమాల పట్ల ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం. ఈ డాక్యుమెంటరీలో జాతీయ, అంతర్జాతీయ సినీ ప్రముఖులు జేమ్స్‌ కామెరూన్, జో రుస్సో, కరణ్‌ జోహార్, ఆయనతో కలిసి పని చేసిన ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ లాంటి తదిరత కథానాయకులు రాజమౌళితో వారికున్న అనుబంధాన్ని పంచుకోనున్నార’’ని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని