ఫహాద్‌ డబ్బింగ్‌ షురూ..

‘జైలర్‌’తో హిట్‌ కొట్టి జోరుమీదున్నారు అగ్రకథానాయకుడు రజనీకాంత్‌. త్వరలో ‘వేట్టయాన్‌’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజే జ్ఞానవేల్‌ రాజా తెరకెక్కిస్తున్నారు.

Published : 08 Jul 2024 01:21 IST

జైలర్‌’తో హిట్‌ కొట్టి జోరుమీదున్నారు అగ్రకథానాయకుడు రజనీకాంత్‌. త్వరలో ‘వేట్టయాన్‌’తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టీజే జ్ఞానవేల్‌ రాజా తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, రానా, మంజువారియర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. తాజాగా ఇందులో కీలక పాత్రలో కనిపించనున్న ఫహాద్‌ ఫాజిల్‌ డబ్బింగ్‌ పనులు ప్రారంభించినట్లు తెలుపుతూ.. ఎక్స్‌ వేదికగా ఓ ఫొటోను పంచుకుంది నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌. ఈ సినిమా అక్టోబరు 10న రానుంది.


భావోద్వేగాలు నిండిన కథతో..

వి సిరోర్, నివిష్క పాటిల్‌ జంటగా ఎస్‌జీఆర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఎవరు ఎందుకు..?’. జి.వెంకటేశ్‌ రెడ్డి నిర్మించారు. అనురాధ, జగ్గప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నిర్మాత వెంకటేశ్‌ రెడ్డి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ హిందూపూర్‌ అధ్యక్షుడిగా ఎప్పట్నుంచో ఉన్నారు. ఆయన ఈరోజు నిర్మాతగా మారడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ప్రభాస్‌ అభిమానుల నుంచి ఇండస్ట్రీకి దర్శకులు, నిర్మాతలు, హీరోలు రావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథా చిత్రమిది. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తప్పకుండా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత. ఎస్‌జీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మంచి కుటుంబ కథాంశంతో దీన్ని తెరకెక్కించాం. హిందూపూర్‌ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాం. దీంట్లో మూడు పాటలున్నాయి. వాటిని నేనే రాశాను’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సతీష్‌ ఆర్యన్, ఛాయాగ్రహణం: సి.మహేంద్రన్‌.


నవ్వించే ‘డార్లింగ్‌’

‘ప్రియదర్శి సినిమాలు చూస్తున్నప్పుడు.. ‘మన దగ్గరకు ఇలాంటి కథలెందుకు రావ’ని ఎన్నోసార్లు అనుకున్నా. ఇప్పుడీ ‘డార్లింగ్‌’ చిత్ర విషయంలోనూ అలాగే అనిపిస్తోంది. ఏదేమైనా దర్శి గెలిస్తే నేను గెలిచినట్లే’’ అన్నారు హీరో విష్వక్‌సేన్‌. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో ‘డార్లింగ్‌’ చిత్ర ట్రైలర్‌ విడుదల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా అశ్విన్‌రామ్‌ తెరకెక్కించిన సినిమానే ‘డార్లింగ్‌’. కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. బ్రహ్మానందం, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 19న విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విష్వక్‌ మాట్లాడుతూ.. ‘‘బలగం’, ‘మల్లేశం’ లాంటి చిత్రాలు అందరికీ పడవు. రాసి పెట్టుండాలి. ఇప్పుడు ప్రియదర్శి ఈ చిత్రంతో రావడం చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్‌ చాలా వినోదాత్మకంగా ఉంది’’ అన్నారు. ఆద్యంతం నవ్విస్తూ..ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా ఉంటుందన్నారు దర్శకుడు. నభా నటేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నాక కొత్తదనమున్న సినిమాలు చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ కథ నా దగ్గరకొచ్చింది’’ అంది. ‘‘డార్లింగ్‌ అంటే అందరికీ ప్రభాస్‌ అన్న గుర్తొస్తారు. కథను నమ్మే దీనికి తన డార్లింగ్‌ పేరు పెట్టుకున్నాం’’ అన్నారు హీరో ప్రియదర్శి. ఈ కార్యక్రమంలో చైతన్య రెడ్డి, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.


‘కలి..’ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ 

ప్రిన్స్, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో శివ శేషు తెరకెక్కించిన చిత్రం ‘కలి’. లీలా గౌతమ్‌ వర్మ నిర్మించారు. నేహా కృష్ణన్‌ కథానాయిక. కె.రాఘవేంద్రరెడ్డి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆదివారం విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘టీజర్‌ ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఉంది. దర్శకుడు శేషు ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు అర్థమవుతోంది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు. ‘‘కలి పాత్ర నేపథ్యంతో సాగే ఆసక్తికర సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఇది. నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు చిత్ర సమర్పకులు. లీలా గౌతమ్‌ మాట్లాడుతూ.. ‘‘మైథాలజీ, సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జానర్స్‌ను కలిపి తీసిన సినిమా ఇది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందిస్తుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని