రేసింగ్‌ కిక్‌నిచ్చేలా ఎఫ్‌1

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ నుంచి వస్తున్న రేసింగ్‌ అడ్వెంచరస్‌ చిత్రం ‘ఎఫ్‌ 1’. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకి జోసెఫ్‌ కొసిన్‌స్కీ దర్శకత్వం వహిస్తున్నారు.

Published : 10 Jul 2024 00:54 IST

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో బ్రాడ్‌ పిట్‌ నుంచి వస్తున్న రేసింగ్‌ అడ్వెంచరస్‌ చిత్రం ‘ఎఫ్‌ 1’. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ సినిమాకి జోసెఫ్‌ కొసిన్‌స్కీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్ములా వన్‌ రేస్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదలైంది. ఇందులో హై ఆక్టేన్‌ యాక్షన్‌ సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. బ్రాడ్‌పిట్‌ ఫార్ములా వన్‌ రేసర్‌గా కనిపించారు. రేసులో ప్రత్యర్థులతో తలపడుతూ తృటిలో భయంకరమైన ప్రమాదాల నుంచి తప్పించుకోవడం చూపించారు. డామ్సన్‌ ఇడ్రిస్, జేవియర్‌ బార్డెమ్, కెర్రీ కాండన్‌ కీలక భూమికలు పోషిస్తున్న ఈ హాలీవుడ్‌ సినిమా వచ్చే ఏడాది జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.


కాన్సెప్ట్‌ ప్రధానంగా ‘కళింగ’

ధృవ వాయు ప్రధాన పాత్రధారిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్‌ కథానాయిక. ఆడుకాలం నరేన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌నీ ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.  ‘‘కాన్సెప్ట్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. లుక్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచే సినిమా అవుతుంద’’ని చిత్రవర్గాలు చెప్పాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అక్షయ్‌ రామ్‌ పొడిశెట్టి, సంగీతం: విష్ణు శేఖర, అనంత నారాయణన్‌.ఎ.జి, కూర్పు: నరేశ్‌ వేణువంక.


చిత్రీకరణ డల్లాస్‌లో

నసంతా నువ్వే’, ‘నేనున్నాను’ తదితర గుర్తుండిపోయే చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య. ఆయన మరో కొత్త చిత్రం కోసం రంగంలోకి దిగారు. కుటుంబమంతా కలిసి చూసేలా తన మార్క్‌ ఫీల్‌గుడ్‌ వినోదంతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఓఎంజీ ప్రొడక్షన్‌ హౌస్‌ పతాకంపై డా.మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం అమెరికాలోని డల్లాస్‌లో జరగనుంది. త్వరలోనే చిత్రీకరణని ప్రారంభిస్తారు. ఈ చిత్రం కోసం డల్లాస్‌లో ఆడిషన్స్‌ నిర్వహించారు. భారతీయులే కాకుండా  అమెరికన్లు, ఆఫ్రికన్లు, యూరోపియన్లు ఈ ఆడిషన్స్‌కి హాజరైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమాకి ఇంత స్పందన రావడం ఆనందంగా ఉందని వి.ఎన్‌.ఆదిత్య ఓ ప్రకటనలో  తెలిపారు.


పేకమేడలు.. వినోదం మాత్రమే కాదు! 

గటి కలలతోనే జీవితాన్ని గడిపేసే ఓ భర్త. బాధ్యతగా మెలుగుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ఓ భార్య. ఆయన పేరు లక్ష్మణ్, ఆమె పేరు వరలక్ష్మి. ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అన్నట్టుగా గడిపే భర్త వల్ల వరలక్ష్మి ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంది? ఈ ఇద్దరి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేమిటి? అవి కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేశాయి? తదితర విషయాలు తెలియాలంటే ‘పేకమేడలు’ చూడాల్సిందే. వినోద్‌ కిషన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. అనూష కృష్ణ కథానాయిక. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాకేశ్‌ వర్రే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటనలకి దగ్గరగా ఉంటుందీ కథ. భావోద్వేగాలు, వినోదం కలబోతగా ఈ చిత్రాన్ని  రూపొందించాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇది కామెడీ సినిమా మాత్రమే కాదు. మగవాళ్లకు ఇంట్లో మహిళలు అందిస్తున్న సహకారం ఎలాంటిదో ఇందులో చర్చించాం. హాస్యం, భావోద్వేగాలు మేళవింపుగా రూపొందిన ఈ సినిమా ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. కథానాయకుడు మాట్లాడుతూ ‘‘తెలుగులో హీరోగా ఇదే నా తొలి చిత్రం. ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. నవ్విస్తుంది, భావోద్వేగానికి గురిచేస్తుంది’’ అన్నారు. ప్రేక్షకులకు ఓ మంచి అనుభవాన్ని పంచుతుందీ చిత్రం అన్నారు అనూష కృష్ణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని