నచ్చితే ఇద్దరికీ.. నచ్చకపోతే పదిమందికి చెప్పండి

రవికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ద బర్త్‌డే బాయ్‌’. విస్కి దర్శకుడు. ఐ.భరత్‌ నిర్మాత. ఈ నెల 19న రానుంది.

Updated : 11 Jul 2024 00:58 IST

వికృష్ణ, సమీర్‌ మళ్లా, రాజీవ్‌ కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ద బర్త్‌డే బాయ్‌’. విస్కి దర్శకుడు. ఐ.భరత్‌ నిర్మాత. ఈ నెల 19న రానుంది. బుధవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. మొహాన్ని మాస్క్‌తో దాచిపెట్టుకున్న దర్శకుడు మాట్లాడుతూ  ‘‘నా జీవితంలో తొమ్మిదేళ్ల కిందట జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. ఈ సినిమా నచ్చితే ఇద్దరికి చెప్పండి, నచ్చకపోతే పదిమందికి చెప్పండి. నా అసలుపేరుని, నా మొహాన్ని సినిమా విడుదల తర్వాతే చూపిస్తా’’ అన్నారు. .నిర్మాత ఐ.భరత్‌ మాట్లాడుతూ ‘‘ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు ఆసక్తికరంగా ఉంటాయి’’ అన్నారు.


సినిమా పేరు.. క! 

కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా సుజీత్, సందీప్‌ సంయుక్త దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం రూపొందుతోంది. దీన్ని  శ్రీ చక్రాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చింతా  గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘క’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ ప్రచార చిత్రాన్ని బట్టి.. ఇందులో కిరణ్‌ ఓ విభిన్నమైన లుక్‌తో కనిపించనున్నట్లు అర్థమవుతోంది. ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. చిత్రీకరణ పూర్తయ్యింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సిఎస్, ఛాయాగ్రహణం: విశ్వాస్‌ డానియేల్‌.


మూడోసారి పొలిమేరలోకి

హారర్‌ థ్రిల్లర్‌ కథలతో రూపొందిన ‘మా ఊరి పొలిమేర’, ‘పొలిమేర 2’ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ సినిమాలకు కొనసాగింపుగా ‘పొలిమేర 3’ పట్టాలెక్కెందుకు సిద్ధమవుతోంది. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని వంశీ నందిపాటి, భోగేంద్ర గుప్తా నిర్మించనున్నారు. బుధవారం ఈ చిత్ర అనౌన్స్‌మెంట్‌ వీడియోను విడుదల చేశారు. గత రెండు భాగాల్లో నటించిన సత్యం రాజేశ్, బాలాదిత్య తదితరులు ఈ మూడో భాగంలోనూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.


ఇంటింటి కథతో.. ‘సారంగదరియా’ 

 ‘సామాజిక మాధ్యమాల ప్రభావం...నేటి ఉరుకులు పరుగుల జీవన శైలి కారణంగా   తల్లిదండ్రులు, వాళ్ల పిల్లల మధ్య దూరం పెరిగిపోయింది. అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులే కనిపించడం లేదు. ఇలాంటి పరిణామాలతోనే ఓ అధ్యాపకుడి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే’ అంటున్నారు రాజా రవీంద్ర. ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం ‘సారంగదరియా’. యశస్విని, మొయిన్, మోహిత్‌ కీలక పాత్రలు పోషించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌ చంద్ర నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 12న రానుంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. కథానాయకుడు నవీన్‌ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై బిగ్‌ టికెట్‌ని కొనుగోలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘రాజా రవీంద్ర ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ మాలాంటి నటులకు సలహాలు, సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తుంటారు. ట్రైలర్‌ చూస్తే ప్రతి ఇంట్లో జరిగే కథలా అనిపించింది’’ అన్నారు. ‘బలగం’ లాంటి బలమైన కథతో ఈ చిత్రం వస్తోందన్నారు రాజా రవీంద్ర. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సమానత్వం అనే కాన్సెప్ట్‌ ఈ కథకు మూలం’’ అన్నారు. 


అసభ్యకరమైన వీడియోల్ని తొలగించాల్సిందే

మా అధ్యక్షుడు మంచు విష్ణు

సామాజిక మాధ్యమాల్లో కొంతమంది చేసే అసభ్యకరమైన వ్యాఖ్యలు, ప్రవర్తనల వల్ల మొత్తం తెలుగువాళ్లకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కథానాయకుడు, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు. సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ వీడియోలు చేసేవాళ్లు, నటీనటులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవాళ్లు 48 గంటల్లో వాటిని తొలగించాలని, లేదంటే సైబర్‌ సెక్యూరిటీ అధికారులకు  ఫిర్యాదు చేయడంతోపాటు, అలాంటి యూ ట్యూబ్‌ ఛానళ్లు రద్దు అయ్యేలా న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఆయన ఓ వీడియోని విడుదల చేశారు. రెండు మూడేళ్లు కూడా లేని ఓ చిన్నారిపై  కొంతమంది అసభ్యకరంగా మాట్లాడటం చూసి ఒళ్లు జలదరించిందని, దీన్ని తమ్ముడు  సాయి దుర్గాతేజ్‌ ప్రశ్నిస్తూ చేసిన ఫిర్యాదుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.  డార్క్‌ హ్యూమర్‌ అనీ, ట్రోలింగ్‌ వీడియోస్‌ అనీ ఇలాంటివి పనులు చేసి దాక్కోవడం సరైంది కాదన్నారు.  ప్రముఖ నటుడు బ్రహ్మానందం సహా ఎంతో మంది నటీనటులు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కి ఫోన్‌ చేసి ఇలాంటి వీడియోలు చేస్తున్నవాళ్లపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు మంచు విష్ణు. దీనిపై దృష్టిపెట్టాలని మా అసోసియేషన్‌ తరఫున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రుల్ని కోరుతున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని