సర్‌ పే లాల్‌టోపీ రూసీ.. ఫిర్‌ భీ దిల్‌ హై హిందుస్థానీ

‘‘భారత్, రష్యాల నడుమ పటిష్ఠమైన సాంస్కృతిక బంధం ఏర్పడటంలో భారతీయ సినిమా గొప్ప పాత్ర పోషించింది. ఒకప్పుడు రష్యాలో ఇంటింటా మార్మోగిన ‘మేరా జూతా హై జాపానీ’ పాట పాతదే కావచ్చు.

Published : 11 Jul 2024 01:10 IST

రష్యాలో ప్రధాని మోదీ నోట భారతీయ సినిమా మాట

‘‘భారత్, రష్యాల నడుమ పటిష్ఠమైన సాంస్కృతిక బంధం ఏర్పడటంలో భారతీయ సినిమా గొప్ప పాత్ర పోషించింది. ఒకప్పుడు రష్యాలో ఇంటింటా మార్మోగిన ‘మేరా జూతా హై జాపానీ’ పాట పాతదే కావచ్చు. కానీ, అందులోని సెంటిమెంట్‌ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా ఉంది’’ - రెండు రోజుల రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలివి. రాజ్‌కపూర్‌ నటించిన ‘శ్రీ 420’ చిత్రంలోని పై పాట పల్లవి నుంచి రెండు చరణాలను ప్రధాని స్వయంగా ఆలపించారు కూడా. ‘సర్‌ పే లాల్‌టోపీ రూసీ..’ (తలపై ఎర్రని రష్యా టోపీ) అని పాడిన మోదీ సభికులను ఉత్సాహపరుస్తూ ‘ఫిర్‌ భీ..’ అనగానే.. ‘దిల్‌ హై హిందుస్థానీ’ అంటూ మిగతా చరణం జనం పూర్తి చేశారు. ఇలా ప్రధాని మూడుసార్లు పాడగా.. అంతే ఉత్సాహంతో సభికులు ‘దిల్‌ హై హిందుస్థానీ’ అన్నారు. భారతీయ సినీ కళాకారులు రాజ్‌కపూర్, మిథున్‌ దా (మిథున్‌ చక్రవర్తి) రష్యన్లను ఎంతో ప్రభావితం చేసి, ఇక్కడివారి మనసులు గెలిచారని మోదీ ప్రశంసించారు.

నేటి ఇంటర్నెట్‌ యుగంలో ఇక్కడ ‘ఊ అంటావా మావా’ అని పాట హిట్టవగానే మరుక్షణం ప్రపంచం నలుచెరగులా చేరిపోతోంది. సాంకేతికంగా ఈ అవకాశం లేని 40 - 50 ఏళ్ల కిందట రష్యాలో ఒకరకంగా భారత్‌ కంటే ఎక్కువగా రాజ్‌కపూర్, మిథున్‌ చక్రవర్తిల పేర్లు వినిపించాయి. ‘ఆవారా’(1951), ‘శ్రీ 420’ (1955) చిత్రాలతో రాజ్‌కపూర్‌కు రష్యాలో వీరాభిమానులు తయారయ్యారు. ఆవారాలోని ‘ఆవారా హూ’ అనే పాటతోపాటు ‘శ్రీ420’లోని ‘మేరా జూతా హై జాపానీ’ పాటలు రష్యాలో విపరీతంగా పాడుకున్నారు. ఇదే చిత్రంలోని ‘రామయ్యా.. వస్తావయ్యా’ పాట కూడా అక్కడ అంతే పాపులరైంది. నర్గీస్, దేవానంద్, బలరాజ్‌ సహానీ లాంటి సహ కళాకారుల బృందంతో కలిసి 1950లలో రాజ్‌కపూర్‌ మాస్కో పర్యటనకు వెళ్లగా రష్యన్లు బ్రహ్మరథం పట్టారు. మన దేశానికి అప్పుడే స్వాతంత్య్రం వచ్చి ‘ఇండియా, రూసీ - భాయీ భాయీ’ నినాదం బలంగా వినిపిస్తున్న రోజులవి. రాజ్‌కపూర్‌ నటించిన పై రెండు చిత్రాలు రష్యాలో (సబ్‌ టైటిల్స్‌తో) భారీ వసూళ్లు సాధించాయి. ‘సంగం’, ‘మేరా నామ్‌ జోకర్‌’, ‘బాబీ’ లాంటి ఆయన ఇతర చిత్రాలను కూడా అక్కడ బాగా ఆదరించారు. రష్యాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సినిమా క్లబ్బుల ద్వారా వీడియో క్యాసెట్లతో మధ్యరకం తెరలపై భారతీయ చిత్రాలను ప్రదర్శించేవారు.

మూడు దశాబ్దాల తర్వాత మిథున్‌ మేనియా..

1950ల నుంచి రాజ్‌కపూర్‌ హవా కొనసాగగా, మూడు దశాబ్దాల తర్వాత రష్యన్లలో మళ్లీ అంత క్రేజ్‌ సంపాదించుకున్న నటుడు మిథున్‌ చక్రవర్తి. 1982లో భారత్‌లో ఘనవిజయం సాధించిన ‘డిస్కోడ్యాన్సర్‌’ చిత్రం రెండేళ్ల తర్వాత రష్యాలో విడుదలైంది. ఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించిన పాటలకు రష్యన్లు ఊగిపోయారు. ఏ నోట విన్నా ‘జిమ్మీ జిమ్మీ.. ఆజా ఆజా’, ‘అయామ్‌ ఎ డిస్కోడ్యాన్సర్‌’ పాటలే. హోటళ్లలో గిటార్లపైనా ఈ సంగీతమే. ఆ రోజుల్లో నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో కారణం. పాశ్చాత్య సినిమాలు, సంగీతంపై రష్యా నిషేధం విధించడంతో భారతీయ సినిమాలు, సంగీతం రష్యన్లకు మరింత చేరువ అయ్యాయి. అప్పట్లో భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు గోర్బచెవ్‌కు మన ప్రధాని రాజీవ్‌గాంధీ ‘ఈయన మా సూపర్‌స్టార్‌’ అని అమితాబ్‌ బచ్చన్‌ను పరిచయం చేశారు. ‘నా కుమార్తెకు మిథున్‌ చక్రవర్తి మాత్రమే తెలుసు’ అని గోర్బచెవ్‌ బదులిచ్చారు. మన సినిమాల్లోని సంగీతం, నృత్యాలు రష్యన్లను అంతగా ప్రభావితం చేశాయి.

జి.ఎస్‌.జమీర్‌ హుసేన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని