రివ్యూ: ఎంత మంచివాడ‌వురా

కుటుంబ క‌థా చిత్రాల‌పై మక్కువ పెంచుకుంటున్నారు యువ క‌థానాయ‌కులు. ఇంటిల్లిపాదినీ మెప్పించ‌డంలో ఉన్న ఆనందమే వేర‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. అందుకే అవ‌కాశం రాగానే... మాస్ మంత్రం జ‌పించ‌డం వ‌దిలి, కుటుంబ క‌థ‌ల‌కి ప‌చ్చజెండా ఊపుతున్నారు.....

Published : 17 Jan 2020 14:57 IST
సినిమా: ఎంత మంచివాడవురా
న‌టీన‌టులు: క‌ల్యాణ్‌ రామ్‌, మెహ‌రీన్‌, సుహాసిని, న‌రేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ‌ర‌త్‌కుమార్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: రాజ్ తోట‌
కూర్పు: త‌మ్మిరాజు
క‌ళ‌: రామాంజ‌నేయులు
స‌మ‌ర్పణ‌: శివ‌లెంక కృష్ణప్రసాద్‌
నిర్మాత‌లు: ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త
దర్శకత్వం: స‌తీష్ వేగేశ్న
సంస్థ: ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్‌
విడుద‌ల‌ తేదీ: 15-01-2020

కుటుంబ క‌థా చిత్రాల‌పై మక్కువ పెంచుకుంటున్నారు యువ క‌థానాయ‌కులు. ఇంటిల్లిపాదినీ మెప్పించ‌డంలో ఉన్న ఆనందమే వేర‌ని వాళ్లు న‌మ్ముతున్నారు. అందుకే అవ‌కాశం రాగానే... మాస్ మంత్రం జ‌పించ‌డం వ‌దిలి, కుటుంబ క‌థ‌ల‌కి ప‌చ్చజెండా ఊపుతున్నారు. ఆ జాబితాలోకి క‌ళ్యాణ్‌రామ్ కూడా చేరారు. ‘118’తో గ‌తేడాది విజ‌యాన్ని అందుకున్న ఆయ‌న ఈసారి ‘ఎంత మంచివాడ‌వురా’ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. సంక్రాంతి సినిమాల్లో భాగంగా వ‌స్తున్న ఆఖ‌రి సినిమా ఇది. ‘శ‌త‌మానం భ‌వ‌తి’తో ఇంటిల్లిపాదినీ మెప్పించిన స‌తీష్ వేగేశ్న ద‌ర్శక‌త్వం వ‌హించారు. పండ‌గ సంద‌డి... కుటుంబ క‌థ కావ‌డంతో ఈ సినిమాపై కూడా మంచి అంచ‌నాలే నెల‌కొన్నాయి. మ‌రి చిత్రం ఎలా ఉంది? క‌ల్యాణ్‌రామ్ కుటుంబ క‌థ‌లో ఎలా ఒదిగిపోయారు?

క‌థేంటంటే: చిన్నప్పుడే బంధాల విలువ తెలుసుకుంటాడు బాలు (క‌ల్యాణ్‌ రామ్‌). త‌న చిన్ననాటి స్నేహితురాలైన నందిని (మెహ‌రీన్‌)తో క‌లిసి ల‌ఘు చిత్రాలు చేస్తుంటాడు. త‌న స్నేహితులంద‌రికీ అత‌ను బాలు మాత్రమే. కానీ శివ‌, సూర్య, రిషి... ఇలా ర‌క‌ర‌కాల పేర్లతో ఒక వృద్ధ జంట‌కి మ‌న‌వ‌డిగా, ఒకరికి కొడుకుగా, మ‌రొక‌రికి త‌మ్ముడిగా ఉంటూ అనుబంధాల్ని కొన‌సాగిస్తుంటాడు. ఎవ‌రూ లేని బాలు అలా వేరే వేరే పేర్లతో అన్ని కుటుంబాల‌కి ఎలా ద‌గ్గర‌య్యాడు. ఆచార్య పేరుతో మ‌రొక‌రి ఇంటికి వెళ్లాక ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి. ఇంత‌కీ బాలు ల‌క్ష్యమేమిటి? బాలుని ప్రేమించిన నందిని అత‌నితో జీవితాన్ని పంచుకుందా? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: బంధాలు.. అనుబంధాల చుట్టూ క‌థ సాగిందంటే మ‌న‌సుల్ని స్పృశించే భావోద్వేగాలు పండుతాయి. కుటుంబ క‌థా చిత్రాలు తెర‌కెక్కించడానికి కార‌ణం అదే. తెర‌పై క‌నిపించే పాత్రల‌తో ప్రేక్షకుడు ఎక్కడో ఒక చోట త‌నని తాను చూసుకుంటాడు. అందులోనే కుటుంబ క‌థా చిత్రాల విజ‌యం దాగి ఉంటుంది. ఈ క‌థ అయితే నేరుగా భావోద్వేగాల‌తో ముడిప‌డిన‌దే. అయిన‌వాళ్లకి దూర‌మైన మనుషుల‌కి ఆ లోటు తెలియ‌కుండా, ఆ బంధాల్ని భావోద్వేగాల్ని అందించ‌డ‌మే ఇందులో క‌థానాయ‌కుడి ప‌ని. అలాంట‌ప్పుడు మ‌రిన్ని భావోద్వేగాలు పండాలి. ప్రతి స‌న్నివేశం హృద‌యాల్ని స్పృశించాలి. ఆ విష‌యంలో ఈ సినిమా కొద్ది మేర‌కే ప్రభావం చూపిస్తుంది. పండాల్సిన చోట భావోద్వేగాలు పండ‌లేదు. ప్రేక్షకుడిని క‌థ‌లో లీనం చేయ‌డానికి చేసిన ప్రయ‌త్నాలు పెద్దగా ఫ‌లించ‌లేదు. మెహ‌రీన్ ఫ్లాష్ బ్యాక్‌తో క‌థ మొద‌లవుతుంది. అందులో హీరోహీరోయిన్ల చిన్ననాటి క‌థ ఉంటుంది. క‌థానాయ‌కుడు అన్ని పేర్లతో ఎందుకు చ‌లామ‌ణీ అవుతున్నాడు, అత‌ను ఏం చేస్తున్నాడ‌నే విష‌యం బ‌య‌టికొచ్చాకే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. బంధాల్ని స‌ర‌ఫ‌రా చేసే సంస్థని ప్రారంభించాక ప్రేక్షకుడిలో ర‌క‌ర‌కాల సందేహాలు ఉత్పన్నమ‌వుతాయి. వాటికి త‌గ్గట్టుగానే తెర‌పై స‌న్నివేశాలొస్తుంటాయి. నిజంగా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి బంధం కావాల‌ని వ‌స్తే ఏం జ‌రుగుతుంద‌నే ప్రశ్నలకి జ‌వాబు అన్నట్టుగా కొన్ని స‌న్నివేశాలు సాగుతాయి.

క‌థానాయ‌కుడు ఆచార్యగా త‌నికెళ్ల భ‌ర‌ణి ఇంటికి వెళ్లాకే క‌థ‌లో మ‌రింత సంఘ‌ర్షణ ఏర్పడుతుంది. అక్కడ ఇసుక మాఫియా నాయ‌కుడు గంగ‌రాజు (రాజీవ్ క‌న‌కాల‌)ని ఎదిరించే సంఘ‌ట‌న‌ల‌తో విరామ స‌న్నివేశాలొస్తాయి. ప్రథ‌మార్ధంతో పోలిస్తే, ద్వితీయార్ధం కాస్త ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. త‌నికెళ్ల భ‌ర‌ణికీ, ఆయ‌న కొడుకు ఆచార్యగా న‌టిస్తున్న క‌ల్యాణ్‌ రామ్‌కీ మ‌ధ్య స‌న్నివేశాలు హ‌త్తుకుంటాయి. అలాగే శ‌ర‌త్‌ బాబు, సుహాసిని, క‌ల్యాణ్‌ రామ్‌ల మ‌ధ్య స‌న్నివేశాలు కూడా మెప్పిస్తాయి. వెన్నెల కిషోర్ పాత్ర ప్రవేశించాక న‌వ్వులు పండాయి. ప‌తాక స‌న్నివేశాలు మాత్రం నాట‌కీయంగా అనిపిస్తాయి. స‌హ‌జత్వం లేని స‌న్నివేశాలు, ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా సాగే క‌థ‌నం ఏమాత్రం ఆస‌క్తిని రేకెత్తించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: క‌ల్యాణ్‌రామ్, మెహ‌రీన్ పాత్రలే ఈ సినిమాకి కీల‌కం. వాళ్లిద్దరూ చ‌క్కటి అభిన‌యం ప్రదర్శించారు. కుటుంబ క‌థ‌ని తొలిసారి చేసిన క‌ల్యాణ్‌రామ్ అందుకు త‌గ్గట్టుగా, ఇది వ‌ర‌క‌టి సినిమాల‌కి భిన్నంగా క‌నిపించే ప్రయ‌త్నం చేశారు. భావోద్వేగాలు పంచారు. మెహ‌రీన్ కూడా మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచారు. త‌నికెళ్ల భ‌ర‌ణి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, విజ‌య్ కుమార్ల పాత్రలు కూడా మెప్పిస్తాయి. వెన్నెల‌ కిషోర్ న‌వ్విస్తారు. న‌రేష్, ప్రవీణ్‌, ప్రభాస్ శ్రీను, భ‌ద్రం త‌దిత‌రులున్నా వాళ్ల పాత్రలు పెద్దగా పెద్దగా ఆకట్టుకోవు. సాంకేతిక విభాగంలో గోపీసుంద‌ర్ సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ఏమో ఏమో, ఔనో కాదో తెలియ‌ని.. పాట‌లు అల‌రిస్తాయి. నేప‌థ్య సంగీతం ప‌ర్వాలేద‌నిపిస్తుంది. రాజ్‌తోట కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు సినిమా స్థాయికి త‌గ్గట్టుగా ఉన్నాయి. ‘శ‌త‌మానం భ‌వతి’తో మెప్పించిన ద‌ర్శకుడు స‌తీస్ వేగేశ్న. ఆయ‌న ఏ సినిమా చేసినా ఆ స్థాయి ప్రమాణాలు ఆశిస్తారు. త‌న‌ది కాని క‌థ కావ‌డంతో ఆయ‌న ఇబ్బంది ప‌డిన‌ట్టు అనిపిస్తుంది.

బ‌లాలు బ‌ల‌హీన‌త‌లు
+ క‌ల్యాణ్‌రామ్‌, మెహ‌రీన్ న‌ట‌న - సాగదీత‌గా సాగే స‌న్నివేశాలు
+ సంగీతం - భావోద్వేగాలు
+ ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు - ప‌తాక స‌న్నివేశాలు

చివ‌రిగా.. అను‘బంధాల‌’ను పంచే మంచివాడు
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని