రివ్యూ: స్ట్రీట్‌ డ్యాన్సర్‌ త్రీడీ

నృత్య ప్రధాన చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు రెమో డిసౌజా. ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ‘ఏబీసీడీ: ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌’ ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌గా తీసిన  ‘ఏబీసీడీ 2’ కూడా విజయవంతమైంది. అందులో...

Updated : 14 Jan 2022 13:07 IST

చిత్రం: స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3D

నటీనటులు: వరుణ్‌ ధావన్‌, శ్రద్ధాకపూర్‌, ప్రభుదేవా, నోరా ఫతేహి, మురళీ శర్మ, పునీత్‌ పాథక్‌

సంగీతం: సచిన్‌-జిగార్‌, తనిష్క్‌ బాగ్చీ, బాద్‌షా, గురు రంద్వా

సినిమాటోగ్రఫీ: విజయ్‌కుమార్‌ అరోరా

ఎడిటింగ్‌: మానన్‌ అజయ్‌ సాగర్‌

నిర్మాత: భూషణ్‌కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, లిజెల్లా డిసౌజా

దర్శకత్వం: రెమో డిసౌజా

బ్యానర్‌: టి-సిరీస్‌, రెమో డిసౌజా

విడుదల తేదీ: 24-01-2020

నృత్య ప్రధాన చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు ప్రముఖ నృత్య దర్శకుడు రెమో డిసౌజా. ప్రభుదేవా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన ‘ఏబీసీడీ: ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌’ ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌గా తీసిన  ‘ఏబీసీడీ 2’ కూడా విజయవంతమైంది. అందులో వరుణ్‌ ధావన్‌, శ్రద్ధా కపూర్‌, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పుడు మళ్లీ వారితోనే మరో నృత్య ప్రధాన చిత్రం ‘స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3D’ని తెరకెక్కించారు రెమో. ఇందులో నోరా ఫతేహి అదనపు ఆకర్షణగా నిలవనుంది. అంతర్జాతీయ డ్యాన్స్‌ రియాలిటీ షోలో తలపడే స్ట్రీట్‌ డ్యాన్సర్ల కథతో ఈ చిత్రం రూపొందింది. భారత్‌కు చెందిన నృత్య బృందానికి నాయకుడిగా వరుణ్‌, పాకిస్థాన్‌ డ్యాన్స్‌ గ్రూప్‌కు సారథిగా శ్రద్ధ కనిపించనున్నారు. త్రీడీ సాంకేతికతతో తెరకెక్కిన ఈ చిత్రం సరికొత్త నృత్యాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపర్చటం ఖాయమని చిత్రబృందం చెబుతోంది. నృత్యానికి ఉన్న ప్రాముఖ్యంతో పాటు దానికున్న  సామాజిక బాధ్యతను ఇందులో ఆవిష్కరించనున్నారు. మరి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ఏ మేరకు ఆకట్టుకుంది?

కథేంటంటే: లండన్‌లో జరిగే అంతర్జాతీయ డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొనేందుకు భారత్‌, పాక్‌ల నుంచి కూడా నృత్య బృందాలు వస్తాయి. భారత బృందానికి సహేజ్‌ (వరుణ్‌), పాక్‌ గ్రూప్‌నకు ఇనాయత్‌ (శ్రద్ధ) సారథ్యం వహిస్తుంటారు. ఆ రెండు బృందాలు ఎదుటి దేశం మీద ద్వేషంతో రగిలిపోతూ తరచూ గొడవ పడుతుంటాయి. ఎలాగైనా సరే ప్రత్యర్థులను ఓడించాలని ఉంటాయి. ఇదిలా ఉండగా రామ్‌ ప్రసాద్‌ (ప్రభుదేవా) అనే ప్రముఖ డ్యాన్సర్‌తో వారికి పరిచయం ఏర్పడుతుంది. డ్యాన్స్‌ అనే కళను మన విజయం కోసం కాదు.. సాటి  మనిషికి సాయం చేసేందుకు ఉపయోగించాలని వారికి హితబోధ చేస్తాడు. రెండు దేశాల బృందాలు కలసికట్టుగా ఓ సామాజిక సమస్యపై పోరాడమని సూచిస్తాడు. అతని మాట ప్రకారమే వారు కలసి ముందడుగేస్తారు. రామ్‌ ప్రసాద్‌ చెప్పిన ఆ సామాజిక సమస్య ఏంటి? దాని పరిష్కారం కోసం భారత్‌, పాక్‌ బృందాలు ఏం చేశాయి? దేశాల మధ్య ఐక్య భావనను సాధించేందుకు డ్యాన్స్‌ ఎలా ఉపయోగపడిందన్నది కథాంశం.

ఎలా ఉందంటే: రెమో డిసౌజా తెరకెక్కించిన గత చిత్రాలు ‘ఏబీసీడీ: ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌’, దాని సీక్వెల్‌ ‘ఏబీసీడీ 2’ల మాదిరిగానే ఇది కూడా నృత్య ప్రధానంగా సాగుతుంది. అయితే, రెండు దేశాలకు చెందిన గ్రూపులు పోటీ పడితే ఎలా ఉంటుందన్న అంశానికి ఒక సామాజిక సమస్యను జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. ప్రథమార్ధమంతా సహేజ్‌, ఇనాయత్‌ గ్రూప్‌లు లండన్‌కు రావడం, వారి మధ్య జరిగే స్ట్రీట్‌ డ్యాన్స్‌, పోటీలతో ఉత్సాహంగా సాగుతుంది. ఒకరితో ఒకరు పోటీ పడి చేసిన డ్యాన్స్‌లు ప్రేక్షకులను అలరిస్తాయి. వారి వెనకనున్న డ్యాన్సర్లు కూడా అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ పట్ల వరుణ్‌, శ్రద్ధాలకు ఉన్న ప్యాషన్‌ వారి వేసే ప్రతి స్టెప్‌లోనూ కనిపిస్తుంది. ఎప్పుడైతే రామ్‌ ప్రసాద్‌ సీన్‌లోకి వచ్చాడో అప్పటి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ఇరు దేశాల మధ్య ఉన్న పోటీని కాస్త.. ఒక సామాజిక సమస్య కోసం పోరాటం చేసే దిశగా తీసుకెళ్తాడు. అయితే, ఆయా సన్నివేశాలను భావోద్వేగంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు తడబడ్డాడు. డ్యాన్స్‌ సన్నివేశాలపై చూపించిన శ్రద్ధలో సగం ఎమోషనల్‌ సీన్స్‌పై చూపిస్తే మరింత బాగుండేది.

ఎవరెలా చేశారంటే: వరుణ్‌, శ్రద్ధాలు ఈ సినిమాలో చేసిన డ్యాన్స్‌లను చూస్తే, ప్రాణం పెట్టి చేశారనిపిస్తుంది. ప్రత్యర్థులుగా బరిలోకి దిగిన వీరు ఒకరికి పోటీగా మరొకరు చేసిన డ్యాన్స్‌లు మెప్పిస్తాయి. ప్రథమార్ధమంతా నువ్వా-నేనా అన్న రీతిలో డ్యాన్స్‌లతో అదరగొట్టారు. వరుణ్‌ స్టైలిష్‌గా కనిపిస్తే, శ్రద్ధా అందంగా వెండితెరపై మెరిసింది. కెనడియన్‌ డ్యాన్సర్‌గా నోరా ఫతేహి అదరగొట్టింది. ‘ఆయే గర్మీ’ పాటలో ఆమె డ్యాన్స్‌ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తుంది. ఇక ప్రభుదేవా ఎప్పటిలాగే తనదైన పాత్రలో మెప్పించారు. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘ముక్కాలా ముక్కాబ్‌లా..’ పాటను ఇందులో రీమిక్స్‌ చేశారు. అందులో ప్రభుదేవా మరోసారి తన డ్యాన్సులతో అలరించారు. ఆ డ్యాన్స్‌ను వెండితెరపై చూస్తుంటే రెండు కళ్లూ చాలవు. కన్నార్పకుండా చూసేలా ఆయన డ్యాన్స్‌ ఉంది. ప్రభుదేవా ఇంకాసేపు తెరపై కనిపిస్తే బాగుంటుంది అని ప్రతి ప్రేక్షకుడు అనుకునేలా చేశారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. 

సాంకేతికంగా..  నృత్య దర్శకుడు, రచయిత అయిన రెమో డిసౌజా మరోసారి మెగాఫోన్‌తో మెప్పించారు. తొలి రెండు చిత్రాల ను దృష్టిలో పెట్టుకుని అంతకు మించిన డ్యాన్స్‌లు ఉండేలా చూశారు. అయితే, భావోద్వేగ సన్నివేశాలను మాత్రం ఇంకాస్త బలంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఈ సినిమాకు మరో ప్రధాన బలం నేపథ్య సంగీతం. రెండు, మూడు పాటలు రీమిక్స్‌ చేశారు. తనిష్‌ బాగ్చీ అందించిన సంగీతం మరోసారి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ‘ముక్కాలా.. ముక్కాబులా’ రీమిక్స్‌ ఆకట్టుకుంది. ‘దువా కరో’, ‘ఆయే గర్మీ’ పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కుమార్‌ ప్రతి సన్నివేశాన్నీ అందంగా చూపించారు. ఎడిటర్‌ మానన్‌ అజయ్‌సాగర్‌ తన కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు బలహీనతలు
+ వరుణ్‌, శ్రద్ధా, ప్రభుదేవా - భావోద్వేగాలు పండక పోవడం
+ డ్యాన్స్‌లు - స్క్రీన్‌ప్లే
+ రీమిక్స్‌ సాంగ్స్‌  

చివరిగా: డ్యాన్స్‌ ప్రియులను అలరించే ‘స్ట్రీట్‌ డ్యాన్స్‌ 3D’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని