రివ్యూ: చూసీ చూడంగానే..

కొత్త ద‌ర్శ‌కుల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. వాళ్లెప్పుడు అద్భుతాలు సృష్టిస్తారో అంచ‌నాలు వేయ‌డం క‌ష్టం. ఒక్కోసారి వాళ్ల నుంచే పెళ్లి చూపులు లాంటి సినిమా రావొచ్చు. ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌, బ్రోచేవారెవ‌రురా, ఎవ‌రు.. ఇవ‌న్నీ కొత్త ద‌ర్శ‌కుల నుంచి...

Updated : 31 Jan 2020 15:33 IST

చిత్రం: చూసీ చూండగానే..

నటీనటులు: శివ కందుకూరి, వర్ష, మాళవిక సతీషన్‌, పవిత్రా లోకేశ్‌, అనిల్‌ కురువిల్ల, గురురాజ్‌ మానేపల్లి

సంగీతం: గోపీ సుందర్‌

సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌: వేద రమణ, రవితేజ

నిర్మాత: రాజ్‌ కందుకూరి

దర్శకత్వం: శేష సింధు రావు

బ్యానర్‌: ధర్మపథ క్రియేషన్స్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌

విడుదల తేదీః ౩1-౦1-౨౦౨౦

కొత్త ద‌ర్శ‌కుల్ని త‌క్కువ అంచ‌నా వేయ‌కూడ‌దు. వాళ్లెప్పుడు అద్భుతాలు సృష్టిస్తారో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి వాళ్ల నుంచే ‘పెళ్లి చూపులు’ లాంటి సినిమా రావొచ్చు. ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌’, ‘బ్రోచేవారెవ‌రురా’, ‘ఎవ‌రు’ ఇవ‌న్నీ కొత్త ద‌ర్శ‌కుల నుంచి వ‌చ్చిన‌వే. అందుకే.. నిర్మాత‌లు వాళ్ల‌తో ప్ర‌యోగాలు చేయ‌డానికి రెడీ అవుతుంటారు. ‘చూసీ చూడంగానే’ కూడా ఓ కొత్త ద‌ర్శ‌కురాలి ఆలోచ‌నే. మ‌రి అదెలా వుంది?  చూడ‌గానే నచ్చేస్తుందా? చూడ‌గా చూడ‌గా న‌చ్చుతుందా..

క‌థేంటంటే: సిద్దూ (శివ కందుకూరి) ఇంజినీరింగ్ విద్యార్థి. త‌న‌కు ఫొటోగ్ర‌ఫీ అంటే ఇష్టం. ఇంట్లోవాళ్ల కోసం ఇంజినీరింగ్‌లో చేర‌తాడు. అక్క‌డ ఐశ్వ‌ర్య (మాళ‌విక‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌తారు. నాలుగేళ్లు ప్రేమించుకుని, చిన్న చిన్న గొడ‌వ‌ల‌తో విడిపోతారు. ఆ త‌ర‌వాత‌.. సిద్దూ జీవితంలోకి శ్రుతి (వ‌ర్ష‌) వ‌స్తుంది. శ్రుతిని చూడ‌గానే ఇష్ట‌ప‌డ‌తాడు సిద్దూ. శ్రుతి కూడా సిద్దూని ఇష్ట‌ప‌డుతున్న‌ట్టే అనిపిస్తుంది. ఓ రోజున శ్రుతి,  ఐశ్వ‌ర్య‌లు ఇద్ద‌రూ స్నేహితులేనన్న సంగ‌తి సిద్దూకి తెలుస్తుంది. అప్పుడేం జ‌రిగింది?  శ్రుతితో త‌న ప్రేమ విష‌యం సిద్దూ చెప్పాడా?  లేదంటే ఐశ్వ‌ర్య‌నే మ‌రోసారి త‌న జీవితంలోకి ఆహ్వానించాడా?  అనేది తెర‌పై చూసి తెలుసుకోవాలి.

ఎలా ఉందంటే: చాలా సింపుల్ క‌థాంశం ఇది. మ‌లుపులు కూడా పెద్ద‌గా ఉండ‌వు. ఇలాంటి క‌థ‌ల్ని ఇది వ‌ర‌కు చాలాసార్లు చూసుంటాం. కాక‌పోతే పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేసే విధానం, స‌న్నివేశాలు... ఇవ‌న్నీ స‌హ‌జంగా ఉంటాయి. అమ్మాయిల మ‌న‌సుల్ని, ప్రేమ‌, ఇష్టం లాంటి ఫీలింగ్స్‌ని తెర‌పై సున్నితంగా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. సిద్దూ - ఐశ్వ‌ర్య ప్రేమ వ్య‌వ‌హారం, కాలేజీ స‌న్నివేశాలు, సిద్దూ ఇంట్లో ప‌రిస్థితులు.. ఇవ‌న్నీ స‌ర‌దాగా సాగుతాయి. పాట‌లెప్పుడొస్తాయో కూడా తెలియ‌కుండా క‌థ‌లో అంత‌ర్లీనంగా చొర‌బ‌డిపోతాయి. ఎలాంటి ట్విస్టులూ, ట‌ర్న్‌లూ లేకుండా ఇంట్ర‌వెల్ ప‌డిపోతుంది. ద్వితీయార్ధంలో శ్రుతి ప్రేమని పొంద‌డానికి సిద్దూ చేసే ప్ర‌య‌త్నాలు బాగుంటాయి.

అయితే ద్వితీయార్ధంలోనే ద‌ర్శ‌కురాలు కాస్త దారి త‌ప్పిన‌ట్టు అనిపిస్తుంది. ఏం చెప్పాల‌నుకుని, ఏం చెబుతుందో అర్థం కాని ప‌రిస్థితి. సిద్దూపై శ్రుతికి ప్రేమ ఉంటే, సిద్దూ కూడా త‌న‌ని ఇష్ట‌ప‌డుతున్నాడ‌ని తెలిస్తే... ఆ విష‌యం సిద్దూకి ఎందుకు చెప్ప‌దు? విరాట్ అనే కుర్రాడిని త‌న జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తుంది?  సిద్దూని ముందు పెట్టుకుని ఎందుకు ఉడికిస్తుంది?  ఇవ‌న్నీ అంతు ప‌ట్ట‌వు.  సిద్దూ - ఐశ్వ‌ర్య‌, సిద్దూ - శ్రుతి.. ఈ రెండు ప్రేమ‌క‌థ‌లూ లైట్ లైట్‌గానే ఉంటాయి. ఏదీ మ‌న‌సుని హ‌త్తుకోదు. స‌హ‌జ‌త్వం కోసం స‌న్నివేశాల్ని మ‌రీ లాగ్ చేసిన‌ట్టు అనిపిస్తుంది. ప‌తాక సన్నివేశాలు కూడా ద‌ర్శ‌కురాలు త‌న‌కు క‌న్విన్సింగ్‌గానే రాసుకుంది. క‌థ‌లో ప్రేక్ష‌కుల‌కు ఆస‌క్తి రేకెత్తించే అంశాలు గానీ, ప‌డీ ప‌డీ న‌వ్వుకునే స‌న్నివేశాలు గానీ, భావోద్వేగంగా సాగే విష‌యాలు పెద్దగా క‌నిపించ‌వు. ఓ వెబ్ సిరీస్ చూస్తున్న‌ట్టు.. సాఫీగా సాగిపోతుందంతే. ద‌ర్శ‌క-నిర్మాత‌ల అంతిమ ఫ‌లితం కూడా అదే అయితే.. అందులో విజ‌యం సాధించిన‌ట్టే. కానీ ప్రేక్ష‌కుల‌కు కావ‌ల్సిన, వాళ్ల‌కు న‌చ్చేలా మాత్రం క‌థ‌ని మ‌ల‌చ‌లేక‌పోయారేమో అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: రాజ్ కందుకూరి త‌నయుడు శివ కందుకూరికి ఇదే తొలి చిత్రం. త‌న లుక్స్ బాగున్నాయి. న‌ట‌న కూడా ఫ‌ర్వాలేద‌నిపిస్తాడు. పోను పోను మెరుగ‌వుతాడ‌న్న న‌మ్మ‌కం ఉంది. మాళ‌విక పాత్ర‌కు అంత స్కోప్ లేదు. ఆ పాత్ర‌ని మ‌రీ నెగిటీవ్ చేసేశారు. వ‌ర్ష బాగా న‌టించింది. చూడ్డానికి బాగుంది. న‌ట‌న కూడా స‌హ‌జంగా ఉంది. ప‌విత్ర లోకేష్ మ‌రోసారి అమ్మ పాత్ర‌లో ఒదిగిపోయింది.

గోపీ సుంద‌ర్ సంగీతం క‌థ‌లో క‌లిసిపోయి ప్ర‌యాణం చేసింది. అయితే ప్ర‌తీ పాటా ఒకేలా వినిపిస్తుంది. నేప‌థ్య సంగీతం హాయిగా సాగింది. కెమెరా, ఎడిటింగ్ నైపుణ్యాలు తెర‌పై క‌నిపిస్తాయి. మాట‌లు స‌హ‌జంగా ఉన్నాయి. ద‌ర్శ‌కురాలికి ఇదే తొలి చిత్రం. క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి పెట్టాల్సింది.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ స‌హ‌జ‌త్వం - రొటీన్ స‌న్నివేశాలు
+ సంగీతం  

చివ‌రిగా: న‌వ‌త‌రం ప్రేమ‌క‌థ‌ ‘చూసీ చూడంగానే’

గమనికః ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని