రివ్యూ: శక్తి

తమిళ నటుల సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అలా శివ కార్తికేయన్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. గతేడాది ఆయన నటించిన తమిళ చిత్రం ‘హీరో’. తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను

Updated : 16 Apr 2020 08:54 IST

చిత్రం: శక్తి

నటీనటులు: శివ కార్తికేయన్‌, కల్యాణి ప్రియదర్శన్‌, అర్జున్‌, అభయ్‌ దేఓల్, రోబో శంకర్‌ తదితరులు

సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

ఎడిటింగ్‌: రుబెన్‌

సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌

నిర్మాత: జె.రాజేశ్‌, ఇజుహ్యుమలయన్‌

రచన, దర్శకత్వం: పి.ఎస్‌.మిత్రన్‌

బ్యానర్‌: కేజేఆర్‌ స్టూడియోస్‌

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌

తమిళ నటుల సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. అలా శివ కార్తికేయన్‌ నటించిన పలు సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. గతేడాది ఆయన నటించిన తమిళ చిత్రం ‘హీరో’. తెలుగులో ‘శక్తి’ పేరుతో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లను తాత్కాలికంగా మూసివేయండంతో సినిమా విడుదల వాయిదా పడింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేసేశారు. మరి ఈ ‘శక్తి’ ఎలా ఉంది? శివ కార్తికేయన్‌, అర్జున్‌ ఎలా నటించారు? ఆన్‌లైన్‌ మోసాల ఇతి వృత్తంగా విశాల్‌తో ‘అభిమన్యుడు’ తీసి ఆకట్టుకున్న పి.ఎస్‌.మిత్రన్ ఈసారి ఏ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నారు?

కథేంటంటే: శక్తి(శివ కార్తికేయన్‌) తన స్నేహితుడు ఇంకు (రోబో శంకర్‌)తో కలిసి దొంగ సర్టిఫికెట్లు ముద్రిస్తూ డబ్బులకు వాటిని విక్రయిస్తుంటాడు. ర్యాంకు రాని విద్యార్థులకు పెద్ద పెద్ద కళాశాలల్లో పేమెంట్‌ సీట్లు ఇప్పిస్తూ కమిషన్‌ బ్రోకర్‌గా పనిచేస్తుంటాడు. ఒక ఎడ్యుకేషనల్‌ ఫెయిర్‌లో మీరా (కల్యాణి ప్రియదర్శన్‌)ను చూసి ప్రేమలో పడతాడు. మరోవైపు శక్తి బస్తీలో ఉండే మహా (ఇవనా)కు ఏరోనాటికల్‌ ఇంజినీర్‌ అవ్వాలన్నది కల. కానీ, అంత స్థోమత ఉండదు. తన తండ్రి కష్టం చూసి, సత్యమూర్తి (అర్జున్‌) సాయంతో ఉప్పునీటితో నడిచే ఆటోను కనిపెడుతుంది. ఇది చూసిన శక్తి ఎలాంటి ఫీజూ లేకుండా మహాకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ సీటు ఇప్పిస్తానని చెబుతాడు. కానీ, ఆమెకు సీటు రాకుండా మహదేవ్‌ (అభయ్‌ దేఓల్‌) అడ్డు పడతాడు. దీంతో మహా ఆత్మహత్య చేసుకుంటుంది? అప్పుడు శక్తి ఏం చేశాడు? అసలు సత్యమూర్తి ఎవరు? మహాక సీటు రాకుండా మహదేవ్‌ ఎందుకు అడ్డుకున్నాడు? విద్యావ్యవస్థపై పోరాడేందుకు శక్తి మాస్క్‌మ్యాన్‌గా ఎలా మారాడన్నది కథ.

ఎలా ఉందంటే: మన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తూ, గతంలో పలు చిత్రాలు వెండితెరపై సందడి చేశాయి. ముఖ్యంగా ఆమీర్‌ఖాన్‌ ‘తారే జమీనే పర్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, అర్జున్‌ ‘జెంటిల్‌మెన్‌’, ఫేక్‌ సర్టిఫికెట్ల కుంభకోణంతో ఇటీవల వచ్చిన ‘అర్జున్‌ సురవరం’ ఇలా పలు చిత్రాలు విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించాయి. తొలి చిత్రం ‘అభిమన్యుడు’లో ఆన్‌లైన్‌ మోసాల గురించి చెప్పిన దర్శకుడు మిత్రన్‌ ఈసారీ విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. చదువు మనకు మానవత్వం, సద్భుద్ధి, నిజాయతీ, ఇంగితజ్ఞానం, ఆత్మవిశ్వాసం నేర్పించాలి.. కానీ, నేటి విద్యావ్యవస్థ భయాన్ని నేర్పిస్తోందని చెప్పే ప్రయత్నం చేశాడు. 

చదువులో మంచి ర్యాంకు తెచ్చుకున్న శక్తి దొంగ సర్టిఫికెట్లు తయారు చేసే వ్యక్తిలా మారాడం. ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌లో మీరాను చూసి ప్రేమించడం ఆమె చుట్టూ తిరగడం తదితర సన్నివేశాలతో ఆరంభం సాదాసీదాగా ఉంటుంది. ఎప్పుడైతే మహాకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌లో సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడో అప్పటి నుంచి కథలో వేగం పుంజుకుంది. మహా ఆత్మహత్య చేసుకోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. దీంతో అసలు దీని వెనుక ఎవరున్నారన్న దాన్ని  అన్వేషిస్తూ శక్తి ముందుకు సాగుతాడు. అప్పుడే అసలు సత్యమూర్తి ఎవరు? అతడి ద్వారా మహదేవ్‌ గురించి తెలుస్తుంది. విరామానికి ముందు వచ్చే ఆ సన్నివేశాలు కథపై ఉత్కంఠ పెంచుతాయి. 

సత్యమూర్తి ఎవరన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇద్దరూ కలిసి మహదేవ్‌పై పోరాటం సాగిస్తారు. ఇందుకోసం మాస్క్‌మ్యాన్‌గా అవతారం ఎత్తుతాడు శక్తి. మాస్క్‌మ్యాన్‌గా మారే క్రమంలో సన్నివేశాలు సినిమాటిక్‌గా ఉంటాయి. కోట్లకు అధిపతి అయిన మహదేవ్‌ను ఓడించడానికి వీరు చేసే ప్రయత్నాలు ఉత్కంఠ కలిగించేలా కొత్తగా ఉన్నా, అవి విఫలమవుతూ ఉంటాయి. ప్రతిసారీ హీరోపై విలన్‌ పైచేయి సాధించడం అన్న కాన్సెప్ట్‌ సగటు ప్రేక్షకుడికి రుచించదు. దీని వల్ల ఆయా సన్నివేశాలు సాగదీశారన్న భావన కలుగుతుంది. అందరూ ఊహించినట్లే పతాక సన్నివేశాలు ఉంటాయి. 

ఎవరెలా చేశారంటే: శక్తిగా, మాస్క్‌మ్యాన్‌గా శివ కార్తికేయన్‌ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తొలుత దొంగ సర్టిఫికెట్లు అమ్మే వ్యక్తిగా, ఆకతాయిగా, ఆ తర్వాత మహాదేవ్‌పై పోరాటం చేసే మాస్క్‌మ్యాన్‌గా రెండు పాత్రల్లో వైవిధ్యం చూపించాడు. ఇక ఈ సినిమాలో కథానాయకుడికి సమానంగా అర్జున్‌ పాత్ర సాగుతుంది. సత్యమూర్తి/మాస్టర్‌గా ఆయన నటన మెప్పిస్తుంది. చదువులో మంచి మార్కులు తెచ్చుకోలేని విద్యార్థులను వారి అభిరుచులకు అనుగుణంగా నూతన ఉత్పత్తులు తయారు చేసేలా ప్రోత్సాహించే గురువు పాత్రలో అర్జున్‌ నటన, సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. ప్రతినాయకుడు మహదేవ్‌గా అభయ్‌ దేఓల్‌ తన పరిధి మేరకు నటించారు. కల్యాణి ప్రియదర్శన్‌ పాత్ర పరిమితం. మిగిలిన వారు వారి పరిధి మేరకు నటించారు. యువన్‌ పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించలేదు. నేపథ్య సంగీతం బాగుంది. జార్జ్‌ కెమెరా పనితనం బాగుంది. దర్శకుడు మిత్రన్‌ ఎంచుకున్న పాయింట్‌ గత చిత్రాల్లో చూసిందే అయినా, కొత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. నేటి కార్పొరేట్‌ విద్యా వ్యవస్థ, పేమెంట్‌ సీట్ల కోసం తల్లిదండ్రులు చేసే ఖర్చు తదితర విషయాలను అధ్యయనం చేసి తెరపై చూపించారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో మాత్రం సినిమాటిక్‌ లిబర్టీని తీసుకున్నారు. 

బలాలు బలహీనతలు
+ శివ కార్తికేయన్,  అర్జున్‌ - పాటలు
+ కథ - లవ్‌ ట్రాక్‌
+ దర్శకత్వం  

చివరిగా: విద్యా వ్యవస్థ తీరు తెన్నులను ప్రశ్నించే ‘శక్తి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఫలితం కోసం క్లిక్‌ చేయండి

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని