‘లూసిఫర్‌’ డైరెక్ట్‌ చేయబోయేది ఎవరు?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’. గతేడాది విడుదలైన ఈ సినిమా అక్కడ

Published : 03 Mar 2020 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కీలక పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘లూసిఫర్‌’. గతేడాది విడుదలైన ఈ సినిమా అక్కడ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దీన్ని తెలుగులో చిరంజీవి కథానాయకుడిగా రీమేక్‌ చేయనున్నారు. ఇందులో భాగంగా రీమేక్‌ హక్కులను రామ్‌చరణ్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’లో నటిస్తున్నారు. దీని తర్వాత ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేయనున్నారు. 
అయితే, ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే సుకుమార్‌ పేరు వార్తల్లోకి వచ్చింది. ఆయన అల్లు అర్జున్‌ చిత్రంతో బిజీగా ఉండటంతో సుకుమార్‌ పేరు పక్కకు వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ అయితే, న్యాయం చేస్తారని చిరు భావిస్తున్నారట. ఎందుకంటే వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ నంబర్‌ 150’తోనే చిరు రీఎంట్రీ ఇచ్చారు. ఆయన మాస్‌ ఇమేజ్‌కు సరిపోయేలా ఆ సినిమాను తీర్చిదిద్దారు.  కానీ, రామ్‌చరణ్‌ మరోలా ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు యువ దర్శకుడు సుజీత్‌ అయితే, స్టైలిష్‌గా తీస్తారని భావిస్తున్నారట. ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కిన  భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’ను స్టైలిష్‌గా తీసి మంచి పేరు తెచ్చుకున్నారు సుజీత్‌. ఇప్పుడు ‘లూసిఫర్‌’ రీమేక్‌ కూడా ఆయన స్టైలిష్‌గా తీస్తారని చెర్రీ యోచిస్తున్నారట. అనుభవం దృష్ట్యా చిరంజీవి వినాయక్‌వైపు మొగ్గు చూపుతున్నారనటి టాలీవుడ్‌ టాక్‌. మరికొన్ని రోజులు వేచి చూస్తే దర్శకుడు ఎవరన్న దానిపై స్పష్టత వచ్చేస్తుంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని