ఆలస్యమైనా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గిఫ్ట్‌ అదుర్స్‌..!

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’ సినిమా నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరం భీంగా కనిపించనున్నారు. చరణ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం...

Updated : 27 Mar 2020 17:04 IST

ట్రెండింగ్‌లో #BheemforRamaraju

హైదరాబాద్‌: మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ సినిమా నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ‘ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది. బాణమైనా, బందూకైనా ఆనికి బాంచన్‌ ఐతది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’’ అంటూ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, ఎన్టీఆర్‌ వాయిస్‌తో విడుదల చేసిన వీడియో అదిరిపోయింది. ముఖ్యంగా నేపథ్యంలో ఎన్టీఆర్‌ తన గంభీరమైన వాయిస్‌ వింటుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

‘‘నేను నీకు చేసిన వాగ్దానం నిలబెట్టుకుంటున్నా రామ్‌చరణ్‌. హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. మన బంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి’’ -భీమ్‌ ఫర్‌ రామరాజు విడుదల చేసిన సందర్భంగా ట్విటర్‌లో ఎన్టీఆర్‌

‘‘ఎవరైనా నా రామరాజు(రామ్‌చరణ్‌)ను వర్ణించాలంటే అందుకు సరైన వ్యక్తి నా భీమ్‌(తారక్‌). అతనికే సాధ్యం. ’’ -ట్విటర్‌లో దర్శకుడు రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కతోన్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ నటించనుండగా... కొమరంభీమ్‌గా కనిపించనున్న ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌, హాలీవుడ్‌ నటీనటులు ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని