ట్రెండింగ్‌లో ‘మాస్టర్‌ ట్రైలర్‌’..!

అగ్రకథానాయకుడు విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, అర్జున్‌ దాస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ స్వరాలు...

Updated : 18 May 2020 09:12 IST

విజయ్‌ డైలాగ్‌ సూపర్‌..

చెన్నై: అగ్రకథానాయకుడు విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్టర్‌’. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి, అర్జున్‌ దాస్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ స్వరాలు అందించిన ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇదిలా ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ‘మాస్టర్‌’ రిలీజ్‌ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో విజయ్‌ అభిమానులు ‘మాస్టర్‌’ ట్రైలర్‌ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘మాస్టర్‌’ ట్రైలర్‌ గురించి యువ నటుడు అర్జున్‌దాస్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

‘ఇప్పటికే నేను ఆరుసార్లు ‘మాస్టర్‌’ ట్రైలర్‌ చూశాను. ట్రైలర్‌ ఊరమాస్‌. సినిమా విడుదల తేదీ ఫిక్స్‌ అయిన వెంటనే ట్రైలర్‌ను విడుదల చేస్తారు. మీ నిరీక్షణకు ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ ట్రైలర్‌ ఉంటుంది. ట్రైలర్‌లోని ఓ షాట్‌లో విజయ్‌ సర్‌ చెప్పే ఓ డైలాగ్‌ సూపర్‌. సరైన సమయంలోనే ‘మాస్టర్‌’ చిత్రాన్ని విడుదల చేస్తారు. ‘మాస్టర్‌’ చిత్రాన్ని థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారా లేదా ఓటీటీలో చేస్తారా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. ఉదయం నాలుగు గంటల ఆటకు వెళ్లి మనం బాగా గోల చేయాలి. ఈలలు వేయాలి. ఫస్ట్‌ షోని ఆడియన్స్‌తో కలిసి చూస్తే వచ్చే ఆనందం వేరు..! ఈ సినిమా విడుదల విషయంలో నా అభిప్రాయం అడిగితే.. థియేటర్‌లోనే విడుదల చేయమని చెబుతాను. థియేటర్‌లో రిలీజ్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అర్జున్‌ దాస్‌ తెలిపారు.

‘మాస్టర్‌’ ట్రైలర్ గురించి అర్జున్‌ దాస్‌ చెప్పిన మాటలకు విజయ్‌ అభిమానులు సంతోషిస్తున్నారు. సోషల్‌మీడియాలో పలు పోస్ట్‌లు పెట్టి తమ ఆనందాన్ని తెలియజేస్తున్నారు. దీంతో ‘మాస్టర్‌ ట్రైలర్‌’ అనే హ్యష్‌ట్యాగ్‌ ప్రస్తుతం ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని