చెప్పాను కదా! థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే!

సరిలేరు నీకెవ్వరు’ విజయంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న...

Updated : 11 Jan 2020 12:50 IST

అందుకే అడ్వాన్స్‌ కూడా తీసుకోలేదు!

‘సరిలేరు నీకెవ్వరు’ విజయంతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. రష్మిక కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సూపర్‌స్టార్‌ విలేకరులతో మాట్లాడారు. ‘సరిలేరు నీకెవ్వరు’ విశేషాలతో పాటు, విజయశాంతితో కలిసి పనిచేయడం, తన కొత్త సినిమా విశేషాలను ఎన్నో పంచుకున్నారు. 

‘సరిలేరు నీకెవ్వరు’ ఎలా ప్రారంభమైంది?

మహేశ్‌బాబు: ‘ఎఫ్‌ 2’ జరుగుతున్నప్పుడే అనిల్‌ రావిపూడి నాకు ఈ కథ చెప్పారు. వినగానే నచ్చేసింది. కానీ ‘నాకు మధ్యలో మరో సినిమా ఉంది. అది అయ్యాక చేద్దాం’ అన్నాను. ‘ఎఫ్‌ 2’ ఎప్పుడైతే చూశానో, అర్జెంటుగా అనిల్‌ రావిపూడి సినిమాని పట్టాలెక్కించేయాలి అనిపించింది. ‘త్వరగా పూర్తి చేయగలరా’ అని అడిగాను. ‘చేసేద్దాం’ అన్నారు. అలా కేవలం అయిదు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేయగలిగాం. ఇంత పెద్ద సినిమాని ఇంత త్వరగా ఎలా పూర్తి చేశాడా? అని తలచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ క్రెడిట్‌ అంతా దర్శకుడిదే. 

భవిష్యత్తులో రాబోయే చిత్రాలను ఇంతే వేగం చూపిస్తారా?

మహేశ్‌బాబు: అది కథల్ని బట్టి ఉంటుంది. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అందుకే త్వరత్వరగా నిర్ణాయాలు తీసుకున్నాం. ఈ కథ ఒప్పుకోవడం, ఇంత త్వరగా పూర్తి చేయాలనుకోవడం నా కెరీర్‌లో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాలు. నేనైనా మధ్యలో ఐదారు రోజులు రిలాక్స్‌ అయ్యాను. కానీ, చిత్రబృందం అంతా ఈ అయిదు నెలలూ పగలూ రాత్రీ కష్టపడుతూనే ఉంది.

ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించడానికి ప్రత్యేకమైన కసరత్తులేమైనా చేశారా?

మహేశ్‌బాబు: ఆర్మీ ఆఫీసర్‌ అంటే ఫిట్‌గా కనిపించాలి. అందుకోసం ఆరు కిలోలు తగ్గాను. పాత్ర కోసం ఏం హౌంవర్క్‌ చేయాలో అంతా చేశాను. అందుకోసమే ఓ నెల ఆలస్యంగా ఈ సినిమా పట్టాలెక్కింది.

ఈ సినిమాతో మాస్‌ సినిమా చేయాలన్న అభిమానుల కోరిక తీరినట్టేనా?

మహేశ్‌బాబు: ‘దూకుడు’ తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా ఈ మధ్య చేయలేదు. మరీ సీరియస్‌ ఎమోషన్స్‌ ఉన్న కథల్ని ఎంచుకుంటున్నానేమో అనిపించింది. ఆ సమయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ కథ వచ్చింది. అనిల్‌ రావిపూడి సినిమాల్లో వినోదం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇది ఆర్మీ ఆఫీసర్‌ పాత్ర. కొన్ని హద్దులు ఉంటాయి. ఏది పడితే అది చేయలేం. అవన్నీ దృష్టిలో ఉంచుకుని, ఈ పాత్రద్వారా ఎంత వినోదం పంచగలమో, అంతా అందించాం.

ఒక సినిమా కోసం ఎలా సిద్ధమవుతారు?

మహేశ్‌బాబు: కథ నచ్చాక, స్క్రిప్టు ‘ఓకే’ అయ్యాక నేను పూర్తిగా దర్శకుడికి లొంగిపోతాను. తను చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోతాను. నేర్చుకున్నదంతా పక్కన పెట్టి, మళ్లీ కొత్తగా నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. నేను పనిచేసే పద్ధతి కూడా అలానే ఉంటుంది. ఉన్నదాంట్లోనే కొత్తగా ఏం చేయగలం? అనేది ఆలోచిస్తుంటాను.

ఈ సినిమాపై మీ అంచనాలు ఏమేరకు ఉన్నాయి?

మహేశ్‌బాబు: చెప్పాను కదా.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే (నవ్వుతూ)

చాలా ఏళ్ల తరవాత విజయశాంతితో కలసి నటించారు. ఆ అనుభవాలెలా ఉన్నాయి?

మహేశ్‌బాబు: తొలి రోజు సెట్లో కొంచెం కంగారుగా అనిపించింది. అయితే మా ఇద్దరిపై సన్నివేశాన్ని పూర్తి చేయగానే, ‘కొడుకు దిద్దిన కాపురం’ నిన్నో మొన్నో షూటింగ్‌ చేసిన ఫీలింగ్‌ వచ్చేసింది. ఆమెను తప్ప ఈ పాత్రలో ఎవరినీ ఊహించలేకపోయాను.

ఇప్పుడు హీరోలందరూ ప్రయోగాలు చేస్తున్నారు. మీరూ చేస్తారా?

మహేశ్‌బాబు: ప్రయోగాలు చేద్దామని అనుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ అన్ని వేళలా సాధ్యం కాదు. పెద్ద హీరోలంతా విచిత్రమైన జోన్‌లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఊరికే ప్రయోగాలు చేసేయకూడదు. వందల కోట్లతో సినిమా తీస్తున్నప్పుడు అన్నీ ఉన్నాయో, లేదో చూసుకోవాలి. అదే సమయంలో కథలో కొత్తదనం కూడా ఉండాలి. ఇవన్నీ కుదిరితే ఓకే.  లేదంటే బయ్యర్లు నష్టపోతారు.

మీ నాన్నగారు ఈ సినిమాలో కనిపిస్తారని చెప్పారు. ఏ సందర్భంలో ఆ పాత్ర వస్తుంది?

మహేశ్‌బాబు: టికెట్టు కొని సినిమా చూడండి. తెరపై చూస్తే కచ్చితంగా థ్రిల్‌కి గురవుతారు. అప్పటి వరకూ ఆగండి.

మీనాన్నగారికి దాదాసాహెబ్‌ ఫాల్కే ఇవ్వాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు కదా. ఆ కామెంట్లపై మీ స్పందన ఏమిటి?

మహేశ్‌బాబు: చాలా సంతోషం వేసింది. ఇంటికి వెళ్లగానే నాన్నగారికి ఈ విషయం చెప్పాను. ‘చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. ఆయనకు థ్యాంక్స్‌ చెప్పు’ అన్నారు. ముందు నుంచీ ఆయన నన్ను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా సినిమా హిట్టయితే తొలి ఫోన్‌ కాల్‌ ఆయన దగ్గరి నుంచే వస్తుంది. జనవరి 12న నుంచి కూడా ఆయన నుంచి ఫోన్‌ వస్తుందని ఆశిస్తున్నాను.

‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ రెండూ ఒకేరోజు విడుదల అవుతాయేమో అనుకున్నారు. ఈ గందరగోళం ఎందుకు ఏర్పడింది?

మహేశ్‌బాబు: పెద్ద సినిమాలకు సోలో రిలీజ్‌ ఉంటే బాగుంటుంది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం సరైంది కాదు. దాని వల్ల వసూళ్లని పంచుకోవాల్సివస్తుంది. భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలివి. బయ్యర్లు నష్టపోతారు. గిల్డ్‌ ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించారు. వాళ్లకి నా కృతజ్ఞతలు.

అడ్వాన్సు కూడా తీసుకోకుండా ఈ సినిమా చేశారు కదా. అసలు ఆ ఆలోచన ఎందుకొచ్చింది?

మహేశ్‌బాబు: చాలా త్వరగా ఈ సినిమాని పూర్తి చేద్దాం అనుకున్నాం. అనుకున్న సమయానికి విడుదల అవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఆ వెసులుబాటు నిర్మాతలకు కల్పించాలి. 

భవిష్యత్తులోనూ నిర్మాణాన్ని కొనసాగిస్తారా?

మహేశ్‌బాబు: తప్పకుండా. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాణ విషయాల్లో నేనేం జోక్యం చేసుకోలేదు.

పాన్‌ ఇండియా సినిమాలు ఈ మధ్య బాగా వస్తున్నాయి. మీరూ అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

మహేశ్‌బాబు: దక్షిణాది చిత్రాలు బాగా ఆడుతున్నాయి. సరిహద్దుల్ని చెరిపేస్తూ మంచి విజయాల్ని అందుకుంటున్నాయి. ‘కేజీఎఫ్‌’లాంటి చిత్రాలు బాలీవుడ్‌కీ వెళ్లి నిరూపించుకున్నాయి. మంచి కథ వస్తే తప్పకుండా పాన్‌ ఇండియా స్థాయి సినిమా తీయొచ్చు.

‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఉందా?

మహేశ్‌బాబు: ఆ మధ్య మేం కలుసుకున్న మాట వాస్తవమే. కొన్ని కథలు కూడా అనుకున్నాం. ఎప్పుడు చేస్తామన్నది ఇప్పుడే చెప్పలేను.

తదుపరి సినిమా ఎప్పుడు?

మహేశ్‌బాబు: ‘సరిలేరు...’ తరవాత రెండు నెలలు గ్యాప్‌ తీసుకుంటా. ఆ తరవాత వంశీ పైడిపల్లి సినిమా ఉంటుంది. ఈసారి పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా చేయబోతున్నాం. 
 

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు