తారక్‌ చాలా సంతోషించాడు..!

‘ఎంత మంచివాడవురా..!’ చిత్రంతో మొదటిసారి సంక్రాంతి బరిలోకి అడుగుపెడుతున్నారు నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌కు జంటగా మెహరీన్‌ నటించారు. మొదటిసారి కుటుంబ కథా చిత్రంలో...

Published : 13 Jan 2020 16:23 IST

‘పటాస్‌’ అప్పుడే విడుదల చేయాలనుకున్నాం.. కానీ మిస్‌ అయ్యింది: కల్యాణ్‌రామ్

హైదరాబాద్‌: ‘ఎంత మంచివాడవురా..!’ చిత్రంతో మొదటిసారి సంక్రాంతి బరిలోకి అడుగుపెడుతున్నారు నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌కు జంటగా మెహరీన్‌ నటించారు. మొదటిసారి కుటుంబ కథా చిత్రంలో నటించడం పట్ల కల్యాణ్‌రామ్‌ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు‌. సంక్రాంతి కానుకగా జనవరి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కల్యాణ్‌రామ్‌ సరదాగా విలేకర్లతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

కథ అలా..

‘118’ సినిమా తర్వాత నేను చాలా కథలు విన్నాను. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనుకున్నాను. ఒకరోజు కృష్ణప్రసాద్‌ వచ్చి నాకు ఓ గుజరాతీ ఫిల్మ్‌ చూపించాడు. నాకు ఆ సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ నచ్చింది కానీ, మిగిలిన సన్నివేశాలు అంత నచ్చలేదు. ఈ గుజరాతీ సినిమాలోని మెయిన్‌ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని సతీశ్‌ ఒక రాశారు  ఒకసారి విను అని కృష్ణప్రసాద్‌ చెప్పారు. అలా సతీశ్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. ఆ తర్వాత సతీశ్‌ కథలో చాలా మార్పులు చేశాడు. ఆగస్టులో షూటింగ్‌కు వెళ్లాం.

సాంగ్‌ నుంచి టైటిల్‌..

సతీశ్‌ వేగేశ్న సినిమా టైటిళ్లలో తెలుగుదనం ఉంటుంది. ‘శతమానంభవతి’, ‘శ్రీనివాసకల్యాణం’ టైటిళ్లు నాకు బాగా నచ్చాయి. ఈ సినిమా కథ చెప్పినప్పుడు సతీశ్‌ మొదట ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే టైటిల్‌ పెట్టారు. కానీ నేను మాత్రం తెలుగు టైటిల్‌ కావాలని అడిగాను. అలా చివరికి ఆయన ‘ఎంత మంచివాడవురా..!’ టైటిల్‌ పెట్టారు. ‘నమ్మినబంటు’ సినిమాలోని ఓ పాట నుంచి ఈ టైటిల్‌ వచ్చింది. దానినే మేము మా సినిమా ఫస్ట్‌ గ్లిమ్స్‌లో చూపించాం.

రియల్‌లైఫ్‌లో ఎలా ఉంటానో అదే..

నేను వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర కూడా అలాగే ఉంటుంది. చాలా సింపుల్‌, సరదాగా ఉంటుంది. షూటింగ్‌కు వెళ్లే ముందు డైరెక్టర్‌ ఒకటే చెప్పారు. ‘సర్‌ మీరు ఈ సినిమా మొత్తం సంతోషంగా, నవ్వుతూ ఉండండి’ చాలు అని. ఎమోషనల్‌, కమర్షియల్‌ హంగులు ఉన్న సినిమా ఇది.

అప్పుడే అయిపోయిందా..

ఆగస్టులో స్టార్ట్‌ అయిన మా సినిమా షూటింగ్‌ 70 రోజుల్లోనే అయిపోయింది. ప్రతిరోజూ షూటింగ్‌ చాలా సరదాగా గడిచేది. మేము షూట్‌ చేసిన ప్రదేశాల్లో మొబైల్‌ ఫోన్లకు సిగ్నల్స్‌ ఉండేవి కాదు. అందువల్ల సెట్‌లో అందరం ఫోన్లు పక్కనపెట్టేసి చక్కగా మాట్లాడుకునేవాళ్లం. మళ్లీ హోటల్‌కి వెళ్లాక ఫోన్లు చూసుకునేవాళ్లం. ఈ సినిమా షూటింగ్‌ చివరి రోజు అప్పుడే అయిపోయిందా అనిపించింది. డైరెక్టర్‌ని ఇంకా కొన్ని సన్నివేశాలు పెట్టమని కోరాను. (నవ్వులు)
 

కొన్ని సన్నివేశాలు హత్తుకున్నాయి..

చిన్నప్పుడు ఫెస్టివల్స్‌ సమయంలో మా ఇంటికి పెద్దమ్మ, మామయ్య వాళ్లు వచ్చి వెళ్తుండేవారు. వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు బాగా ఏడుపు వచ్చేసేది. నాకు అందరితో కలిసి ఉండడం అంటే ఇష్టం. ఇప్పటికీ మా ఇంట్లో మొత్తం తొమ్మిది మంది ఉంటాం. ప్రతిరోజూ నిద్ర లేవగానే వాళ్లతో కాసేపు కూర్చొని మాట్లాడతాను. ఖాళీ సమయాన్ని వాళ్లతో గడపడానికి ఇష్టపడుతుంటాను. ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా రియల్‌ లైఫ్‌కు దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నన్ను ఎంతగానో హత్తుకున్నాయి.

తారక్‌కి కథ..

నా భార్య ‘శతమానం భవతి’ సినిమా చూసి.. ‘మీరు ఇలాంటి కుటుంబకథా చిత్రం ఎందుకు చేయరు’ అని ఒకరోజు నన్ను అడిగింది. డైరెక్టర్‌కి నా మీద నమ్మకం ఉండి అలాంటి కథతో వస్తే తప్పకుండా చేస్తా. నాకు కూడా అలాంటి సినిమా చేయాలని ఉంది అని చెప్పా. ఈ కథ గురించి తారక్‌కి చెప్పినప్పుడు తను చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. తారక్‌ నేను ఓసినిమా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాం. కాకపోతే కొంచెం టైం పట్టింది.

‘పటాస్‌’ అప్పుడే రిలీజ్‌ చేద్దామనుకున్నాం కానీ..

‘పటాస్‌’ సినిమాను మొదట మేము సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల అది సంక్రాంతికి మిస్‌ అయ్యింది. ఇదే నా మొదటి సంక్రాంతి సినిమా. మాది కుటుంబకథా చిత్రం కాబట్టి సంక్రాంతికి విడుదలైతే బాగుంటుందని మేము భావించాం. అందుకే ఇప్పుడు విడుదల చేస్తున్నాం.

సతీశ్‌తో వర్క్‌..

పూరీ జగన్నాథ్‌, అనిల్‌ రావిపూడితో నేను ఎంత సౌకర్యంగా పనిచేశానో.. సతీశ్‌తో కూడా అలాగే ఉంది. ఒకవేళ సెట్‌లో నేను టెన్షన్‌గా కనిపిస్తే.. తను నా దగ్గరికి వచ్చి కొంచెంసేపు సరదాగా కూర్చొని మాట్లాడేవాడు. జోక్స్‌ చేసి నన్ను రిలాక్స్‌ చేసేవాడు. అలాగే మెహరీన్‌ పాత్ర కూడా ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. తను కూడా బాగా నటించింది.

ఆ సాంగ్‌ వింటే..

‘ఏమో ఏమో’ సాంగ్‌ వింటే ఈ సినిమా అంతా అర్థమవుతోంది. ఈ సినిమాకు తగ్గట్టుగా అందులోని ప్రతి లైన్‌ ఉంటుంది. ‘నిన్నుకోరి’ సినిమాకు గోపిసుందర్‌ అందించిన సంగీతం నాకెంతో నచ్చింది. అప్పటి నుంచి ఆయనతో సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని