‘అశ్వథ్థామ’లో పవన్‌కల్యాణ్‌..

హీరో నాగశౌర్య ఒక్కసారిగా గేరు మార్చారు. తన తర్వాతి సినిమా ‘అశ్వథ్థామ’తో పూర్తి మాస్‌హీరోగా అవతారమెత్తారు. అంతేకాదు.. నటుడి నుంచి రచయితగా.. నిర్మాతగా మారారు.

Updated : 29 Jan 2020 14:31 IST

లవర్‌బాయ్‌ ట్యాగ్‌ వద్దు

అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా : నాగశౌర్య

హైదరాబాద్‌: హీరో నాగశౌర్య ఒక్కసారిగా గేరు మార్చారు. తన తర్వాతి సినిమా ‘అశ్వథ్థామ’తో పూర్తి మాస్‌ హీరోగా అవతారమెత్తబోతున్నారు. అంతేకాదు.. నటుడి నుంచి రచయితగా.. నిర్మాతగా మారారు. ఇటీవల మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలన్న లక్ష్యంగా తానే స్వయంగా కలం పట్టి కథ రాశారు. నాగశౌర్య హీరోగా, నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథనాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నాగశౌర్య మీడియాతో ముచ్చటించారు.

చెప్పేవి కొన్నే.. చెప్పలేనివెన్నో..

‘‘ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. అయితే, తమపై జరిగిన దాడిని బయట చెప్పేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. కొంతమంది మాత్రమే ధైర్యంగా బయటికొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ రాసేందుకు ఎంతో కష్టపడ్డాం. జిల్లాలు, రాష్ట్రాలు దాటి చాలామంది ఇళ్లకు వెళ్లి కలిశాం. అయితే, విషయం చెప్పగానే ఎక్కువమంది తలుపులు తీయడానికి కూడా ఇష్టపడలేదు. నాకు తెలిసిన ఓ అమ్మాయి విషయంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టే ఓ చెల్లి గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది. నా కెరీర్‌లో ఇంత ఎమోషనల్‌ సినిమా ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి విషయాల్లో నేరుగా సమాజంలోకి వెళ్లి ఏం చేయలేం కాబట్టి. సమాజంలో ఉన్న పరిస్థితిని సినిమా ద్వారా చెప్పాలనుకున్నాం. అయితే, ఇది యథార్థ సంఘటన అని చెప్తే ఎవరూ నమ్మలేరు. సినిమా మరో రెండు రోజుల్లో విడుదలవుతుంది. మీరంతా చూసిన తర్వాత ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా అనిపిస్తుంది’’

నిజాయతీగా సినిమా తీయాలనుకున్నాం..

‘‘సినిమా చిత్రీకరణకు సంబంధించి అన్నీ ముందుగానే చర్చించాం. అందుకే సెట్లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఒక నిజాయతీ కలిగిన సినిమా ప్రేక్షకులకు అందించాలని అనుకున్నాం. అనవసరంగా ఐటెం సాంగ్‌లు పెట్టాలనుకోలేదు. అనుకున్నట్లుగానే అవుట్‌పుట్‌ వచ్చింది. డైరెక్టర్‌ రమణలో పట్టుదల, కసి ఉన్నాయి. అందరం కలిసి ఒక సినిమాకు ఏం కావాలో అవన్నీ చేశాం. సినిమాను డిఫరెంట్‌గా తీస్తే బాగుంటుందని అనుకున్నాం. కానీ.. సినిమా అవుట్‌పుట్‌ బాగా వచ్చినప్పుడు డిఫరెంట్‌గా ఉండాల్సిన అవసరమేముంది.’’

నన్ను ప్రోత్సహించిన వాళ్లను మోసం చేయలేను

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అవసరాల శ్రీనివాస్‌లాంటి వాళ్లు బాగా ప్రోత్సహించారు. నేను ఇతరులకు సాయం చేసే స్థాయిలో ఉన్నప్పుడు.. వాళ్ల టాలెంట్‌ చూసి కూడా అవకాశం కల్పించకపోతే నాకు అవకాశం ఇచ్చిన వాళ్లను మోసం చేసిన వాడినవుతా. అందుకే ఈ సినిమాలో దాదాపు కొత్తవాళ్లనే తీసుకున్నా. అందరూ 35 ఏళ్ల కంటే తక్కువ వయసు వాళ్లే. కెమెరామెన్‌ నుంచి డైరెక్టర్‌ వరకూ మాదొక యంగ్‌ టీమ్. బడ్జెట్‌ కూడా ఎక్కువగానే పెట్టాం. ఒక సినిమా ఒకే మనిషితో ఆడుతుందంటే నేను నమ్మను. సినిమా యూనిట్‌ మొత్తం బాగా పనిచేస్తేనే సినిమా హిట్‌ అవుతుంది. సినిమాలో ఒకే పాత్ర హైలైట్‌ అయితే అంతగా కిక్కుండదు. హీరోకు దీటుగా ప్రతినాయకుడి పాత్ర కూడా ఉండాలన్నదే నా అభిప్రాయం. అందుకే ఈ సినిమాలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యత ఉంటుంది. అలా వచ్చి ఇలా వెళ్లిపోయ పాత్రలు లేవు. ’’

ఆ సినిమాతో క్షోభ అనుభవించాను

‘‘నర్తనశాల’ తర్వాత ‘అశ్వథ్థామ’కి మధ్యలో నేను ఎంతో క్షోభ అనుభవించాను. నాతో పాటు మా తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడ్డారు. మాటిచ్చాను కాబట్టి ఆ సినిమా చేయాల్సి వచ్చింది. అయితే, ‘నర్తనశాల’ సమయంలో సినిమా బాగా ఉంటేనే చూడండని నేనే ప్రకటించాను. బాగా లేకపోతే మరో ముగ్గురికి చెప్పండి అని కూడా చెప్పాను. అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఈ సినిమాకు సిద్ధమయ్యాను. మొదట్లో.. ‘సినిమా కలల ప్రపంచం.. అనవసరంగా చిక్కుల్లో పడుతున్నావు’ అని చాలామంది సలహాలిచ్చారు. అయితే, ఈ సినిమాకు కథ రాసేటప్పుడు సినిమాతో పాటు సమాజంపై అవగాహన మరింత పెరిగింది. సినిమా రిజల్ట్‌ రాకముందే టాటూ వేయించుకున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు నేను ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానో’’

లవర్‌బాయ్‌ ట్యాగ్‌ వద్దు..

‘‘లవ్‌స్టోరీలు ఎక్కువగా తీస్తున్నారని చాలామంది అంటున్నారు. నాకు లవర్‌బాయ్‌ అనే ట్యాగ్‌ వద్దు. ఒక నటుడిగా అన్ని రకాల సినిమాలు తీయాలి కదా. ఇప్పటికే అందరు డైరెక్టర్లు లవ్‌స్టోరీలే తీసుకొస్తున్నారు. అన్ని రకాల పాత్రలు చేయాలన్న ఉద్దేశంతోనే ‘అశ్వథ్థామ’ తీస్తున్నాను. అయితే, ఇక లవ్‌స్టోరీలు చేయను అని చెప్పను.. ఎందుకంటే లవ్‌స్టోరీ లేకుండా సినిమా ఉండదు. అయితే, లవ్‌స్టోరీల్లోనూ డిఫరెంట్‌గా తీయవచ్చు. అవసరాల వంటి డైరెక్టర్లు అలాంటి సినిమాలు తీస్తున్నారు. నేను కూడా మంచి ప్రేమకథ ఒకటి రాస్తున్నాను. నాగచైతన్య వంటి పెద్ద హీరోలు ఓకే చెప్తే అంతకంటే సంతోషమేముంటుంది’’

అందుకే ‘అశ్వథ్థామ’ పేరు తీసుకున్నాం

ఇక మీరంతా అనుకుంటున్నట్లు సినిమాలో హీరో పేరు అశ్వథ్థామ కాదు.. ఆ పాత్ర పేరు గణ. మహాభారతంలో ద్రౌపది చీరను లాగినప్పుడు ప్రశ్నించే పాత్ర అశ్వథ్థాముడిది. అందుకే ఆ పేరు తీసుకున్నాం. ఈ సినిమా ద్వారా సమాజంలో జరిగే తప్పులను ప్రశ్నించడమే ఇందుకు కారణం. అన్నింటికంటే ముఖ్యమేంటంటే పవన్‌ కల్యాణ్‌గారి వాయిస్‌ ఓవర్‌తో సినిమా ప్రారంభమవుతుంది. ‘గోపాలగోపాల’ సినిమాలో పవన్‌కల్యాణ్‌ చెప్పిన డైలాగులు నచ్చి ఇన్‌స్పైర్‌ అయ్యాను. అందుకే ఆయన వాయిస్‌ను ఈ సినిమాకు వాడుకోవాలనుకున్నాం’’

‘ఊహలు గుసగుసలాడే’తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య.. దిక్కులు చూడకు రామయ్య, ఛలో సినిమాలతో అభిమానులను అలరించారు. చివరగా ‘ఓ బేబి’తోనూ నటుడిగా మంచి హిట్‌ సాధించారు. తాజాగా అశ్వథ్థామతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ చిత్రం ప్రయోగాల యువహీరోకు కలిసొస్తుందో లేదో వేచి చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని