రెండు నెలల్లో ‘కొండారెడ్డి బురుజు’ సృష్టించా

కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌.. ఈ పేరు చెప్పగానే సినీ ప్రియులకు వెంటనే గుర్తుకు వచ్చేది ‘ఒక్కడు’ సినిమాలోని మహేశ్‌, ప్రకాశ్‌రాజ్‌ ఫైటింగ్‌ సీన్‌. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్‌లో.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మహేశ్‌పై చిత్రీకరించిన విరామ సన్నివేశాలు...

Published : 11 Feb 2020 06:39 IST

ఆర్ట్‌ డైరెక్టర్‌ ఏఎస్‌ ప్రకాశ్‌

హైదరాబాద్‌: కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్‌.. ఈ పేరు చెప్పగానే సినీ ప్రియులకు వెంటనే గుర్తుకు వచ్చేది ‘ఒక్కడు’ సినిమాలోని మహేశ్‌, ప్రకాశ్‌రాజ్‌ ఫైటింగ్‌ సీన్‌. దాదాపు 17 సంవత్సరాల తర్వాత ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్‌లో.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కోసం మహేశ్‌పై చిత్రీకరించిన విరామ సన్నివేశాలు ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తున్నాయి. మరి చారిత్రాత్మకమైన ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్‌ను రామోజీ ఫిల్మ్‌సిటీలో ఎంతో చక్కగా తీర్చిదిద్దిన ఏఎస్‌ ప్రకాశ్‌తో ‘ఈటీవీ’ ముఖాముఖి. ఆ విశేషాలివే..

సంతోషంగా ఉంది..

కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘అల..వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి రెండు పెద్ద ప్రాజెక్ట్‌ల కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్‌ విజయాలను సొంతం చేసుకోవడం ఆనందంగా అనిపిస్తుంది.

వర్క్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని.. 

అనిల్‌కి నాకు మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఆయన తెరకెక్కించిన సినిమాలకు నేను ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేశాను. అందువల్ల ఆయన టేస్ట్‌ ఏమిటో నాకు బాగా తెలుసు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కథ గురించి నాకు చెప్పినప్పుడు ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్‌ గురించి చాలా కీలకంగా చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల కర్నూలులోని ‘కొండారెడ్డి బురుజు‌’ దగ్గర షూటింగ్‌ చేయలేకపోతున్నామని.. కనుక సెట్‌ వేద్దామని చెప్పారు. అలా నేను ఈ సెట్‌ వేయడాన్ని ఒక ఛాలెంజింగ్ తీసుకుని తీర్చిదిద్దాను.

ఆయన ప్రామిస్‌ నిలబెట్టుకున్నా..

‘కొండారెడ్డి బురుజు సెంటర్‌’ను సెట్‌ వేయాలని నిర్ణయించుకున్నాక.. ‘ప్రకాశ్‌ నువ్వు ‘కొండారెడ్డి బురుజు’ సెంటర్‌ సెట్‌ వేస్తే అది చూసిన ప్రేక్షకులు నిజమనుకోవాలి’ అని అనిల్‌ అన్నారు. ‘తప్పకుండా సహజంగా అనిపించేలా సెట్‌ను క్రియేట్‌ చేస్తాను’ అని అనిల్‌కు మాట ఇచ్చాను. అందుకే చాలా క్షుణ్ణంగా పరిశీలించాకే సెట్‌ వేశాను. నేను వేసిన సెట్‌ చూశాక అనిల్‌ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. అంతేకాకుండా మాట నిలబెట్టుకున్నానని చాలాసార్లు అన్నారు.

ఒత్తిడి తెలీదు..

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని కొండారెడ్డి బురుజు సెంటర్‌ను క్రియేట్‌ చేయడంలో నేను ఒత్తిడికి లోను కాలేదు. నిజం చెప్పాలంటే నేను ఈ సినిమాకే కాదు ఏ సినిమాకి పని చేసినా ఎలాంటి ఒత్తిడికి గురికాను. ఏ సెట్‌ వేసినా.. ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుని చేస్తా. అలాగే దాని గురించి పూర్తిగా స్టడీ చేస్తాం.

అదే మొదటి అడుగు..

అనిల్‌ రావిపూడి చెప్పగానే మొదట కొండారెడ్డి బురుజు సెంటర్‌ స్కెచ్‌ వేశాను. ఆ తర్వాత రెండుసార్లు నేను కర్నూలు వెళ్లి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత మా టీం మొత్తం కలిసి ఐదుసార్లు కర్నూలు వెళ్లి  ‘తెలుగు తల్లి సెంటర్‌’ గురించి పూర్తిగా స్టడీ చేసి ఇక్కడికి వచ్చి సెట్‌ వర్క్‌ ప్రారంభించాం.

రెండు నెలల్లోనే.. 

ఇలాంటి పెద్ద సెట్స్‌ వేయాలంటే మూడు నుంచి నాలుగు నెలలు సమయం పడుతుంది. కానీ ఆర్టిస్ట్‌ల డేట్స్‌ విషయంలో ఇబ్బంది అవుతుందని అనిల్‌ చాలా త్వరగా చేయమన్నారు. అలా రెండు నెలల్లోనే ఈ సెట్‌ను క్రియేట్ చేశాం.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని