Updated : 19 Feb 2020 11:55 IST

‘సమరసింహారెడ్డి’ ‘ఇంద్ర’ కథలు ఒకటే కదా?

200 పాముల మధ్య వెంకటేశ్‌ను తీసుకొచ్చి పెట్టాం

సింపుల్‌గా కనిపించే సూపర్‌హిట్‌ ఆయన.. సామాన్యుడిలా కనిపించే సెన్సేషన్‌ ఆయన.. హీరోల స్టేటస్‌ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టే దర్శకుడు.. ఆయన సినిమాల్లో కథానాయకులు తొడ గొడితే రికార్డులు.. మీసం తిప్పితే రివార్డులు.. అందుకే ఆయన సినీ సమర సింహం అయ్యారు. ఆయనే ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌. తీసింది తక్కువ సినిమాలే అయినా, ఇండస్ట్రీలో రికార్డులు సృష్టించే చిత్రాలను తీశారు. ఆలీ వ్యాఖ్యతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా ’ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదాగా సంగతులు పంచుకున్నారు. 

బి.గోపాల్‌ అంటే?

బి.గోపాల్‌: బెజవాడ గోపాల్‌. అయితే, మాది ఒంగోలు దగ్గర ఎం.నిడమానూరు. (మధ్యలో ఆలీ అందుకుని బి.గోపాల్‌ అంటే బీభత్సమైన గోపాల్‌ అని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. సాధారణంగా మీ సినిమాల్లో సుమోలు గాల్లో పైకి లేస్తాయి. వచ్చే సినిమాల్లో ఏకంగా ఫ్లైట్‌లు లేస్తాయేమో చూడాలి...నవ్వులు)

ఏ సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చారు?

బి.గోపాల్‌: 1973లో ఇండస్ట్రీకి వచ్చా. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేద్దామనే ఉద్దేశంతోనే వచ్చా. 

గాల్లో సుమోలు లేపాలనే ఆలోచన మీకే వస్తుందా? లేదా ఎవరైనా చెబుతారా?

బి.గోపాల్‌: నాతో పాటు రచయితలు, స్టంట్‌ మాస్టర్లు కూర్చొంటారు. అందరం అనుకుని సీన్లు ఎలా ఉండాలో తీర్చిదిద్దాం. 


 

మొత్తం మీ కెరీర్‌లో ఎన్ని సినిమాలు తీశారు?

బి.గోపాల్‌: నా కెరీర్‌ మొత్తం 33 సినిమాలు తీశా. అందులో దాదాపు 25కు పైగా సినిమాలు సూపర్‌ డూపర్‌ హిట్‌. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర కథానాయకులందరితోనూ పనిచేశా. 

ఇండస్ట్రీలో ఎవరి దగ్గర చేరుదామని వెళ్లారు?

బి.గోపాల్‌: పీసీరెడ్డిగారి దగ్గర సహాయకుడిగా చేరదామని వెళ్లాను. నాకు మద్రాసు వెళ్లాలనే ఆలోచన రావడానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి టి.కృష్ణ. కాలేజ్‌లో చేరే వరకూ బాగా చదువకోవాలని ఉండేది. నన్ను డాక్టర్‌ చేయాలని మా నాన్న కల. అయితే, నాటకాలు, డ్రామాలతో నా చదువు పక్కదారి పట్టింది. అందరం క్యాంటీన్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఒకరోజు ఫ్రెండ్స్‌ ఎవరూ లేకపోతే వెళ్లి రూమ్‌లో ఒంటరిగా కూర్చొన్నా. నేను ఏం చదువుతున్నానో ఒక్కసారి ఆలోచించా. అప్పుడు చదువు ఆపేసి మద్రాసు వెళ్దామని ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని నాన్నకి చెబితే, ఆయన కూడా ఒప్పుకొన్నారు. రెండు మూడు రోజులకే బయలుదేరి మద్రాసు వెళ్లిపోయాను. మా నాన్నకి కోటయ్య అనే స్నేహితుడు ఉన్నారు. ఆయనకు న్యూటౌన్‌ స్టూడియోస్‌లో మేనేజర్‌ తెలుసు. దాంతో నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. విషయం చెప్పగానే ఆయన కూడా ఒప్పుకొన్నారు.  తీసుకెళ్లి పీసీరెడ్డిగారి దగ్గర జాయిన్‌ చేశారు. కృష్ణ, జమున నాయకనాయికలుగా నటించిన ‘పెద్దలు మారాలి’ అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా నా కెరీర్‌ను ప్రారంభించా. 

పీసీరెడ్డి తర్వాత ఎవరి దగ్గర పనిచేశారు?

బి.గోపాల్‌: రాఘవేంద్రరావు దగ్గర దాదాపు పదేళ్లు పనిచేశాను. 

రామానాయుడు మీకు అవకాశం ఎలా ఇచ్చారు?

బి.గోపాల్‌: పీసీరెడ్డిగారి దగ్గర పనిచేస్తుండగా నెలకు రూ.100 ఇచ్చేవారు. అలా ఏడాది పాటు పనిచేశా. మళ్లీ ఆ తర్వాత సంవత్సరం విరామం వచ్చింది. ఇంకో సినిమా ప్రారంభమైన తర్వాత దానికీ పనిచేశా. అప్పుడు కూడా రూ.100 ఇచ్చారు. అప్పుడు కోటగిరి వెంకటేశ్వరరావుని రిక్వెస్ట్‌ చేస్తే, రాఘవేంద్రరావుగారిని పరిచయం చేశారు. అప్పుడు ‘అడవి రాముడు’ చిత్రంతో ఆయనతో పని చేయడం మొదలు పెట్టా. అప్పటి  నుంచి అస్సలు ఖాళీ అనేదే లేకుండా పని ఉండేది. ‘అడవిరాముడు’ భారీ విజయం సాధించడంతో ఆయన పెద్ద దర్శకుడు అయిపోయారు. మాకు కూడా అవకాశాలు పుష్కలంగా దొరికేవి.

మీరు ఒక సినిమాలో నటించినట్లు ఉన్నారు?

బి.గోపాల్‌: వేటగాడు. అందులో ఒక పాత్ర సరిగా చేయకపోతే, రాఘవేంద్రరావుగారు ‘గోపాల్‌.. నువ్వు చెయ్‌’ అని ఆ పాత్ర నాతో చేయించారు. ఆయన ఏది చెబితే అది చేసేవాళ్లం. 

మీ సినిమాలోనూ ‘ఆరేసుకోబోయి..’ పాట పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది.

బి.గోపాల్‌: ప్రభాస్‌తో సినిమా చేస్తున్నాం. అయితే అప్పటికి ఇంకా టైటిల్‌ అనుకోలేదు. అన్నపూర్ణా స్టూడియోస్‌లో షూటింగ్‌ చేస్తున్నాం. దానికి నిర్మాత చంటి. ఇద్దరం కూర్చొని ఉన్నాం. నేను ఏదో సీన్‌ పేపర్లు చూసుకుంటుంటే, చంటి ‘ఆరేసుకోబోయి..’ పాటను హమ్‌ చేస్తున్నాడు. ‘ఈ పాట పెడితే ఎలా ఉంటుంది’ అని నాకు సడెన్‌గా ఆలోచన వచ్చింది. ఇదే విషయాన్ని చంటికి చెప్పా. ఆ తర్వాత మణిశర్మను ఒప్పించా. పాట గురించి మా గురువు రాఘవేంద్రరావుగారికి చెబితే ఆయన కూడా ఒప్పుకొన్నారు. ఈ పాట వల్ల బి,సి సెంటర్లలో మంచి కలెక్షన్లు వచ్చాయి. 

హిందీలో కూడా సినిమాలు చేశారు కదా!

బి.గోపాల్‌: ‘ప్రతిధ్వని’ని హిందీలో ‘ఇన్‌సాఫ్‌కా ఆవాజ్‌’ చేశా. అనిల్‌ కపూర్‌, రేఖ, రిచాశర్మ, అనుపమ్‌ ఖేర్‌, ఖాదర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అది 100రోజులు ఆడింది. ఆ తర్వాత హిందీలో ‘కలెక్టర్‌గారి అబ్బాయి’ తీశా. ఇక్కడ నాగేశ్వరరావుగారు, నాగార్జున చేసిన పాత్రల్లో అక్కడ దిలీప్‌కుమార్‌, సంజయ్‌దత్‌, మాధురీ దీక్షిత్‌లు నటించారు. 

దిలీప్‌కుమార్‌తో పనిచేయడం ఎలా ఉండేది?

బి.గోపాల్‌: ఒక విలేజ్‌ నుంచి వచ్చిన కుర్రాడు డైరెక్టర్‌ అవ్వడమే గొప్ప. ఎందుకంటే, నేను కాలేజ్‌ చదువుకునే రోజుల్లో ‘దిలీప్‌ కుమార్‌ ఒక సినిమాకు రూ.18లక్షలు తీసుకుంటారట’ అని చెప్పుకొనే వాళ్లం. అలాంటిది దిలీప్‌కుమార్‌ను డైరెక్ట్‌ చేసే అవకాశం రావడం అదృష్టం. ఆంజనేయులు అనే నిర్మాత వచ్చి దిలీప్‌కుమార్‌, సంజయ్‌దత్‌లతో సినిమా అని చెప్పగానే ఒకసారి నన్ను నేను గిల్లుకున్నా. కలలో కూడా ఊహించని అవకాశం. ఒకరోజు ముంబయిలో ఆయన ఇంటికి వెళ్లాం. నేను ఎక్కువగా మాట్లాడలేదు. ఆ తర్వాత కథలో కొన్ని మార్పులు చెప్పారు. నేను ఒప్పుకోలేదు. ‘నా కోసం ఈ రెండు మూడు సీన్స్‌ పెట్టాలి తప్పదు’ అన్నారు. ‘సరే’నన్నాను. ‘సర్‌ మరుసటి రోజు షూటింగ్‌కు సంబంధించిన సీన్లు చెప్పడానికి ముందురోజు సాయంత్రమే మీ రూమ్‌కు రమ్మంటే వస్తా. కానీ సెట్‌కు వచ్చిన తర్వాత మీరు సన్నివేశాలను మార్చమని అడిగితే గందరగోళానికి గురై తప్పుచేస్తా’ అని దిలీప్‌కుమార్‌గారికి చెప్పా. ఆయన ఒక్కసారిగా నవ్వి ‘నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్. నేను మధ్యలో వేలు పెట్టను’ అన్నారు. 

మీరు తీసింది 33 సినిమాలే అయినా, 100 సినిమాలు తీసిన దర్శకుడికి వచ్చిన పేరు వచ్చింది. దాన్ని మీరు ఎంజాయ్‌ చేశారా?

బి.గోపాల్‌: నా మొదటి సినిమా ‘ప్రతిధ్వని’ 100రోజులు ఆడింది. సినిమా విడుదలై మూడు వారాలైన తర్వాత రామానాయుడు ఫోన్‌ చేసి ‘ఈ సినిమా హిందీలో తీస్తున్నాం.. నువ్వు దర్శకుడివి’ అన్నారు. ‘సర్‌ హిందీ నాకు ఒక్క ముక్కరాదు. నేను చేయలేను సర్‌’ అన్నా. ‘నువ్వు చెయ్యగలవు.. మనం చేస్తున్నాం. అని ఫోన్‌ పెట్టేశారు.’ అలా వరుస సినిమాలు 100 రోజులు ఆడాయి. 

మీరు 8వ తరగతిలో ఉండగా రోడ్డుపై ఒక సైకిల్‌ చూసి ‘అబ్బా.. ఈ సైకిల్‌ భలే ఉంది’ అనుకుని ఇంటికి వెళ్లేసరికే ఆ సైకిల్‌ మీ ఇంటి దగ్గర ఉందట!

బి.గోపాల్‌: మా ఊరు ఎం.నిడమనూరు నుంచి కారుమంచికి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. నేను ఆరో తరగతి చదువుతున్నప్పటి నుంచి ‘నాన్న నాకు సైకిల్‌ కొనిపెట్టవా’ అని అడిగేవాడిని. నేను ఎనిమిది చదువుతుండగా, ఒక రోజు స్కూల్‌ నుంచి ఇంటికి వస్తుంటే ఒక వ్యక్తి ఆకుపచ్చ రంగు హంబర్‌ సైకిల్‌ వేసుకుని మా ముందు నుంచి వెళ్లాడు. ‘అబ్బా.. ఈ సైకిల్‌ భలే ఉంది’ అనుకున్నా. అరగంట తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే ఆ సైకిల్‌ మా ఇంటి ముందే ఉంది. ‘అరే.. ఈ సైకిల్‌ నీదేరా.. చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కదా’ అని నాన్న అన్నారు. నా ఆనందానికి అవధువులు లేకుండా పోయాయి.

మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లిన సినిమా ‘సమర సింహారెడ్డి’. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయాలన్న ఆలోచన మీదా? రచయితలదా?

బి.గోపాల్‌: రచయితలదే. విజయేంద్ర ప్రసాద్‌గారిది. నాకు మొదటి నుంచి పరుచూరి బ్రదర్స్‌తో బాగా చనువు ఉండేది. అయితే, నా మొదటి సినిమా విషయంలోనే వాళ్లతో గొడవ పడ్డా. బయట ఎంత స్నేహంగా ఉన్నా, స్క్రిప్ట్‌ దగ్గరకు వచ్చే సరికి అన్ని రకాలుగా వాదించేవాడిని. నాకంటే కూడా అన్నదమ్ములిద్దరూ గొడవ పడతారు. 

‘సమర సింహారెడ్డి’ అలా చేయాలని ఎందుకు అనిపించింది?

బి.గోపాల్‌: 1990లో ‘లారీ డ్రైవర్‌’ నుంచి విజయేంద్రప్రసాద్‌గారు నాకు కథలు చెబుతూనే ఉన్నారు. 1997లో వరుసగా మూడు కథలు చెప్పారు. ఏవీ నాకు నచ్చలేదు. ఇక ఆయన దగ్గరకు రావడం మానేశారు. తోట రామకృష్ణ అనే కో-డైరెక్టర్‌ ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆ సమయానికి నాకు రెండు ఫ్లాప్‌లు వచ్చాయి. పెద్దల హీరోలు సినిమాలు చేయడం లేదు. ‘మీకు నచ్చిన పాత సినిమాలు ఏంటి’ అని విజయేంద్రప్రసాద్‌ అడిగారు. ‘గుండమ్మకథ అంటే చాలా ఇష్టం. దీనికి దుష్మన్‌ కలుపుతూ కథ చెప్పండి’ అన్నాను. ‘ఆలోచన బ్రహ్మాండగా ఉంది. వారం రోజుల్లో మీకు మంచి లైన్‌ చెబుతా’ అని ‘సమర సింహారెడ్డి’ కథ చెప్పారు.

ఈ సినిమాకు మొదటి నుంచీ బాలకృష్ణనే అనుకున్నారా?

బి.గోపాల్‌: అవును! విజయేంద్రప్రసాద్‌, నేను, చెంగళ వెంకట్రావు మద్రాసు వెళ్లి బాలకృష్ణకు కథ చెప్పాం. ‘రెండు రోజుల్లో  చెబుతా’ అని బాలయ్య అన్నారు. ‘అయితే కష్టమే’ అని విజయేంద్రప్రసాద్‌ పెదవి విరిచి బయటకు వెళ్లిపోయారు. నేనూ, చెంగళ వెంకట్రావు అక్కడే కూర్చొని ఉన్నాం. ‘మీకు ఎలా ఉంది’ అని బాలయ్య అడిగారు. ‘రాయలసీమలో ఎన్టీఆర్‌కు ఎనలేని ఆదరణ ఉంది. మీరన్నా కూడా ఇష్టం. ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో మీరు సినిమా చేస్తున్నారు. అది ఒక ప్లస్‌ పాయింట్‌. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బ్రహ్మండంగా ఉంది. హీరోయిజం బాగుంది. క్లైమాక్‌ అదిరిపోయింది’ అని చెప్పా. ‘ఇంకెందుకు ఆలస్యం చేసేద్దాం’ అన్నారు. ఆ తర్వాత అది ఎంత పెద్ద హిట్టయిందో మీకు తెలుసు.
‘సమరసింహారెడ్డి’లో పాటలు బాగుంటాయి.. అందుకు ఏమైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా?

బి.గోపాల్‌: మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ‘అందాల ఆడబొమ్మ’.. చాలా బాగుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆ ట్యూన్‌కు మొదట ఐదు పల్లవులు రాశారు. ఏవీ నచ్చలేదు. మరో ఐదు రాశారు. అవీ నచ్చలేదు. మరుసటి రోజు ఉదయం సీతారామశాస్త్రిగారి ఇంటికి వెళ్లాం. మరో ఐదు పల్లవులు రాశారు. అవీ నచ్చలేదు. దాంతో అప్పటికి 15 పల్లవులు అయ్యాయి. కొద్ది సేపటికి మరో రెండు వినిపించారు. అవీ అంతగా అనిపించలేదు. ‘చివరిగా మీరు ఒకే ఒక్కటి రాయండి. నచ్చకపోతే ఈ 18 పల్లవుల్లో ఏదో ఒకదానికి ఫైనలైజ్‌ చేద్దాం’ అన్నాను. నిజంగా ఆయన గొప్ప రచయిత, అస్సలు విసుక్కోకుండా రాసేవారు. చివరిగా రాసింది.. ‘అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుంది ముద్దుగుమ్మ’. సూపర్‌హిట్‌. ఈ సినిమా విడుదలైన పదేళ్ల తర్వాత గుంటూరులో ఒక కార్యక్రమం జరుగుతుంటే వెళ్లా. అక్కడ ఒక 70ఏళ్ల ముసలావిడి లేచి ‘అన్ని పాటలు పాడుతున్నారు. అందాల ఆడబొమ్మ.. పాట పాడరెందుకు ’ అని అడిగింది. అంతలా జనానికి ఆ పాట నచ్చింది. ఈ సినిమాకు రాయలసీమలో విశేష ఆదరణ లభించింది. జయప్రకాష్‌రెడ్డి పాత్రను కూడా చాలా మంది మెచ్చుకున్నారు. 

బాలకృష్ణతో నాలుగు సినిమాలు హిట్‌. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ఫ్లాప్. ముందే తెలుసా ఫ్లాపవుతుందని?

బి.గోపాల్‌: ‘లారీ డ్రైవర్‌’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, సూపర్‌హిట్‌లు. ‘పలనాటి బ్రహ్మనాయుడు’ పోయింది. సబ్జెక్ట్‌ బాగుంటే అన్నీ బాగుంటాయి. ఎందుకో ఆ సినిమాకు కుదరలేదు. 

‘ఇంద్ర’ తీసిన తర్వాత మీకు ఎలాంటి ఇమేజ్‌ వచ్చింది?

బి.గోపాల్‌: నాకు చాలా మంచి పేరొచ్చింది. చిన్నికృష్ణ రచయిత. పరుచూరి బ్రదర్స్‌ డైలాగ్‌లు బాగా పేలాయి. ‘మొక్కే కదాని పీకేస్తే..’ డైలాగ్‌కు థియేటర్‌లో విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

మీ సినిమాల్లో ముగ్గురు, నలుగురు హీరోయిన్లు పెడతారెందుకు?

బి.గోపాల్‌: నా ఇష్టం. (నవ్వులు) 

మీ కెరీర్‌లో గోల్డెన్‌ ఇయర్‌ ఏది?

బి.గోపాల్‌: 1990లో ‘లారీ డ్రైవర్‌’విడుదలైంది. రెండు వారాల గ్యాప్‌తో  ‘బొబ్బలి రాజా’. ఆ తర్వాత ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. నాలుగూ సూపర్‌హిట్లు. ‘అల్లరిరాముడు’, ‘ఇంద్ర’ కూడా ఒకే సంవత్సరంలో విడుదలయ్యాయి. స్క్రిప్ట్‌ రెడీ ఉంటే వెంట వెంటనే సినిమాలు తీస్తా. అది కుదరకపోతే ‘ఈ సినిమా ఆగిపోతే బాగుండు’అని దేవుడికి దండం పెట్టుకుంటా. 

‘బొబ్బలిరాజా’ షూటింగ్ సమయంలో వెంకటేశ్‌ను పాముల మధ్య పడేశారు కదా!

బి.గోపాల్‌: వెంకటేశ్‌ రోజూ రావడం ఆ పాములను చూడటం, వెళ్లిపోవడం జరిగేది. రైలు మీద వెళ్తూ.. క్లైమాక్స్‌ ఫైట్‌ షూట్‌ చేశాం. రైలు మీద వెళ్లేటప్పుడు కనిపించే సన్నివేశాలు అన్నీ నల్లమల ఫారెస్ట్‌లో తీశాం. కంపార్ట్‌మెంట్‌ కనిపించే సన్నివేశాలు స్టూడియోలో తీశాం. మనకు ఒక పామును చూస్తేనే ఒళ్లు జదలరిస్తుంది. అలాంటి 200 పాములు తీసుకొచ్చి పెట్టాం. వెంకటేశ్‌బాబు ధైర్యంగా కూర్చొని చేశాడు. 

బాగా హిట్‌ అవుతుందనుకుని ఫ్లాప్‌ అయినా సినిమా ఏదైనా ఉందా? ఫ్లాప్‌ అయితే మీ రియాక్షన్‌ ఏంటి?

బి.గోపాల్‌: ఒక సినిమా ఉంది. కాకపోతే ఫ్లాప్‌ అవుతుందనుకుని సినిమా చేయం కదా! ఒక వేళ ఫ్లాప్‌ అయితే నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతా. ఎందుకంటే సినిమాను నమ్ముకుని చాలా మంది బతుకుతారు. నా వల్ల వాళ్లకు నష్టం ఏర్పడిందని ఫీలవుతా. 

మీరు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉండగా ఎవరినీ ప్రేమించలేదా?

బి.గోపాల్‌: సినిమాను ప్రేమించా. కాలేజ్‌లో చదువుకునేటప్పుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ సినిమాలు బాగా చూసేవాడిని. ఆ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అయిన తర్వాత ‘అడవిరాముడు’ చిత్రానికి పనిచేసేటప్పుడు రోజూ ఎన్టీఆర్‌ను చూసే భాగ్యం కలిగింది. ఆ తర్వాత రామానాయుడుగారు నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేయకపోతే ఫ్లాప్‌ అవుతుంది. ఫ్లాప్‌ అయితే ఇండస్ట్రీలో ఉండలేం. అనే భయం ఉంటుంది. 

మీ సినిమాల్లో రైలు సన్నివేశాలు తప్పకుండా ఉంటాయి అది సెంటిమెంటా?

బి.గోపాల్‌: అలా ఏమీలేదు. స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయడం వల్లే ట్రైన్‌ సీన్లు ఉంటాయి. ‘రౌడీ ఇన్స్‌పెక్టర్‌’ నుంచి నా సినిమాల్లో ఎక్కడో ఒక చోట రైలు కనిపిస్తూనే ఉంటుంది.

‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’ రెండు కథలు ఒకేలా అనిపిస్తాయి కదా! మీకు అనిపించలేదా!

బి.గోపాల్‌: అవును! రెండు కథలూ ఫ్యాక్షన్‌ బ్యాడ్రాప్‌లో నడుస్తాయి. హీరో వేరే చోట పనిచేస్తూ బతుకుతూ ఉంటాడు. కానీ రెండు స్క్రీన్‌ప్లేలు వేరు. ‘సమరసింహారెడ్డి’లో ఒక పవర్‌ఫుల్‌ మ్యాన్‌ తన దగ్గర పనిచేసే వ్యక్తి కోసం, అతని చెల్లెళ్ల కోసం హోటల్‌లో పనిచేస్తూ ఉంటాడు. కానీ, ‘ఇంద్ర’లో తన ఆస్తులన్నీ ప్రజల కోసం ఇచ్చేసి ట్యాక్సీ డ్రైవర్‌గా బతుకుతూ ఉంటాడు. రెండింటి కథ నేపథ్యం విషయంలో ఒకటిగా అనిపించినా స్క్రీన్‌ప్లేలు వేర్వేరు. లేకపోతే ప్రేక్షకులు హిట్‌ చేస్తారా? 

‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాల్లో మీకు బాగా నచ్చింది ఏది?

బి.గోపాల్‌: రెండూ బాగుంటాయి. కానీ, సమరసింహారెడ్డి క్లైమాక్‌తో పోలిస్తే, నరసింహనాయుడు క్లైమాక్స్‌ కాస్త వీక్‌. నరసింహనాయుడులో క్లైమాక్స్‌ ముందు ఫైట్‌ సీన్‌ ఉంటుంది. అదే క్లైమాక్స్‌ అన్న రీతిలో మెప్పించింది. ఆకెళ్ల అనే రచయిత సినిమా చూసి మా ఇంటికి వచ్చి ‘బి.గోపాల్‌గారు.. మీ దగ్గరకు నేను సినిమా అవకాశం కోసం రాలేదు. కథ చెప్పడానికి రాలేదు. ఇప్పుడే ‘నరసింహనాయుడు’ చూశా ఎక్స్‌టార్డనరీ’ అని షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి వెళ్లిపోయారు. 

‘రౌడీ ఇన్స్‌పెక్టర్‌’ షూటింగ్‌ చేస్తుండగా బాలకృష్ణకు పోలీస్‌ జీపు పంపేవారట!

బి.గోపాల్‌: ఏసీ కారు పంపినా అందులో వచ్చేవారు కాదు. ‘నేను పోలీస్‌ ఆఫీసర్‌ని కదా. ఆ మూడ్‌ రావాలంటే షూటింగ్‌కు పోలీస్‌ జీపులోనే వస్తా’ అనేవారు. ఆ సినిమాలో బాలయ్య డైలాగ్‌లు చెబుతుంటే, ఎన్టీఆర్‌ డైలాగ్‌లు చెబుతున్నట్లు ఉండేది. 

మీ ఫ్యామిలీ గురించి?

బి.గోపాల్‌: మాది పెద్దలు కుదర్చిన వివాహం. మాకు ఒక పాప. ప్రస్తుతం చదువుకుంటోంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని