ప్లేట్లు కడగడం నుంచి జీవితాన్ని మొదలుపెట్టా

‘‘జానపద కళలు మన వారసత్వ సంపద. వాటిని నాశనం చేసుకుంటున్నాం. కొన్ని జీవితాలు ఛిద్రమవుతున్నాయి. దీని వెనక మార్కెట్‌ శక్తులున్నాయి. ఆ విషయాన్ని వాణిజ్య ప్రధాన కథతో చెప్పబోతున్నాం’’ అన్నారు కరుణ కుమార్‌. ఆయన తెరకెక్కించిన చిత్రం...

Published : 03 Mar 2020 18:30 IST

‘‘జానపద కళలు మన వారసత్వ సంపద. వాటిని నాశనం చేసుకుంటున్నాం. కొన్ని జీవితాలు ఛిద్రమవుతున్నాయి. దీని వెనక మార్కెట్‌ శక్తులున్నాయి. ఆ విషయాన్ని వాణిజ్య ప్రధాన కథతో చెప్పబోతున్నాం’’ అన్నారు కరుణ కుమార్‌. ఆయన తెరకెక్కించిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా నటించారు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. సురేష్‌  ప్రొడక్షన్స్‌ ద్వారా 6న వస్తోంది. కరుణ కుమార్‌ విలేకర్లతో మాట్లాడారు.
‘‘తరాలుగా ప్రపంచమంతా జరుగుతున్న కథ ఇది. ఒక సామాజిక సమస్యని వాణిజ్య  ప్రధానంగా ఈ చిత్రంతో చెప్పబోతున్నాం. ‘సిటిజన్‌ కేన్‌’ సినిమా తరహాలో ఈ కథని మూడు పాత్రలు చెబుతుంటాయి. నిత్యం మనం పత్రికల్లో చదివే సంగతులు, మనం నడుచుకుంటున్న విధానమే ఈ కథలో     ప్రతిబింబిస్తుంది. ప్రతి ఐదు నిమిషాలకి కథ మారిపోతుంటుంది. చిత్ర పరిశ్రమలో చాలా మంది ఈ సినిమాని చూశారు. 25 ఏళ్ల కాలంలో ఇలాంటి కథ రాలేదని చెప్పారు. కచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం ఉంది’’.
* ‘‘మాది పలాస దగ్గరలోని కంట్రగడ.  పేదరికంతో 15 ఏళ్ల వయసులో ఇంట్లో నుంచి వెళ్లిపోయాను. మద్రాస్‌ వెళ్లి  హోటల్‌లో ప్లేట్లు కడగడం నుంచి    జీవితాన్ని మొదలుపెట్టా. ఆఫీస్‌బాయ్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌, అకౌంట్స్‌ ఎగ్జిక్యూటివ్‌... ఇలా చాలా పనులు చేశా. తెలియని ప్రాంతం, భాష కావడంతో పుస్తకం ఒక్కటే నాకు అందుబాటులో ఉండేది. అలా సాహిత్యంపై మక్కువ పెరిగింది. క్రమంగా రాయడం అలవాటైంది. కొన్నేళ్ల తర్వాత తిరిగి ఇంటికొచ్చా. జీవనోపాధి కోసం  రకరకాల వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్‌ చేరుకున్నా. నేను రాసిన ‘చున్నీ’ అనే కథకి మంచి పేరొచ్చింది. 2016లో స్వచ్ఛభారత్‌ పోటీల్లో ‘చెంబుకు మూడింది’ అనే లఘు చిత్రం తీస్తే జాతీయ పురస్కారం వచ్చింది. రూ.12 వేలతో తీసిన ఆ     చిత్రానికి రూ.5 లక్షల బహుమతి     లభించింది. ‘అ!’ సినిమాకి రచనా సహకారం చేశా. మొత్తం 25 చిత్రాలకి పనిచేశా’’.
* ‘‘ఈ చిత్ర సమర్పకుడు తమ్మారెడ్డి భరద్వాజ పిలిచి కథ అడిగారు. నేను మొదట ప్రేమకథో, థ్రిల్లర్‌ కథో చేయాలనుకున్నా. ఐదో సినిమాగా ‘పలాస 1978’ చేయాలనుకున్నా. కానీ తమ్మారెడ్డి     భరద్వాజ ఈ కథే చేద్దామని చెప్పారు. కథ విన్నాక ఆయన నువ్వు ఇలాగే తీస్తే ‘అంతఃపురం’ని మించిన సినిమా అవుతుందన్నారు. పూర్తయ్యాక చెప్పినట్టే తీశావని మెచ్చుకున్నారు. దర్శకుడు సుకుమార్‌ మా సినిమాని చూసి వెంటనే చిత్రంలోని ముగ్గురు నటుల్ని తన సినిమాలోని కీలక పాత్రల కోసం ఎంపిక చేశారు. నా రెండో సినిమాని ఆయన సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలో చేయమని అడిగారు. అలాగే అల్లు   అరవింద్‌గారు కూడా సినిమా చేసే అవకాశాన్నిచ్చారు’’.
* ‘‘మొదట మా సినిమాని చూసి సెన్సార్‌ బోర్డు 25 కట్స్‌ ఇచ్చింది. దాంతో మేం రివైజింగ్‌ కమిటీకి వెళ్లాం. అక్కడ రెండు సంభాషణల్ని మాత్రమే తీసేసి  విడుదలకి అంగీకారం తెలిపారు’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని