వారికి మీ పద్ధతిలోనే సమాధానం చెప్పండి!

క‌రోనా సృష్టించిన విపత్తులో ప్రాణాలకు తెగించి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారుల‌తో యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ముచ్చటించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్ కుమార్ ఆధ్వర్యంలో సోమ‌వారం.....

Updated : 14 Apr 2020 16:17 IST

పోలీసుల ప్రశ్నలు.. విజయ్‌ దేవరకొండ సమాధానాలు

హైదరాబాద్‌: కరోనాపై పోరాటం చేసేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య, పోలీస్‌ విభాగాల కృషి ఎంతో ఉంది. ప్రాణాలకు తెగించి మరీ వీరు విధుల్లో పాల్గొంటున్నారు. కర్తవ్య దీక్షతో పనిచేస్తున్న పోలీస్ అధికారుల‌తో యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ముచ్చటించారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాల్లో పనిచేస్తున్న పోలీసు అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా మాట్లాడారు. పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విజయ్‌ పోలీసుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నించారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉన్న తమకు విజయ్‌ మాటలు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాయని అధికారులు చెప్పారు. తమతో మాట్లాడిన హీరోతో ఆనందం పంచుకుంటూ, ధన్యవాదాలు తెలిపారు. తమ కోసం సమయం కేటాయించిన విజయ్‌కు అంజన్ కుమార్‌తోపాటు ఆయన సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు అడిగిన ప‌లు ప్రశ్నల‌కు విజ‌య్ సమాధానాలు చెప్పారు.

మీరు కూడా  పోలీస్ చెక్ పోస్ట్‌ల దగ్గరకు వ‌చ్చి, ప్రజ‌ల‌ను బ‌య‌టకు రావొద్దని కోరితే బాగుంటుంది. ఏమంటారు?

విజయ్‌: తప్పకుండా వ‌స్తాను, కానీ నేను వ‌చ్చిన‌ప్పుడు మీ లాఠీల‌కు ప‌ని చెప్పకూడ‌దు. అందుకు అనుమతి పత్రం ఇస్తే తప్పకుండా వ‌స్తా. కానీ, మ‌న సీఎం కేసీఆర్ సర్‌ బ‌య‌ట‌కు రావొద్దని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్లు చెప్పిన తర్వాత కూడా బ‌య‌ట తిరిగే వాళ్లకు మీ ప‌ద్ధతిలోనే స‌మాధానం చెప్పాలి. నేను వ‌చ్చి చెబితే.. మంచి జ‌రుగుతుందని మీరు న‌మ్మితే త‌ప్పకుండా వ‌స్తా.

లాక్‌డౌన్‌లో మీ అమ్మకు సాయం చేస్తున్నారా?

విజయ్‌: రోజూ షూటింగ్‌లు ఉన్న సమయంలో ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునేవాడిని కాదు. కానీ, ఇప్పుడు అమ్మ ప‌డుతున్న క‌ష్టం చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తోంది. అమ్మ కష్టం చూసి నేను ఆమెకు సాయం  చేయ‌డానికి వెళ్తుంటే, ‘నీ వ‌ల్ల నా ప‌ని మరింత పెరుగుతుంద‌’ని అంటూ కోప్పడుతోంది. కానీ ఇలాంటి స‌మ‌యంలోనూ ఉద్యోగాలు చేస్తూ.. ఇంటి ప‌నిని చ‌క్క బెడుతున్న మ‌హిళా అధికారుల‌కు హ్యాట్సాఫ్’.

మిమ్మల్ని పోలీసు అధికారి పాత్రలో చూడాలని ఉంది.

విజయ్‌: త‌ప్పకుండా మంచి స్క్రిప్ట్ వ‌స్తే చేస్తా. రెండు, మూడు సంవత్సరాల్లో మంచి పోలీసు పాత్రతో మీ ముందుకు వ‌స్తా.

మీరు పోలీస్‌ అధికారికగా ఉండి ఉంటే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఫీలయ్యే వారు?

విజయ్‌: చాలా బాధ్యత‌గా ఫీల్ అయ్యే వాడ్ని. క‌మిష‌న‌ర్ ఆదేశాల మేర‌కు ప‌నిచేసే వాడ్ని. మీరంద‌రూ మా కోసం ప‌నిచేస్తున్నారు. మేం ఇంట్లో కూర్చుంటే.. మీరు ప‌ని గంట‌లు పెంచుకొని మా కోసం రోడ్ల మీద డ్యూటీలు చేస్తున్నారు. మీ అంద‌రికీ నా న‌మ‌స్కారాలు.

ఒత్తిడిలో ఉంటే ఏం చేస్తారు?

విజయ్‌: నా ప‌నే నాకు గుర్తింపు ఇచ్చింది. మీ అంద‌రి ప్రేమ‌నిచ్చింది. పరాజయాలు ఎదురైనా, మనసు బాగోలేకపోయినా.. నా ప‌ని మీద మ‌రింత దృష్టి పెడతా. నేను చిన్నప్పుడు పాఠశాలలో ‘మ‌హా భార‌తం’ నాటకంలో పాల్గొన్నా. అప్పుడు కృష్ణుడు అన్న మాటలు నా మీద బ‌లంగా ప్రభావం చూపాయి. ఈ స‌మ‌యం గ‌డిచిపోతుంది.. నిజ‌మే, ఏ స‌మ‌యం అయినా శాశ్వతం కాదు. క‌రోనా కూడా అంతే. మ‌నం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే క‌రోనా మ‌న జీవితాల్లో ఓ జ్ఞాప‌కంగా మిగిలిపోతుంది.

ఇదీ చదవండి..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని