మాధవన్‌ నా భర్త జీవితాన్ని మార్చేశాడు: సుహాసిని

దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుడు మణిరత్నం. ఆయనకున్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సాధారణ ప్రజలే కాదు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఆయన్ను ఎంతో ఆరాధిస్తుంటారు. ‘దళపతి’, ‘గీతాంజలి’, ‘బొంబాయి’, ‘సఖి’ ‘రోజా’ వంటి వైవిధ్యమైన....

Updated : 15 Apr 2020 16:34 IST

భార్యతో మణిరత్నం లైవ్‌.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు

చెన్నై: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకున్న దర్శకుడు మణిరత్నం. సాధారణ ప్రజలే కాదు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం ఆయన్ను ఎంతో ఆరాధిస్తుంటారు. ‘దళపతి’, ‘గీతాంజలి’, ‘బొంబాయి’, ‘సఖి’ ‘రోజా’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడారు. తన సతీమణి, నటి సుహాసిని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. వందల మంది అభిమానులు తమ ప్రశ్నల్ని అడిగారు. వాటిలో కొన్నింటికి మణిరత్నం సమాధానాలు ఇచ్చారు. అతి తక్కువగా మాట్లాడే ఆయన ఇలా లైవ్‌లో అనేక విషయాల్ని, అభిప్రాయాల్ని పంచుకోవడంతో ఫ్యాన్స్‌ సంబరపడ్డారు.

అంతేకాదు ఇదే లైవ్‌లో నటుడు ఆర్‌.మాధవన్‌, నటి అదితిరావు హైదరి, ఖుష్బు తదితరులు కూడా పాల్గొనడం మరో విశేషం. మణిరత్నం దంపతులు-మాధవన్‌కు మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. మాధవన్‌ తన భర్త మణిరత్నంకు గోల్ఫ్‌ ఆట నేర్పించి ఆయన జీవితాన్ని మార్చేశారని సుహాసిని అన్నారు. అనంతరం ‘సఖి’ చిత్రం మంగళవారంతో 20 ఏళ్లు చేసుకుందని గుర్తు చేసుకున్నారు. సినిమాలోని రైలు సన్నివేశం తీస్తున్నప్పుడు చాలా కంగారు పడ్డానని.. ఎందుకంటే ఆ సమయంలో కేవలం రెండు రైలు మాత్రమే ఉన్నాయని మణిరత్నం అన్నారు.

అనంతరం ప్రముఖ నటి పూనమ్‌ థిల్లాన్‌ లైవ్‌లోకి వచ్చారు. ‘మీరు అద్భుతమైన నటుల్ని పాత్రలకు తీసుకుని సినిమా తీస్తారా?, సాధారణ నటుల్ని పాత్రలకు ఎంచుకుని వారిని మీ సినిమా ద్వారా అద్భుతమైన నటుల్ని చేస్తారా?’ అని ప్రశ్నించారు. దీనికి మణిరత్నం స్పందిస్తూ.. ‘దయచేసి బాగా నటించండని నా నటుల్ని అడుగుతుంటాను’ అని చెప్పారు.

అదితిరావు హైదరి మాట్లాడుతూ.. ‘మణిరత్నం సర్‌ మీరు నటుల్ని ఎలా ఎంపిక చేస్తారు?’ అని ప్రశ్నించారు. ‘నన్ను వీరైతే ఎక్కువ ఇబ్బంది పెట్టరు అనిపిస్తే వారిని ఎంచుకుంటా. అంతేకాదు వారు పాత్రకు సరిపోతారని కూడా అనిపించాలి. మొదటి ఛాయిస్‌తోనే మనం ఆగిపోలేం కదా. మంచి నటీనటుల్ని ఎంచుకోవడం అంటే.. సగం సినిమా పనిని పూర్తి చేసినట్లే. నేను చెప్పింది చెప్పినట్లు చేసే నటుల కోసం నేను చూడటం లేదు. నటి/నటుడు నేను చెప్పినదాని కంటే అదనంగా చేసి చూపించాలి’ అని మణిరత్నం జవాబిచ్చారు.

అనంతరం ఓ అభిమాని సినిమాలు కాకుండా వెబ్‌ సిరీస్‌లు తీయమని అడిగారు. దీనికి మణిరత్నం సమాధానం ఇస్తూ.. ‘నేను టెన్నిస్‌ను 20 ఏళ్లుగా ఆడుతున్నా. కానీ మీరు నన్ను ఫుట్‌బాల్‌ ఆడమని అడుగుతున్నారు. నేను ఆడినా గెలవలేను. ఎవరైనా సరే వారు ఎందులో ఉత్తమమో అదే చేయాలి. అలా కాదని మరోదాని కోసం వెళితే నష్టపోతాం’ అని అన్నారు.

తన తర్వాతి చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ గురించి ప్రశ్నించగా.. ‘నేను ప్రస్తుతం స్క్రిప్టు రాస్తున్నా. కానీ అది ముందుకు వెళ్లడం లేదు. దీన్ని హిందీలోనూ తీస్తున్నాం. అంతేకాదు ఈ సినిమాను రెండు భాగాల్లో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని దర్శకుడు చెప్పారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్‌, జయం రవి, కార్తి, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

అంతేకాదు ఈ లైవ్‌ సెషన్‌లో మణిరత్నంకు మలయాళ దర్శకుడు లిజో జొస్‌ పెల్లిసేరీ అంటే ఇష్టమని సుహాసిని చెప్పారు. ‘అంగమలై డైరీస్‌’, ‘జల్లికట్టు’ చిత్రాలతో లిజో జొస్‌ గుర్తింపు తెచ్చుకున్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని