రెండు వందల బాలల చిత్రాలైనా లేకపోతే ఎలా?

చిన్నారుల సినిమా అని చిన్నచూపు చూడొద్దు. జనానికి ఓ సినిమా నచ్చిందంటే చాలు... కుటుంబాలు కుటుంబాలు థియేటర్‌కి తరలి వస్తుంటారు.

Published : 14 Nov 2022 19:00 IST

చిన్నారుల సినిమా అని చిన్నచూపు చూడొద్దు. జనానికి ఓ సినిమా నచ్చిందంటే చాలు... కుటుంబాలు కుటుంబాలు థియేటర్‌కి తరలి వస్తుంటారు. అలా పిల్లల మనసుల్ని గెల్చుకొని విజయాల్ని అందుకున్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నెన్నో! దురదృష్టవశాత్తు మన దేశంలోనే బాలల చిత్రాలు అరుదుగా రూపొందుతున్నాయి. ఆమీర్‌ఖాన్‌, సూర్య తదితర కొద్దిమంది తారలు బాలల చిత్రాల్లో మెరిసినా... ఆ సంఖ్య పెరగాలనేది సినీ పండితుల మాట. సోమవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డితో ‘ఈనాడు సినిమా’ ముచ్చటించింది. తెలుగులో  ‘హీరో’ అనే బాలల చిత్రం చేసి మెప్పించిన ఆయన చెప్పిన విషయాలివీ...

‘‘బాలల దినోత్సవాన బాలల చిత్రాల్ని గుర్తు చేసుకుంటే సరిపోదు. పెద్దవాళ్లు చూస్తున్న చిత్రాల కంటే చిన్నారుల చిత్రాలే సమాజానికి అవసరం. ఒక కొత్త సమాజాన్ని సృష్టించేంత శక్తి సామర్థ్యాలు వాటికి ఉన్నాయి. సినిమాలతో పెద్దల్ని మార్చడం కష్టమేమోగానీ.. పిల్లలు మాత్రం సులభంగా ప్రభావితం అవుతారు. మరి ఏటా రెండు వేల చిత్రాలు నిర్మిస్తున్న భారతీయ చిత్ర పరిశ్రమ.. అందులో రెండు వందల బాలల సినిమాలైనా తీయకపోతే ఎలా? పాఠశాలల్లో సినిమా ఒక పాఠ్యాంశం కావాలి. ఆయా తరగతులకి తగ్గట్టుగా ఏటా కొన్ని సినిమాల్ని విద్యార్థులకి చూపిస్తూ వాటి నుంచి ఎన్నో విషయాల్ని చెప్పే ఆస్కారం ఉంది. ప్రతి సబ్జెక్ట్‌నీ సినిమాతో చెప్పొచ్చు. మనం గుర్తు పెట్టుకున్నది మరిచిపోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ, తెలుసుకున్నది మాత్రం మరిచిపోలేం. భావోద్వేగాల్ని తెరపై ఆవిష్కరిస్తూ సినిమా తెలుసుకునే అవకాశం ఇస్తుంది. మన విద్యావ్యవస్థ గుర్తు పెట్టుకోవడం దగ్గరే ఆగిపోయింది. పిల్లలకి సినిమాతో నేర్పిస్తూ, విద్యావ్యవస్థ ప్రస్తుతం చేస్తున్న మంచి కంటే ఎక్కువగా మంచి చేసే అవకాశం ఉంది’’.

* ‘‘సినిమా అనే ఒక అద్భుతమైన సాధనాన్ని వంద మంది చేతుల్లో పెట్టేసి, వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది అంటే లాభం లేదు. బాలల చిత్రాల్ని ప్రోత్సహించే బాధ్యతని ప్రభుత్వాలు తీసుకోవాలి. మంచి భావి సమాజాన్ని సృష్టించాలంటే అది చాలా అవసరం. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ తరహాలో అగ్ర దర్శకులూ ఓ సామాజిక బాధ్యతగా భావించి, వాళ్ల జీవిత కాలంలో ఒక్క బాలల సినిమానైనా చేయాలి. కథానాయకులు కూడా అదే బాధ్యతని తీసుకోవాలి. పవన్‌కల్యాణ్‌ ఒక చిన్న పిల్లల సినిమాలో నటిస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది? చిన్న కష్టానికే కుంగిపోకూడదనో, అబద్ధాలు చెప్పకూడదనో... ఇలా  ఓ చిన్న అంశాన్నే సినిమాతో చెప్పిస్తే అది పిల్లలపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. తారలు, దర్శకులు అలా ముందుకొస్తే విద్యా సంబంధమైన అంశాలతో చిత్రాలు విరివిగా రూపొందే అవకాశం ఉంటుంది’’.

* ‘‘చిన్నారులకి కథలు చెప్పే అమ్మమ్మ తాతయ్యలు ఇప్పుడు కరువయ్యారు. వాళ్లకి తగ్గ కథలు చెప్పే సినిమాలైనా అందుబాటులో లేకపోతే ఎలా? మన భారతీయ సంస్కృతి, భారతీయ పాత్రల గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. చిన్నప్పుడు విన్న హరిశ్చంద్రుడి కథ మనకి ఎంత బాగా చేరువైంది. అలాంటి విలువలతో కూడిన కథల్ని సినిమాలతోనూ పిల్లలకి చేరువ చేయొచ్చు. విలువలనే కాదు, స్నేహంతో ముడిపెడుతూ అయస్కాంతత్వం గురించో, గురుత్వాకర్షణ గురించో చెప్పొచ్చు. ఆ సినిమా చూశాక వాళ్లకి మళ్లీ ఆ పాఠాలు చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి కథలు రాసే ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. పాకిస్తాన్‌ని తిట్టడమే దేశభక్తి కాదు... కశ్మీర్‌, గుజరాత్‌, కేరళ ఇలా దేశం నలుమూలలా ఎక్కడ ఏ సంస్కృతి ఉంది, వాళ్లు ఏం తింటున్నారు? వాళ్ల వస్త్రధారణ ఎలా ఉంటుందో తెరపై ఓ సినిమాతో చూపిస్తే మన దేశంలో వైవిధ్యం గురించి తెలుస్తుంది. మన అన్నదమ్ములు ఇలా ఉన్నారని అర్థం అవుతుంది. ఇదే కదా దేశ సమగ్రత, వైవిధ్యం అంటే! సినిమాతో సామాజిక బాధ్యత కలిగిన కొత్త తరాన్ని సృష్టించేందుకు వీలు కలుగుతుంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని