నా బాల్యంలోనూ.. చేదు అనుభవాలే!

మనసుకు దగ్గరగా వుండే పాత్రల్లో నటిస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరు అంటోంది శ్రియ శరణ్‌. రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్న కథానాయిక ఈమె.

Updated : 09 May 2023 12:16 IST

మనసుకు దగ్గరగా వుండే పాత్రల్లో నటిస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరు అంటోంది శ్రియ శరణ్‌. రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కెరీర్‌ని కొనసాగిస్తున్న కథానాయిక ఈమె. ఇటీవల ‘మ్యూజిక్‌ స్కూల్‌’లో నటించారు. పాపారావు బియ్యాల దర్శకనిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శ్రియశరణ్‌ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘మ్యూజిక్‌ స్కూల్‌’ ఒక అందమైన కథ. సీరియస్‌ అంశాన్ని సంగీతంతో ముడిపెడుతూ చెప్పే ప్రయత్నం చేశారు దర్శకనిర్మాత. అలాగని ఇదేమీ డాక్యుమెంటరీలా ఉండదు. సున్నితమైన వినోదం, భావోద్వేగాలతో పక్కా వాణిజ్య చిత్రంగా రూపుదిద్దుకుని ప్రేక్షకుల ముందుకొస్తోంది. కళలు జీవితంలో ఎంత కీలకమో ఈ సినిమాలో చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.

కళలపై పట్టున్న నటులు ఈ కథకి అవసరమని నమ్మారు దర్శకనిర్మాత. అలా ఈ ప్రాజెక్ట్‌ నా దగ్గరికి వచ్చింది. కథ వినగానే కనెక్ట్‌ అయ్యాను. డాన్స్‌, సంగీతం నా జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. బాల్యంలోనే కథక్‌ నేర్చుకున్నా. కథక్‌లో గానం కీలకం. అలా సంగీతంపై కూడా నాకు కొంత పరిచయం ఉంది. రంగస్థలంపై డ్యాన్స్‌ డ్రామాలు చేశాను. ఆ అనుభవంతోనే ఈ సినిమాలో నటించా. నాతోపాటు శర్మన్‌జోషి ఇందులో నటించారు. తన భార్య, నేను మంచి స్నేహితులం. పలువురు చిన్నారులతో కలిసి నటించడం బాగుంది.

తెలిసో, తెలియకో చదువుల పేరుతో నేటితరంపై మితిమీరిన భారాన్ని మోపుతున్నాం. చిన్నారులు ఒత్తిడితో సతమతమవుతున్నారు. నా బాల్యంలోనూ అలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నా. మా నాన్న ఇంజినీర్‌. మా అమ్మ అధ్యాపకురాలు. మా తాతయ్యలు కూడా విద్యాధికులే. నేను చదువుకునే సమయంలోనూ అయితే డాక్టర్‌ లేదంటే ఇంజినీర్‌ అన్నట్టే మాట్లాడేవాళ్లు పెద్దవాళ్లు. తొమ్మిదో తరగతి తర్వాత ఇక చదువు తప్ప మిగతా వ్యాపకాలేవీ పిల్లలకి ఉండేవి కావు. దాంతో నేనూ ఒత్తిడికి గురయ్యేదాన్ని. అయితే అదృష్టవశాత్తూ మా అమ్మ నన్ను నృత్యంవైపు ప్రోత్సహించారు. కథక్‌ నేర్చుకున్నా. నా ప్రతిభని గమనించి చదువులపై ఎంత శ్రద్ధ తీసుకునేవారో, నృత్యంపరంగా కూడా అంతే ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఈ కథ విన్నప్పుడు ఇవన్నీ నాకు గుర్తొచ్చాయి.

మ్యూజిక్‌ టీచర్‌ పాత్ర నాది. ‘నేనున్నాను’లో సంగీతం నేర్చుకునే యువతిగా నటించా. కానీ తొలిసారి ఇందులో టీచర్‌గా నటించా. పాత్ర కోసమని ప్రత్యేకంగా సన్నద్ధమైందేమీ లేదు కానీ.. నటిస్తున్నప్పుడు చాలా సవాళ్లు ఎదురయ్యాయి. సంగీతం, పాటలకి ప్రాధాన్యం ఉన్న కథ ఇది. ఆ పాటల్ని ప్రాక్టీస్‌ చేస్తూ అందుకు తగ్గట్టుగా నటించడం ఓ మంచి అనుభవాన్నిచ్చింది.

కెరీర్‌ బాగానే సాగుతోంది. చెప్పాల్సిన కథల్లోనే భాగమవుతున్నా. ఆ విషయంలో గర్వంగా ఉంది. నా పాప రాధని ఇంటి దగ్గర వదిలి సెట్‌కి వస్తున్నా. అలాంటప్పుడు నేనెంత విలువైన కథల్లో నటించాలి? రేప్పొద్దున నా సినిమాలు చూసినా, నా మాటలు విన్నా మా పాప గర్వపడాలి. అలాంటి కథల్లోనే భాగమయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ దశే కాదు, ఇప్పటిదాకా సాగిన ప్రయాణం కూడా ఎంతో తృప్తినిచ్చింది. ఓ నటిగా గర్వపడేలా చేసింది.

ఒకప్పుడు నూటికి 90 మార్కులొచ్చాయంటే తల్లిదండ్రులు సంతోషించేవాళ్లు. ఇప్పుడేమో 99 మార్కులు రావాల్సిందే అంటున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నారుల్ని కళలవైపు ప్రోత్సహించేవాళ్లు చాలా అరుదు. సంగీతం, డాన్స్‌ క్లాసుల సమయంలో మా పిల్లలు హోమ్‌వర్క్‌ చేసుకుంటారనేవాళ్లే ఎక్కువ. కానీ చిన్నారుల్ని కళలు, ఆటలవైపు ప్రోత్సహిస్తే ఆ ఫలితాలే వేరుగా ఉంటాయి. జీవితాంతం మనతోపాటు ఉండేవి అవే. కళలు, ఆటలతో క్రమశిక్షణ పెరుగుతుంది. పెద్దవాళ్లని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. చిన్నారులు పెద్దయ్యాక వాళ్లకి ఇష్టమైన రంగంలోనే స్థిరపడినా... నేర్చుకున్న కళలు జీవితాంతం తోడుగా ఉంటాయి. రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగేలా చేసేవి అవే. పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే జీవితకాల బహుమానం అంటే ఇదే  కదా. ఇప్పటికీ ఆనందం వచ్చినా, బాధ కలిగినా నేను ఇంట్లో కథక్‌ నృత్యం చేస్తూ గడుపుతుంటా. నా కూతురు రాధ, నేను కలిసి చేస్తుంటాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు