బాలీవుడ్‌లో బయోపిక్స్‌ సందడి

బయోపిక్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఆకట్టుకునేలా, వాస్తవానికి దగ్గరగా, భావోద్వేగాలను సరిగ్గా తెరపై పలికించే జీవిత కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పటికే ఎందరో ప్రముఖుల జీవిత కథలు వెండతెరపై అలరించాయి. గత ఏడాది కూడా కొన్ని బయోపిక్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

Published : 07 Jan 2022 03:09 IST

బయోపిక్‌ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఆకట్టుకునేలా, వాస్తవానికి దగ్గరగా, భావోద్వేగాలను సరిగ్గా తెరపై పలికించే జీవిత కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇప్పటికే ఎందరో ప్రముఖుల జీవిత కథలు వెండతెరపై అలరించాయి. గత ఏడాది కూడా కొన్ని బయోపిక్స్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాదీ కొన్ని సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో రెండు బయోపిక్‌ చిత్రాలు బాలీవుడ్‌ తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటికి సంబంధించిన తాజా విశేషాలను గురువారం ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి.


జులన్‌ గోస్వామిగా అనుష్క

కొన్నేళ్లుగా వెండితెరపై కనిపించని బాలీవుడ్‌ అగ్ర తార అనుష్కశర్మ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె ఓ జీవిత కథలో నటించబోతోంది. భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’. ఇందులో జులన్‌ గోస్వామిగా అనుష్కశర్మ నటిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను అనుష్కశర్మ గురువారం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది. ‘‘ఎన్నో త్యాగాలకోర్చిన అద్భుతమైన కథ ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్‌’. భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ జులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఆమె క్రికెటర్‌ కావాలనుకున్నప్పుడు, ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు..ఆడవాళ్లు క్రికెట్‌ గురించి ఆలోచించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సవాళ్ల నడుమ ఆమె క్రికెటర్‌గా ఎదిగిన తీరే ఈ సినిమా’’అని రాసుకొచ్చింది అనుష్క. ఈ చిత్రానికి ప్రొసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తుండగా, కర్నేష్‌ శర్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మహిళా క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవిత కథ తాప్సి ప్రధాన పాత్రలో ‘శెభాష్‌ మిథు’గా రాబోతుంది.


వెండితెరకు శ్రీకాంత్‌ బొల్లా జీవితకథ

చిలీపట్నంకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీకాంత్‌ బొల్లా జీవితాధారంగా ఇప్పుడు హిందీలో ఓ సినిమా రూపొందుతోంది. తుషార్‌ హీరానందని దర్శకత్వంలో భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మర్‌ నిర్మిస్తున్నారు. ఇప్పుడీ చిత్ర టైటిల్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గురువారం ప్రకటించారు. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్‌.. ఆ లోపం తనకు శాపం కాదని నిరూపించారు. మసాచుసెట్స్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ డిగ్రీ పొంది.. బొల్లా ఇండస్ట్రీస్‌ పేరుతో పరిశ్రమల్ని స్థాపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పుడాయన పాత్రనే సినిమాలో రాజ్‌కుమార్‌ పోషించనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. ఫీనిక్స్‌లా ఎదిగిన శ్రీకాంత్‌ లాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి పాత్ర పోషించడం నాకెంతో గర్వకారణం. ఆయన పాత్ర పోషించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘రాజ్‌కుమార్‌ రావు లాంటి నటుడే ఈ కథకు న్యాయం చేయగలడు. తను ఈకథలో భాగమైనందుకు సంతోషిస్తున్నాం. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘శ్రీకాంత్‌ బొల్లా’ అనే టైటిల్‌ ఖరారు చేశాం. జులై నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామ’’న్నారు నిర్మాతలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని