Updated : 09 Jan 2022 06:16 IST

చిత్రీకరణలపై... కన్నెర్ర చేసిన కరోనా

భారీ చిత్రాల షూటింగులు వాయిదా

కరోనా ఒమిక్రాన్‌ వేషం వేసుకొని చిత్ర పరిశ్రమను దెబ్బకొట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వద్దామనుకున్న చిత్రాలను వాయిదా పడేలా చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ లాంటి వాటి కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. చిత్ర వర్గాలు, ప్రేక్షకుల ఆశల మీద నీళ్లు చల్లేసింది కరోనా. ఇప్పుడు షూటింగుల మీద దాని కన్ను పడింది. సినీ ప్రముఖులు ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు. పైగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో చిత్రీకరణలకు ఆటంకం ఏర్పడుతోంది. 

కరోనా రెండో వేవ్‌ తర్వాత చాలా కొత్త సినిమాలు పట్టాలెక్కాయి. భారీ హంగులతో ఇక్కడ, విదేశాల్లోనూ షూటింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాయి. విదేశాల్లో మాట అటు ఉంచితే ఇక్కడ ఇప్పుడు పలు  చిత్రీకరణలకు ఇబ్బంది కలుగుతోంది. దీంతో వేరే దారిలేక ప్రస్తుతానికి షెడ్యూల్‌ను వాయిదా వేశాయి ఆయా చిత్రబృందాలు. చిన్న చిత్రాలతో పాటు ‘టైగర్‌ 3’, ‘లైగర్‌’, ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’లాంటి భారీ చిత్రాలుండటం సినీ వర్గాల్ని ఆందోళనకు గురి చేస్తుంది. 

టైగర్‌ 3 వాయిదా 

కొవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యం, దిల్లీలో ఆంక్షలు కఠినంగా ఉండటంతో ‘టైగర్‌ 3’ చిత్రీకరణను తాత్కాలికంగా ఆపేశారు. సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంటగా ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తోన్న చిత్రమిది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను దిల్లీలో ప్లాన్‌ చేసుకున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో షూటింగ్‌ ఆపేశారు. 

పాన్‌ ఇండియా ‘లైగర్‌’దీ అదే దారి 

విజయ్‌దేవరకొండ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా చిత్రీకరణకు కరోనా బ్రేక్‌ ఇచ్చింది. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, అనన్యా పాండే కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. ‘‘మరో వేవ్‌ తుపానులా వచ్చింది. షూటింగ్‌ ఆగిపోయింది. మళ్లీ ఇంట్లోనే’’అంటూ ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్వీట్‌ చేశారు విజయ్‌ దేవరకొండ. ఈ షెడ్యూల్‌ భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారట పూరి. ఈ సినిమాకు గతంలో కూడా కొవిడ్‌ సెగ తగిలింది. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ ఆగిన విషయం తెలిసిందే. 

రాఖీ.. రాణి ప్రేమకూ ఆటంకమే 

అలియా భట్‌, రణ్‌వీర్‌సింగ్‌ జంటగా నటిస్తున్న ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ షూటింగ్‌ వాయిదా పడింది. జనవరి 10 నుంచి ముంబయిలోని ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఓ పాటను చిత్రీకరించడానికి భారీ సెట్‌ను నిర్మించినట్లు తెలుస్తోంది. తన చిత్రబృందానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌ షెడ్యూల్‌ను వాయిదా వేశారట. యశ్‌రాజ్‌ సంస్థ నిర్మిస్తోన్న ‘పఠాన్‌’ చిత్రీకరణది ఇదే బాట. షారుక్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ తెరకెక్కిస్తున్నారు.  

* ఇవే కాదు.. త్వరలో మరిన్ని చిత్రాల షూటింగులు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కొన్ని నిర్మాణ సంస్థలు మాత్రం కఠినమైన కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణకు సిద్ధమవుతున్నాయట. రిస్క్‌ తక్కువ ఉన్న రాష్ట్రాల్లో చిత్రీకరణ కోసం ముందు నుంచీ కొందరు ఏర్పాట్లు చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్