హాలీవుడ్‌.. ఆలస్యమా?

బాలీవుడ్‌ స్టార్‌ జంట అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు ‘అమ్మానాన్నలం కాబోతున్నాం’ అంటూ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. సినిమా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 28 Jun 2022 01:28 IST

బాలీవుడ్‌ స్టార్‌ జంట అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు ‘అమ్మానాన్నలం కాబోతున్నాం’ అంటూ సోమవారం సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. సినిమా పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో అలియా హాలీవుడ్‌ ప్రాజెక్టు సంగతేంటనే చర్చ మొదలైంది. తను కీలక పాత్రలో తెరంగేట్రం చేస్తున్న చిత్రం ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’. దీనికోసం అలియా మే నెలలో బ్రిటన్‌ వెళ్లి కొన్ని యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంది. అది పూర్తవగానే ‘రాఖీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ కోసం ముంబయి తిరిగొచ్చింది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడు. ఈ షెడ్యూల్‌ పూర్తవగానే జులైలో మళ్లీ లండన్‌ వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలోనే అనుకోని శుభవార్త. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న హాలీవుడ్‌ చిత్రంలో అలియా ఇంకొన్ని పోరాట సన్నివేశాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే సన్నిహితవర్గాలు చెబుతున్న దాని ప్రకారం ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’లో కొంతభాగం షూటింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకొని అది కూడా పూర్తి చేస్తానని తను చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రం బహుశా కొంచెం ఆలస్యం అవుతుందే తప్ప ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నారు. ఇదికాకుండా ఫర్హాన్‌ అఖ్తర్‌ తెరకెక్కిస్తున్న ‘జీ లే జరా’ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కత్రినా కైఫ్‌, ప్రియాంకా చోప్రాలతో కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్‌ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన పాత్ర ప్రశ్నార్థకంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని