విజయశాంతి ఆ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాల్సింది!

కథానాయికగా అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న నటి విజయశాంతి. ఒకప్పుడు అగ్ర

Updated : 07 Jan 2020 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కథానాయికగా అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించి లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్న నటి విజయశాంతి. ఒకప్పుడు అగ్ర కథానాయకులందరితోనూ ఆడి పాడిన ఆమె, రాజకీయ రంగ ప్రవేశంతో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 13ఏళ్ల తర్వాత ఆమె కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మహేశ్‌బాబు కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, విజయశాంతి ఇంతకన్నా ముందే ఒక సినిమాలో నటించాల్సి ఉంది. పలు కారణాలతో బిజీగా ఉండటంతో ఆ పాత్ర చేయలేకపోయారు. అది కూడా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రమే కావడం గమనార్హం. 

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘నాతో ఒక సినిమా చేయాలని అనిల్‌ ఎప్పటి నుంచో నన్ను సంప్రదిస్తూ ఉన్నారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కన్నా ముందే ‘రాజా ది గ్రేట్‌’ కోసం నన్ను అడిగారు. కాకపోతే, ఆ సమయానికి నేను చాలా బిజీగా ఉన్నాను. నా వల్ల కాలేదు. చేయనని చెప్పాను. గతేడాది వచ్చి మళ్లీ నన్ను కలిసి మరో సినిమా చేయాలని అడిగారు. నేను కూడా కాస్త ఫ్రీగా ఉండటంతో వచ్చి కథ చెప్పమని అడిగా. అయితే, అప్పటికీ నటించాలన్న ఆలోచన మాత్రం నాకు లేదు. నాలుగైదు రోజుల తర్వాత వచ్చి కథ చెప్పారు. చాలా బాగా అనిపించింది. కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఉన్నాయి. ‘బాగుంది’ అని చెప్పిన తర్వాత సినిమా చేయకపోతే సరైన పద్ధతి కాదు. ఆ విధంగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మళ్లీ మేకప్‌ వేసుకోవాల్సి వచ్చింది. అయితే, విజయశాంతి చిత్రమంటే అంచనాలు భారీగా ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా ఒప్పుకొన్నా’’ అని అన్నారు.

రవితేజ అంధుడి పాత్రలో నటించిన ‘రాజా ది గ్రేట్‌’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అందులో ఆయన తల్లి పాత్రలో రాధికా నటించి మెప్పించారు. 

 

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని