ఆ మాట విని చిరంజీవి తెల్లబోయారు!

చిరంజీవి కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘కొండవీటి దొంగ’. విజయశాంతి, రాధ, శారద, మోహన్‌బాబు, రావు గోపాలరావు, అమ్రిష్‌ పూరీలు కీలక

Updated : 23 Mar 2020 18:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చిరంజీవి కథానాయకుడిగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘కొండవీటి దొంగ’. విజయశాంతి, రాధ, శారద, మోహన్‌బాబు, రావు గోపాలరావు, అమ్రిష్‌ పూరీలు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలైన ఇటీవల 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘కొండవీటి దొంగ’చిత్రానికి కథ అందించిన ప్రముఖ రచయితల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాకు సంబంధించిన ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. 

‘‘కొండవీటి దొంగ’ ఇటీవలే 30ఏళ్లు పూర్తి చేసుకుంది. చిరంజీవిగారు హీరోగా, శ్రీదేవి కథానాయికగా అనుకుని ఈ చిత్ర కథ రాసుకున్నాం. శారదగారు, శ్రీవిద్య, రాధ, విజయశాంతి ఎవరూ లేరు. నిర్మాత త్రివిక్రమ రావుగారికి వినిపిస్తే ఆయనకు చాలా బాగా నచ్చింది. చిరు కూడా ఓకే చేశారు. కథానాయికగా అనుకున్న శ్రీదేవికి కథ చెప్పడానికి వెళ్లాం. ‘కథ చాలా బాగుంది పరుచూరిగారు. అయితే, సినిమాకు ‘కొండవీటి రాణి.. కొండవీటి దొంగ’ అని టైటిల్‌ పెట్టాలి.. నేను హీరో వెనుక పడటం కాకుండా హీరోనే నా వెనకాల పడాలి’ అని రెండు షరతులు పెట్టారు. ఇదే విషయాన్ని త్రివిక్రమరావుగారికి చెబితే, ఆయన ఒప్పుకోలేదు. ‘చిరంజీవి పెద్ద స్టార్‌. ఆయన హీరోయిన్‌ వెనుక పడుతున్నాడంటే కథ పాడైపోతుంది’ అన్నారు. అప్పుడు కూర్చొని మళ్లీ కథ మార్చాం. తల్లి పాత్రలోకి శారదగారు, పోలీస్‌గా విజయశాంతి, రాధ, శ్రీవిద్య ఇలా అన్ని పాత్రలూ వచ్చాయి. ఐఏఎస్‌ అధికారి దొంగగా మారడం 80ల నాటి కాలంలో కొత్త సబ్జెక్ట్‌’’

‘‘ఖైదీ’ తలకోనలో తీస్తే, కలిసొచ్చిందని ఈ సినిమా షూటింగ్‌ కూడా అక్కడే తీస్తున్నాం. ఒక రోజు అల్లు రామలింగయ్యగారు షూటింగ్‌ వస్తూనే ‘పోయింది.. ‘స్టేట్‌రౌడీ’ పోయింది..’ అనడం మొదలెట్టారు. ‘మామయ్య ఇలా అంటున్నాడేంటి? అని చిరంజీవి గారు తెల్లబోయారు. ఐదు నిమిషాల గ్యాప్‌లో సారథి స్టూడియోస్‌ శశి భూషణ్‌ వచ్చారు. మొదటివారం ఎంత మంచి కలెక్షన్లు చేసిందో ఆయన రిపోర్ట్‌ చూపించారు. అంతే వెంటనే చిరంజీవిగారు.. అల్లు రామలింగయ్య వంక అలా చూడగానే ‘నాకేం తెలుసు.. ఎవరో చెప్పారు’ రామలింగయ్య అన్నారు. ఆ తర్వాత ‘కొండవీటి దొంగ’ విడుదలైంది. ‘స్టేట్‌ రౌడీ’ ఫ్లాప్‌ అంటూ ఎలా ప్రచారం చేశారో దీనికి కూడా అలాగే చేశారు. నేను అనుకోకుండా రాజమహేంద్రవరం వేరే షూటింగ్‌కు వెళ్తే, చిరంజీవిగారి అభిమానులు నన్ను మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని చిరంజీవిగారికి చెబితే ఆయన ‘నిజం చెప్పండి’ అని అడిగారు. ఎందుకంటే ఆరోజుల్లో అసత్య ప్రచారం అలా ఉండేది. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మీకు తెలుసు’’ అని పరుచూరి గోపాలకృష్ణ ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని