చిరు రియల్‌ స్టంట్‌కు 22ఏళ్లు!

‘బిగ్‌బాస్‌’, ‘రిక్షావోడు’ చిరు కెరీర్‌లో వరుస ఫ్లాప్‌లు, ఆ తర్వాత ‘హిట్లర్‌’, ‘మాస్టర్‌’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని

Updated : 09 Apr 2020 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘బిగ్‌బాస్‌’, ‘రిక్షావోడు’ చిరు కెరీర్‌లో వరుస ఫ్లాప్‌లు, ఆ తర్వాత ‘హిట్లర్‌’, ‘మాస్టర్‌’ చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ చిరంజీవి పాత్ర కాస్త గంభీరంగానే ఉంటుంది. కానీ, చిరంజీవి నుంచి అభిమానులు ఇంకా ఏదో ఆశిస్తున్నారు. చిరు కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. అదే సమయంలో ఆయన నుంచి అభిమానులు ఆశించే డ్యాన్స్‌లు ఫైట్‌లు కావాలి. అప్పుడే జయంత్‌ సి. పరాన్జీ వెంకటేశ్‌తో ‘ప్రేమించుకుందాం రా’ తీసి సూపర్‌హిట్‌ కొట్టారు. రెండో చిత్రంగా చిరును డైరెక్ట్‌ చేసే అవకాశం లభించింది. అంతే పరుచూరి బ్రదర్స్‌తో కూర్చొని కథను సిద్ధం చేశారు. అదే ‘బావగారూ.. బాగున్నారా!’. నాగబాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విడుదలైనేటికి (ఏప్రిల్‌ 9) 22ఏళ్లు పూర్తి చేసుకుంది.

కథేంటి: రాజు (చిరంజీవి) న్యూజిలాండ్‌లో ఓ రెస్టారెంట్ ఓనర్‌. ఏటా భారత్‌కు వచ్చి తన సోదరి పేరుతో నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి కొంత డబ్బు ఇచ్చి వెళ్తుంటాడు. స్వప్న(రంభ) చదువుకునేందుకు న్యూజిలాండ్‌ వచ్చి, ఓ చిన్న గొడవ విషయంలో రాజును అపార్థం చేసుకుని, ఆ తర్వాత నిజం తెలుసుకుంటుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఆ తర్వాత భారత్‌కు వచ్చిన రాజు ఓ సందర్భంలో గర్భిణి అయిన సంధ్య(రచన) ఆత్మహత్య చేసుకుంటుంటే, చూసి ఆమెను కాపాడతాడు. సంధ్యకు సహాయం చేసేందుకు ఆమె భర్తగా వాళ్లింటికి వెళ్తాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి? సంధ్య ఎవరు? తాను ప్రేమించిన స్వప్నకు, సంధ్యకు సంబంధం ఏంటి? చివరకు సంధ్యను ప్రేమించిన వ్యక్తికి రాజు దగ్గర చేశాడా? అన్నది కథ!

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌!

జయంత్‌ ఈ సినిమాను పూర్తి కామెడీ రొమాంటిక్‌ డ్రామాగా తీర్చిదిద్దారు. న్యూజిలాండ్‌లో చిరు-రంభ-బ్రహ్మానందల మధ్య జరిగే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ తర్వాత భారత్‌కు వచ్చిన తర్వాత రంభ, చిరంజీవిల మధ్య సన్నివేశాలు కూడా కితకితలు పెడతాయి. ఇక కోట శ్రీనివాసరావు, ఆయన కొడుకు శ్రీహరి చేసే హంగామాతో సినిమా సరదాగా సాగిపోతుంది. చివరిలో గుర్రపు పందాలు మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మణిశర్మ మ్యూజిక్అదుర్స్

ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. అన్నీ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘ఆంటీ కూతురా.. అమ్మో అప్సర’ మాస్‌ను ఓ ఊపు ఊపేసింది.

చిరంజీవి రియల్‌ స్టంట్‌

చిరు సినిమా అంటే ఆయన డ్యాన్స్‌లతో పాటు, ఫైట్‌లు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ సినిమా కోసం ఆయన బంగీ జంప్‌ చేసి అభిమానులతో ‘వావ్‌’ అనిపించారు. చిరంజీవి పరిచయ సన్నివేశంలోనూ, సినిమా పూర్తయిన తర్వాతా థియేటర్‌లో ఈ సీన్‌ చూసి అభిమానులు ఫిదా అయిపోయేవారు. ఇక క్లైమాక్స్‌లో గుర్రపు పందాల సీన్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదండోయ్‌ ఈ సినిమాలో చిరు స్టైల్‌ కూడా అప్పట్లో ట్రెండ్‌ అయింది. ముఖ్యంగా గళ్ల ప్యాంట్లు ట్రెండీగా నిలిచాయి. బాలీవుడ్‌లో ఈ సినిమాను గోవిందా హీరోగా ‘కున్వారా’ పేరుతో తీశారు. బంగ్లాదేశ్‌లో ‘జమై షషూర్‌’పేరుతో తెరకెక్కించారు. 

 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని