‘ప్రేమించుకుందాం రా’లో ఐశ్వర్యారాయ్‌ నటించాల్సింది!

వెంకటేశ్‌ కథానాయకుడిగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బాక్‌బస్టర్‌ చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. అంజలా ఝవేరి కథానాయిక. 1997లో

Updated : 25 Aug 2020 10:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ప్రేమించుకుందాం రా’. అంజలా ఝవేరి కథానాయిక. 1997లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. వెంకటేశ్‌-అంజలా ఝవేరిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు, ప్రతినాయకుడిగా జయప్రకాష్‌రెడ్డి నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 

కాగా, ఈ సినిమాలో తొలుత కథానాయికగా ఐశ్వర్యారాయ్‌ను అనుకున్నారట దర్శకుడు జయంత్‌. అంతకుముందే ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా ఐశ్వర్యతో జయంత్‌కు పరిచయం ఉంది. దీంతో ఆమెను తీసుకోవాలని భావించారట. ఇదే విషయాన్ని చిత్ర బృందానికి చెబితే, వాళ్లు నో చెప్పారట. ఎందుకంటే అప్పటికే ఐశ్వర్య నటించిన రెండు మూడు సినిమాలు అపజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో ఫ్లాప్‌ హీరోయిన్‌ అన్న ముద్ర పడింది. దాన్ని సెంటిమెంట్‌గా తీసుకుని ఐశ్వర్యను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఒప్పుకోలేదు. అయితే, ఆ తర్వాత ఐశ్వర్యరాయ్‌ బాలీవుడ్‌లో వరుస విజయాలను సొంతం చేసుకుని, టాప్‌ హీరోయిన్‌ అయిపోయారు. మళ్లీ తెలుగులో నటించలేదు. అయితే, నాగార్జున-జయంత్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘రావోయి చందమామ’ చిత్రంలో మాత్రం ఐశ్వర్య ప్రత్యేక గీతంలో నటించారు. 

ప్రీతిజింతాను అడగటానికి వెళ్తే..!

‘రావోయి చందమామ’లో ప్రత్యేక గీతాన్ని ఎవరైనా బాలీవుడ్‌ హీరోయిన్‌తో చేయిస్తే బాగుంటుందని జయంత్‌ అనుకున్నారట. దీంతో ముంబయి వెళ్లిన ఆయన అనుకోకుండా ఐశ్వర్యారాయ్‌ను కలిశారు. విషయం ఐశ్వర్యకు తెలియడంతో ‘మీ సినిమాలో నటించమని అందర్నీ అడుగుతారు. నన్నెప్పుడూ ఎందుకు అడగలేదు’ అని ఐశ్వర్య ప్రశ్నించగా, విషయం ఆమెకు చెప్పడంతో ప్రత్యేక గీతంలో నటించేందుకు ఒప్పుకొన్నారు. అలా ఆమె తెలుగులో నటించిన ఏకైక చిత్రంగా ‘రావోయి చందమామ’ నిలిచింది. ఆ తర్వాత ఐశ్వర్య నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పొన్నియన్‌ సెల్వన్‌’లో నటిస్తున్నారు. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని