బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఘటోత్కచుడు’కి 25 ఏళ్లు

ఎస్వీ కృష్ణారెడ్డి-అలీ. ఈ పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చే చిత్రం ‘యమలీల’. అప్పటి వరకూ కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అలీ ఈ సినిమాతో

Published : 27 Apr 2020 09:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్వీ కృష్ణారెడ్డి-అలీ... ఈ పేర్లు వినగానే తెలుగు ప్రేక్షకుడికి గుర్తొచ్చే చిత్రం ‘యమలీల’. అప్పటివరకూ కమెడియన్‌గా చిన్న చిన్న పాత్రలు చేస్తున్న అలీ ఈ సినిమాతో కథానాయకుడిగా మారిపోయారు. రైలులో వెళ్తున్నప్పుడు ఎస్వీ కృష్ణారెడ్డికి వచ్చిన చిన్న ఆలోచనతో మొదలైన ‘యమలీల’ కథ సినిమాగా మారి, వెండితెరపై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. అలాంటి సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. అలా వచ్చిన మరో బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఘటోత్కచుడు’. 1995 ఏప్రిల్‌ 27న విడుదలైన ఈ చిత్రం నేటికి (ఏప్రిల్‌ 27, 2020) 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

సినిమా కథేంటి?

కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడి అస్త్రానికి తీవ్రంగా గాయపడిన ఘటోత్కచుడు (సత్యనారాయణ) అడవిలో ఎక్కడో దూరంగా పడిపోతాడు. దాహంతో అలమటిస్తూ మృత్యువు చేరవవుతున్న ఘటోత్కచుడికి అడవిలో ఉండే ఓ బాలిక (బేబీ నిఖిత) దాహం తీరుస్తుంది. ‘ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనైనా నీకు ఆపద వస్తే నన్ను తలచుకో’ అని ఘటోత్కచుడు వరం ఇచ్చి చనిపోతాడు. వందల సంవత్సరాల తర్వాత ఆ పాప ధనవంతులైన శరత్‌బాబు, సుధ కుమార్తెగా పుడుతుంది. ఈ ముగ్గురినీ చంపి ఆస్తి మొత్తం కాజేయాలని చూస్తుంటారు చలపతిరావు, శివాజీరాజా. ఆ ఇంట్లో పాప బాగోగులను రంగా (అలీ) తండ్రి, మూగవాడైన రాళ్లపల్లి చూస్తుంటాడు. అతడి వల్ల పాపకు ఆపద ఉందని చెప్పి, బయటకు పంపేస్తారు.

కారులో బాంబు పెట్టి శరత్‌బాబు కుటుంబానికి చంపడానికి యత్నించగా, ఆ ప్రమాదం నుంచి పాప బయటపడుతుంది. అదే సమయంలో అక్కడే ఉన్న రాళ్లపల్లి ఆ పాపను తీసుకుని పారిపోతాడు. దీంతో రౌడీలు అతడిని హత్య చేస్తారు. అప్పుడు అక్కడకు వచ్చిన రంగా.. చిట్టిని తీసుకుని అడవిలోకి పారిపోతాడు. సరిగ్గా ఆ సమయంలోనే రంగా ప్రమాదంలో ఇరుక్కుంటాడు. రౌడీల నుంచి తప్పించుకునే క్రమంలో కొండపై నుంచి దూకిన పాప సాయం కోసం ఘటోత్కచుడిని ప్రార్థిస్తుంది. ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకునేందుకు ఘటోత్కచుడు దిగి వచ్చి ఏం చేశాడు? పాపను ఎలా కాపాడాడు? భూలోకానికి వచ్చిన తర్వాత అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? మధ్యలో సుబ్బరావ్ ‌(రోబో) ఏం చేశాడు? చిట్టిని బలి ఇవ్వాలనుకుంటున్న మాంత్రికుడి (కోట శ్రీనివాసరావు) ప్రయత్నాన్ని ఘటోత్కచుడు ఎలా అడ్డుకున్నాడు? అన్నది కథ!

మహాభారత పాత్రల్లో ఆ హీరోలు

‘ఘటోత్కచుడు’లో హైలైట్‌గా నిలిచాయి ప్రారంభంలో వచ్చే కురుక్షేత్ర సంగ్రామ సన్నివేశాలు. పౌరాణిక పాత్రల్లో అప్పటి హీరోలు తళుక్కున మెరిసి సినిమాకు పెద్ద మల్టీస్టారర్ లుక్ తీసుకొచ్చారు. కర్ణుడిగా రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్‌ నటించడం ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఆ సన్నివేశాలన్నీ అలరిస్తాయి.

సినిమా మొత్తం ఘటోత్కచుడు చుట్టూనే..

సినిమా ప్రారంభం నుంచి చివరివరకూ దాదాపు ఎక్కువ సన్నివేశాల్లో కనిపించే పాత్ర ఘటోత్కచుడు, పాప. సినిమా మొత్తం ఈ రెండు పాత్రలే ఎక్కువ కనిపిస్తాయి. ఘటోత్కచుడు పాత్రలో సత్యనారాయణ అదరగొట్టారు. ఆ పాత్రకు ప్రాణం పోశారు. అప్పటికే ‘యమలీల’లో యముడిగా కనిపించిన ఆయన ఈ పాత్రలోనూ ఒదిగిపోయారు. తన మాయలతో రౌడీలను ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ప్రేక్షకుడికి గిలిగింతలు పెడతాయి. ముఖ్యంగా అప్పట్లో చిన్నారులను ఆ సన్నివేశాలన్నీ భలే అలరించాయి. బేబీ నిఖిత చక్కగా నటించింది. తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది. ఇక ఇందులో కీలకంగా కనిపించే మరో పాత్రలు రంగ, రోజా. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, పాటలు అలరించాయి.

సుబ్బరావ్‌/రోబో

సినిమాలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో క్యారెక్టర్‌ సుబ్బరావ్‌ అలియాస్‌ మర మనిషి. సైంటిస్ట్‌ అయిన టినూ ఆనంద్‌ దీనిని తయారు చేస్తాడు. ఈ రోబో చిన్నారులను భలే అలరించింది. ముఖ్యంగా రోజాను ప్రేమిస్తున్నానంటూ వెంట పడటం. పదే పదే ‘ఐ లవ్యూ రోజా’ అని చెప్పడం సరదాగా అనిపిస్తుంది. (దాదాపు 15ఏళ్ల తర్వాత ఇదే కాన్సెప్ట్‌తో శంకర్‌-రజనీల కాంబినేషన్‌లో ‘రోబో’ రావడం విశేషం. ఇందులోనూ సనను చిట్టి ప్రేమిస్తాడు) రోబో ఫైట్స్‌ చేయడం, ఘటోత్కచుడితో పోటీ పడటం, వారిద్దరి మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు అలరిస్తాయి. రోబోతో ఎక్కువ సన్నివేశాలున్న తొలి తెలుగు చిత్ర బహుశా ఇదే కావొచ్చు.

కామెడీ అదుర్స్‌!

‘యమలీల’లో కామెడీ ఉన్నా, అమ్మ సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువ. కానీ, ‘ఘటోత్కచుడు’ ఫుల్‌లెంగ్త్‌ కామెడీ సినిమా. ముఖ్యంగా దివాకర్‌బాబు రాసిన డైలాగ్‌లు కడుపుబ్బా నవ్విస్తాయి. రోడ్లపై దొరికే ప్రతి వస్తువునూ జాగ్రత్త చేసుకుని దాని వల్ల సమస్యల్లో ఇరుక్కునే వ్యక్తిగా బ్రహ్మానందం, ‘రంగు పడుద్ది’ అంటూ కామెడీ విలన్‌గా ఏవీఎస్‌, మరోసారి తోటరాముడిగా తనికెళ్ల భరణి, మాంత్రికుడు కోట శ్రీనివాసరావు శిష్యులుగా మల్లికార్జునరావు, చిట్టిబాబు కనిపించి తెగ నవ్వించారు. అప్పట్లో ఎవరి నోట విన్నా ‘రంగు పడుద్ది’ అనే మాట తరచూ వినపడేది. ఆ స్థాయిలో అది జనాల్లోకి వెళ్లింది. ఒకరి తర్వాత ఒకరిని ‘కబడ్డీ.. కబడ్డీ’ ఫుట్‌బాల్‌ తరిమే సన్నివేశాలు కూడా కితకితలు పెడతాయి. ఫైట్‌ మధ్యలో టీపాయ్‌ పట్టుకున్న బొమ్మ మనిషిగామారి కొట్టడమూ సరదాగా ఉంటుంది. దాని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అప్పట్లో తెగ సందడి చేసింది. 

అన్నీ పాటలూ సూపర్‌హిట్

స్వీ కృష్ణా రెడ్డి తన చిత్రాలకు ఆయనే సంగీతం సమకూర్చుకునేవారు. అలా ‘ఘటోత్కచుడు’కీ ఆయనే స్వరాలు అందించారు. ఇందులోని పాటలన్నీ శ్రోతలను విశేషంగా అలరించాయి. ‘జ జ జ్జ రోజా...,’ ‘అందాల అపరంజి బొమ్మ..’, ‘ప్రియమధురం..’, ‘భమ్ భమ్ భమ్.., ‘భామరో నన్నే ప్యార్ కారో...’, ‘డింగు డింగు...’ పాటలన్నీ ఎవర్‌ గ్రీన్ హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. అప్పట్లో ఎస్వీ కృష్ణారెడ్డి ఒక సెంటిమెంట్‌ ఫాలో అయ్యేవారు. ఒక హీరోతోగానీ, కమెడియన్‌తో గానీ స్పెషల్‌ సాంగ్‌ పెట్టేవారు. అలా ‘ప్రియ మధురం...’ పాటలో అగ్ర కథానాయకుడు నాగార్జున తళుక్కున మెరిశారు. అది ఆయన అభిమానులను విశేషంగా అలరించింది. 

సత్యనారాయణ కోసమే ‘ఘటోత్కచుడు’

సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ ఎస్వీ కృష్ణారెడ్డి. కేవలం సత్యనారాయణ కోసం ఈ సినిమాను చేసినట్లు ఒకానొక సందర్భంలో ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఎందుకంటే యముడు, ఘటోత్కచుడు వంటి పాత్రలు పోషించాలంటే ఎస్వీ రంగారావు లాంటి నిండైన విగ్రహం, డైలాగులు పలకడంలో సరైన ఉచ్ఛారణ కలిగిన నటుడు కావాలి. 90ల కాలం నాటికి ఆ స్థాయిన నటన కనబరిచే అతి తక్కువమంది నటుల్లో సత్యనారాయణ ఒకరు. అందుకే ఆయనను ఎంచుకున్నట్లు తెలిపారు. 

థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంటుంది: నిర్మాత అచ్చిరెడ్డి

‘ఘటోత్కచుడు’ విడుదలై సిల్వర్‌ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఘటోత్కచుడుగా సత్యనారాయణ గారి అద్భుత నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది.  ‘యమలీల’ తర్వాత అలీకి హీరోగా మంచి క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. కథానాయికగా రోజా అలరించారు. రోబో చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చిన్న పిల్లలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇన్నేళ్లలో ఎప్పుడు టీవీలో ప్రసారమైనా ఎవరో ఒకరు ఫోన్‌చేసి సినిమా గురించి మాట్లాడుతుంటే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇలాంటి మంచి సినిమా మా మనీషా బ్యానర్‌లో వచ్చినందుకు నాకు, కృష్ణారెడ్డి గారికి ఎంతో సంతృప్తిగా ఉంది. ఈ సందర్భంగా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts