Super star krishna: కృష్ణ-విజయ నిర్మలకు తప్పిన ప్రాణగండం

కృష్ణ, విజయనిర్మల కొత్త జంట కావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక బోట్‌హౌజ్‌ తయారు చేయించి దాన్ని గోదావరిలో తేలియాడేలా ఏర్పాటు చేశారు.

Published : 17 Nov 2022 20:01 IST

విజయనిర్మలతో పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘అమ్మ కోసం’. ఆ సినిమా షూటింగ్‌ రాజమండ్రి దగ్గర్లోని పాపికొండల్లో జరిగింది. ఆర్టిస్టులందరికీ అక్కడే వసతి ఏర్పాటు చేశారు. కృష్ణ, విజయనిర్మల కొత్త జంట కావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక బోట్‌హౌజ్‌ తయారు చేయించి దాన్ని గోదావరిలో తేలియాడేలా ఏర్పాటు చేశారు. తాళ్లతో ఒడ్డున ఉన్న చెట్లకు కట్టేశారు. ఒకరోజు పెద్ద తుపాను, వర్షం వచ్చి ఆ బోటులోకి నీళ్లు వచ్చాయి. కృష్ణ, విజయనిర్మల ఇద్దరికీ ఈత రాదు. ఒడ్డున ఉన్నవాళ్లు హాహాకారాలు చేయసాగారు. ప్రాణాలు వదిలేసుకున్న ఆ సమయంలో స్టంట్‌మాస్టర్‌ రాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. బోటుకి తాళ్లు కట్టి వాటిని నాలుగు గుర్రాలకి బిగించి ఒడ్డుకు లాక్కొచ్చారు.

మీసాల కృష్ణుడి మహిమతో..

కృష్ణ - విజయనిర్మలను ‘ఆంధ్రా ప్రేమ్‌ నజీర్‌ - షీలా’ జోడీగా పిలిచేవారు. అయితే వీరి పెళ్లి వెనుక ‘మీసాల కృష్ణుడు’ మహిమ ఉందని కృష్ణ ఓ సందర్భంలో పంచుకున్నారు. ‘‘నేను.. విజయ నిర్మల కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. ఆ సినిమా చిత్రీకరణ మొత్తం రాజమండ్రి దగ్గర్లోని ‘పులిదిండి’లో జరిగింది. ఆ ఊర్లో మీసాల కృష్ణుడు గుడి ఉంది. అందులో ఓ సూపర్‌ హిట్‌ పాట చిత్రీకరణ జరిగింది. ఆరుద్ర రాసిన ‘అమ్మ కడుపు చల్లగా’ అనే పాటలో పెళ్లి వేడుక తతంగం మొత్తాన్నీ నాపైనా.. విజయనిర్మల మీద చాలా శాస్త్రోక్తంగా చిత్రీకరించారు బాపు. ఆ పాట చిత్రీకరణ సమయంలో రాజబాబు ‘ఈ గుడి చాలా మహిమాన్వితమైనది. ఇందులో జరిగిన మీ సినిమా పెళ్లి.. తొందర్లోనే నిజం పెళ్లి అవుతుంది’ అన్నారు. అందరం సరదాగా నవ్వుకున్నాం. కానీ, సెంటిమెంట్స్‌ను నమ్మని నేను కూడా ఆశ్చర్యపోయేలా మా అనుబంధం నిజంగానే పెళ్లికి దారి తీసింది. 1969 మార్చి 24న తిరుపతిలో మా పెళ్లి జరిగింది’’ అంటూ ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు కృష్ణ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని