ఆ అవమానం మరిచిపోలేని అక్కినేని..

నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు అక్కినేని

Published : 06 Jul 2024 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరు అక్కినేని నాగేశ్వరరావు (ANR). ఏదైనా నేర్చుకోవాలనుకుంటే అది వచ్చేవరకూ నిద్రపోయేవారు కాదు. సాంఘిక చిత్రాలకు పనికిరాడన్న వారే ఆ తర్వాత ఆయనతో ఆ జానర్‌లో సినిమాలు తీయడానికి క్యూ కట్టారు. నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆయనకు ఎదురైన అవమానాలనే సోపానాలుగా చేసుకుని విజయం వైపు పయనించారు. తనని అవమానించిన వారికి కూడా స్నేహ హస్తం చాచి తన మంచితనాన్ని చాటుకున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఘటన.

పి.పుల్లయ్య దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ప్రాణమిత్రులు’(1967). ఈ సినిమాకు నిర్మాత వి.వెంకటేశ్వర్లు అయినా, సూర్యనారాయణ అనే ఆయన ఆ బాధ్యతలను చూసుకుంటూ ఉండేవారు. ఒకరోజు షూటింగ్ ‌సమయంలో ‘నాగేశ్వరరావు సిద్ధమైతే సెట్టుకి రమ్మని చెప్పండి’ అని దర్శకుడు పి.పుల్లయ్య.. సూర్యనారాయణకు చెప్పారు. దాంతో ఆయన అక్కినేని మేకప్‌రూమ్‌కు వెళ్లారు. అక్కడ మేకప్‌ వేసుకుంటున్న నాగేశ్వరరావును చూసి, గుమ్మం దగ్గరే వినయంగా నిలబడ్డారు సూర్యనారాయణ. ‘ఏం సూర్యనారాయణగారూ... ఏమిటి?’’ అన్నారు అక్కినేని. ‘అయ్యా! తమరు సిద్ధమైతే సెట్టుకి వచ్చేయమని డైరక్టర్‌ గారు చెప్పారు.’ అని సూర్యనారాయణ అంటే.. ‘అయిపోయింది వచ్చేస్తాను. ఒకసారి ఇలా రండి సూర్యనారాయణగారు.’ అని ఆయనను లోపలికి పిలిచారు అక్కినేని.

‘‘ముగ్గురు మరాఠీలు’ (1946) సినిమాకి మీరు మేనేజర్‌గా పనిచేశారు కదూ..! నాకు బాగా జ్ఞాపకం ఉంది. మేకప్‌రూమ్‌లో కన్నాంబగారు, సుబ్బారావుగారు ఇంకా ఎవరెవరో భోజనాలు చేస్తున్నారు. నేనూ భోజనం కోసం వెళ్తే, గుమ్మం దగ్గర ఉన్న మీరు నన్ను కసిరికొట్టారు. ‘ఎక్కడికయ్యా! ఇక్కడ పెద్దవాళ్లంతా భోజనం చేస్తున్నారు. నువ్వు క్యాంటీన్‌కి వెళ్లు ఇక్కడికెందుకొచ్చావు?’ అని అన్నారు. నేను బాగా చిన్నబుచ్చుకుని క్యాంటీన్‌కి వెళ్లాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో గానీ, నాకు మాత్రం బాగా జ్ఞాపకం ఉంది.’’ అని అన్నారు అక్కినేని. సూర్యనారాయణ వణికిపోతూ... ‘అయ్యా.. ఏదో పొరపాటు... జరిగింది.’ అని అంటుంటే.. ‘అది నేను మనసులో పెట్టుకుని ఇవాళ మిమ్మల్ని నానా తిట్లూ తిడతానని అనుకోకండి. నిజమే... మీ డ్యూటీ మీరు చేశారు. అప్పుడు నేనెవడిని? నేనేం స్టార్‌ని కాదు కదా. మామూలు నటుడిని. నన్ను ఆనాడు మీరు అలా అనడం భావ్యమే. అది సహజం. కన్నాంబగారూ వాళ్లూ తారలు. వాళ్లకిచ్చే గౌరవమర్యాదలు వేరుగా ఉంటాయి. ఆ దశలో ఉన్న నాకు అంతటి గౌరవం ఎలా ఇస్తార్లెండి.. కానీ.. అవమానంగా భావించి, బాధపడ్డాను గనక, ఆ సంఘటనను మరిచిపోలేక మీకు చెప్పుకొన్నా. అంతేకానీ, ఇది చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’’ అని అంటూ సెట్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు అక్కినేని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని