రాజశేఖర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణలో రసాభాస నెలకొంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్ని గొడవలు ఉన్నా

Updated : 02 Jan 2020 16:44 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) డైరీ ఆవిష్కరణలో రసాభాస చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఎన్ని గొడవలు ఉన్నా వాటిని మర్చిపోయి మనందరం కలిసి ‘మా’ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతుండగా.. హీరో రాజశేఖర్‌ వేదిక పైకి వచ్చి ఆయన చేతిలో నుంచి మైక్‌ లాక్కున్నారు. అంతేకాకుండా సభలో కూర్చున్న కృష్ణంరాజు, మోహన్‌బాబు, చిరంజీవి కాళ్లకు నమస్కారం చేశారు. ‘మా’లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ‘మార్చిలో ‘మా’ కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకూ ఒక్క సినిమా కూడా చేయలేదు. మా ఇంట్లో కూడా బాగా తిట్టారు. ‘మా’ కోసం ఎందుకు అంతలా పనిచేస్తున్నావ్‌ అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. కానీ, ఇక్కడ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుంది. ‘మా’లో గొడవలున్నాయి. రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారు’ అని చెప్పారు.

దీంతో అసంతృప్తికి గురైన చిరంజీవి.. ‘నేను చెప్పిన మాటకు ఎవరూ విలువ ఇవ్వలేదు. మా మాటలకు గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఇక్కడ ఎందుకు ఉండాలి. ఎందుకు సభను రసాభాస చేయడం. రాజశేఖర్‌ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎంతో సజావుగా సాగుతున్న సభలో ఒక గౌరవం లేకుండా ఇలా మైక్‌ లాక్కుని ఎలా పడితే అలా మాట్లాడడం ఏం బాగోలేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే.. మీరిచ్చే పెద్దరికానికి అర్థం ఉండదు. దయచేసి దీనిని వదిలేయండి. ఎవరూ కోపావేశాలకు వెళ్లొద్దు. ఇలాంటప్పుడు ఇష్టం లేకపోతే రాకూడదు. ఇలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోండి’ అని అన్నారు.

ఇవీ చదవండి..!

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని