టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. 2020 వచ్చేసింది!

కొత్త ఆశలతో.. సరికొత్తగా 2020 ప్రారంభమైంది. జనవరి 9వ తేదీన ‘దర్బార్‌’ విడుదలతో సంక్రాంతి సందడి మొదలు కానుంది. అయితే, 2020కి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఈ ఏడాది అలరించేందుకు

Published : 03 Jan 2020 15:10 IST

కొత్త ఆశలతో.. సరికొత్తగా 2020 ప్రారంభమైంది. జనవరి 9వ తేదీన ‘దర్బార్‌’ విడుదలతో టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలు కానుంది. అయితే, 2020కి ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఈ ఏడాది అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. కొన్ని సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, మరికొన్ని ఈ ఏడాదిలో వరుసగా విడుదలకానున్నాయి. మరి 2020లో అలరించేందుకు సిద్ధమైన కొన్ని క్రేజీ కాంబినేషన్లు, చిత్రాలు ఏంటో చూసేద్దామా!

తొలి చిత్రం రజనీదే!

కొత్త సంవత్సరంలో ప్రేక్షకులను పలకరించే అగ్ర కథానాయకుల్లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముందున్నారు. మురుగదాస్‌ ఫ్రేమ్‌లో రజనీకాంత్‌ను చూడాలని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశ నెరవేరనుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘దర్బార్‌’. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జనవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రజనీ స్టైల్‌, మురుగదాస్‌ టేకింగ్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. దీంతో అటు అభిమానులు, ఇటు సినీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. పైగా చాలా సంవత్సరాల తర్వాత తలైవా పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనుండటం విశేషం. 

అప్పుడు అమ్మా- కొడుకులు.. మరి ఇప్పుడు?

ళ్లు మూసి తెరిచేలోపు భూ ప్రపంచంలో చాలా విషయాలు జరిగిపోతాయి. ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నది. ఒకప్పుడు తల్లీ- కొడుకులుగా నటించి మెప్పించారు విజయశాంతి-మహేశ్‌బాబు. అప్పట్లోనే క్రేజీ కాంబినేషన్‌గా నిలిచిన వీరు మళ్లీ కలసి నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌ ఇందులో మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనుండగా, విజయశాంతి ప్రొఫెసర్‌ భారతి పాత్రలో నటిస్తున్నారు. మరి వీరి పాత్రల మధ్య రిలేషన్‌ ఏంటో తెలియాలంటే సినిమా వచ్చేవరకూ చూడాల్సిందే. 

ముచ్చటగా మూడోసారి...

న స్టైల్‌తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసే యువ కథానాయకుడు అల్లు అర్జున్‌. ఇక త్రివిక్రమ్‌ కలానికి ఉన్న పదునేంటో యావత్‌ చిత్ర పరిశ్రమకి తెలుసు. వీరిద్దరూ కలిస్తే, ఎలా ఉంటుందో ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ చిత్రాల్లో ప్రేక్షకులు చూశారు. ఇప్పుడు ఈ క్రేజీ జోడీ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో బన్ని నటిస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా, జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని పాటలు నెటిజన్లను విశేషంగా అలరిస్తున్నాయి. మరి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపి వీరు ప్రేక్షకులను ఎలా అలరిస్తారో చూడాలి. 

‘డిస్కోరాజా’ ఏం చేస్తాడో..!

విభిన్న కథాంశాలతో సినిమాలు తీసే దర్శకుడు వి.ఐ.ఆనంద్‌. ఇప్పటివరకూ చిన్న హీరోలతో ప్రయోగాలు చేసిన ఆయన రవితేజను ‘డిస్కోరాజా’గా చూపించబోతున్నారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తుంటే, రవితేజ ఒక ప్రత్యేకమైన పాత్రలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఆసక్తికర కాంబినేషన్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 24 వరకూ వేచి చూడాల్సిందే. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నారు.

వైలెన్స్‌ ఇస్తానంటున్న నాని

ప్పటివరకూ నానిని పక్కంటి కుర్రాడి పాత్రలో చూసిన ప్రేక్షకులకు తనలోని వైలెన్స్‌ ఏంటో చూపిస్తానని అంటున్నారు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘వి’. సుధీర్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. నివేదా థామస్‌, అదితిరావ్‌ హైదరీ కథానాయికలు. యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీగా మోహనకృష్ణ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఉగాది కానుకగా మార్చి 25న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాని-ఇంద్రగంటి కాంబినేషన్‌లో గతంలో ‘అష్టాచమ్మా’, ‘జెంటిల్‌మెన్‌’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

రామ్‌ ‘రెడ్‌’ 

ప్పటివరకూ రామ్‌ లవర్‌ బాయ్‌ ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మాస్‌ ప్రేక్షకులకు చేరువయ్యారు. కొత్త ఏడాదిలోనూ ఆయన మాస్‌ బాట పట్టినట్లు తెలుస్తోంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రెడ్‌’. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు రామ్‌ లుక్‌ చూస్తే అర్థమవుతోంది. తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కు రీమేక్‌గా ఇది తెరకెక్కబోతోంది. 

అతి పెద్ద మల్టీస్టారర్‌ కోసం వెయిటింగ్‌

దశాబ్దంలోనే అతి పెద్ద మల్టీస్టారర్‌గా టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా దర్శక ధీరుడు ఎస్ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌గా కనిపించనుండగా, రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా అలరించనున్నారు. ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జులై 30, 2020న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

రాఖీ భాయ్‌ ఏం చేస్తాడో..!

న్నడ చిత్రంగా విడుదలై యావత్‌ భారతదేశ దృష్టినీ ఆకర్షించింది ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌-1’ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చాప్టర్‌ 2’ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ‘కేజీఎఫ్‌2’లో సమాధానం లభించనుంది. ఈ వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆసక్తి రేపుతున్న పవన్‌ ‘పింక్‌’

‘అజ్ఞాతవాసి’ తర్వాత అగ్ర కథానాయకుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలతో బిజీ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరే సినిమాలోనూ ఆయన కనిపించలేదు. ‘సైరా’లో మాత్రం తన గొంతును వినిపించారు. ఇప్పుడు మరోసారి పవన్‌ మేకప్‌ వేసుకుంటారని అంటున్నారు. హిందీ, తమిళ భాషల్లో హిట్టయిన ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్ నటిస్తారని నిర్మాత బోనీ కపూర్‌ ఇప్పటికే ప్రకటించారు. అయితే, పవన్‌ నుంచి మాత్రం ఇంకా స్పష్టమైన సమాధానం వెలువడలేదు. ఆయన పచ్చజెండా ఊపితే ఈ ఏడాదే పవన్‌ కల్యాణ్‌ను ప్రేక్షకులు వెండితెరపై చూసే అవకాశం ఉంది.

అసురన్‌గా వెంకటేష్‌

మిళంలో ఘన విజయం సాధించిన ధనుష్‌ ‘అసురన్‌’ చిత్రాన్ని తెలుగులో సురేష్‌ ప్రొడక్షన్స్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీకాంత్‌ అడ్డాల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో ఎలా తీస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

చిరు-కొరటాల ఈసారి ఏం సందేశం ఇవ్వబోతున్నారు

కొరటాల శివ సినిమా అంటే కమర్షియల్‌ హంగులు ఉంటూనే అంతర్లీనంగా సందేశం ఉంటుంది. ఇక చిరంజీవికి ఉన్న మాస్‌ ఇమేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కాంబినేషన్‌లో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవలే ఓ పాటతో షూటింగ్‌ కూడా మొదలు పెట్టేశారు. త్రిష కథానాయిక. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో దీనిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. దేవాలయాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం. 

‘సింహా’, ‘లెజెండ్‌’.. ఇప్పుడేంటి?

బాలకృష్ణ కెరీర్‌లో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్న చిత్రాల్లో ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు తప్పకుండా ఉంటాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు ఘన విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. బాలయ్యను బోయపాటి ఎప్పుడూ కొత్తగా చూపిస్తూ వస్తున్నారు. ఈసారి ఏం చేస్తారా? బాలయ్యను ఎలా చూపిస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. 

ఇవి కేవలం కొన్ని చిత్రాలు మాత్రమే. ఈ ఏడాది మరి కొన్ని క్రేజీ కాంబినేషన్లు కుదిరే అవశాలు ఉన్నాయి. వాటన్నంటికీ కాలమే సమాధానం చెబుతుంది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని