‘కల్యాణ్‌రామ్‌ పేరును నిజంగానే మర్చిపోయాను’

అనిల్‌ రావిపూడి.. కల్యాణ్‌రామ్‌ నటించిన ‘పటాస్‌’ చిత్రంతో దర్శకుడిగా మారి వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించారు. తాజాగా ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా...

Published : 06 Jan 2020 11:21 IST

హైదరాబాద్‌: కల్యాణ్‌రామ్‌ నటించిన ‘పటాస్‌’ చిత్రంతో దర్శకుడిగా మారి వెండితెరపై తనదైన శైలిలో నవ్వులు పూయించారు అనిల్‌ రావిపూడి. తాజాగా ఆయన సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కథానాయకుడిగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో అనిల్‌ రావిపూడి తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. కానీ, అక్కడ తన తొలి హీరో కల్యాణ్‌రామ్‌ పేరును చెప్పడం మర్చిపోయారు.

సోమవారం అనిల్‌రావిపూడి ట్విటర్‌ వేదికగా దీనిపై పోస్ట్‌ పెట్టారు. తన మొదటి హీరో కల్యాణ్‌ రామ్‌ పేరు చెప్పడం మర్చిపోయానని వివరణ ఇచ్చారు. ‘వృత్తిపరంగా, వ్యక్తిగతంగా నిన్న నాకు చాలా ఎమోషనల్‌ డే. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీరిలీజ్‌ వేడుకతో చాలా సంతోషానికి లోనయ్యాను. దీంతో నా మొదటి హీరో, నిర్మాత కల్యాణ్‌రామ్‌ పేరును వేడుకలో చెప్పడం మర్చిపోయాను. అది ఉద్దేశపూర్వకంగా కాదు, నిజంగానే మర్చిపోయాను. ‘ఎంతమంచి వాడువురా’ చిత్రం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అనిల్‌ రావిపూడి పేర్కొన్నారు.

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అలనాటి తార విజయశాంతి ఈ చిత్రంతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఇందులో ఆమె ప్రొఫెసర్‌ భారతిగా కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని