ఈ జోడీకి ‘సరిలేరు ఇంకెవ్వరు’

వెండితెరపై కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ వాళ్లు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి జోడీ చిరంజీవి-విజయశాంతి. వీరి కలిసి నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని

Updated : 08 Nov 2021 22:24 IST

వెండితెరపై కొన్ని కాంబినేషన్లను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ మళ్లీ వాళ్లు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి జోడీ చిరంజీవి-విజయశాంతి. వీరు కలిసి నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. చిరంజీవి అగ్ర కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, విజయశాంతి కూడా లేడీ సూపర్‌స్టార్‌ అనిపించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో కొంతకాలం చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. చిరు ‘ఖైదీ నంబర్‌ 150’తో తిరిగి రీఎంట్రీ ఇవ్వగా, విజయశాంతి తాజాగా మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’లో పవర్‌ఫుల్‌ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్ర ‘మెగా సూపర్‌’ ఈవెంట్‌లో ఈ జోడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘విడుదల ముందస్తు వేడుకలో చిరంజీవిని కలవడం గొప్ప అనుభూతి. నేను రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవికీ, నాకూ మధ్య దూరం పెరిగింది. ఆ వేడుక తర్వాత మా మధ్య అపార్థాలన్నీ తొలగిపోయాయి’ అని విజయశాంతి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన కొన్ని హిట్‌ సినిమాలేంటో ఓసారి చూద్దామా!

గ్యాంగ్‌ లీడర్‌

చిరు-విజయశాంతి జోడీ అనగానే అభిమానులకు మొదటిగా గుర్తొచ్చేది ‘గ్యాంగ్‌లీడర్’‌.  ఇందులో వీరి మధ్య వచ్చే సన్నివేశాలు భలే సరదాగా ఉంటాయి. ఇక  ‘వాన వాన వెల్లువాయే ’పాటలో వీరి స్టెప్‌లు కుర్రకారుకు తెగ నచ్చేశాయ్‌.  చిరు చెప్పే ‘చేయి చూశావా చాలా రఫ్ఫ్‌గా ఉందో.. రఫ్ఫాడ్డించేస్తా’ అనే డైలాగ్‌ చాలా పాపులర్‌.  విజయ బాపినీడు దర్శకత్వం వహించిన  ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్‌ మాటలు అందించారు. 1991లో విడుదలైన ‘గ్యాంగ్‌లీడర్‌’ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలకొట్టింది. 

స్వయం కృషి

ళాతపస్వి కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ స్యయంకృషి.’ ఇందులో చిరు-విజయశాంతి అభినయానికి ప్రేక్షకులు మంత్రముగ్దులు అయ్యారు. చిరంజీవి నటనకుగానూ తొలిసారి నంది అవార్డును అందుకున్నారు. ఇందులోని గీతాలు సంగీత ప్రియులని విశేషంగా అలరించాయి. ఈ సినిమాని మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.  ఈ చిత్రం 1987లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కొండవీటి దొంగ

కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మరో కమర్షియల్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘కొండవీటి దొంగ’. మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాబిన్‌హుడ్‌ కథ స్ఫూర్తితో తెరకెక్కించారు. ఇందులో మెగాస్టార్‌కు జోడీగా విజయశాంతి, రాధ నటించారు.  ‘కోలో కోలమ్మ కళ్ల కోకే కాకెత్తుకెళ్ల కోరింది ఇచ్చుకోవా’లో చిరు-విజయశాంతి స్టెప్‌లను ఎవరూ మర్చిపోలేరు. 

యముడికి మెగుడు

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి-విజయశాంతి జోడీగా నటించిన చిత్రం ‘యముడికి మెగుడు’. 1988లో విడుదలైన ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంది. రాజ్‌ - కోటి సంగీతం, యమలోకంలోని సన్నివేశాలు ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ‘వాన జల్లు..’ పాట యువతకు మత్తెక్కించింది.

పసివాడి ప్రాణం

చిరు కెరీర్‌లోనే థ్రిల్లర్‌ సినిమాగా ఆకట్టుకున్న చిత్రం ‘పసివాడి ప్రాణం.  కొదండరామి రెడ్డి దర్శకుడు. ఈ సినిమాతోనే ప్రముఖ నటుడు రఘువరన్‌ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. అల్లు అరవింద్‌ నిర్మాత. 1987లో విడుదలైన ఈ సినిమా నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది. తెలుగులో థ్రిల్లర్‌ సినిమాల హావాకు నాంది పలికింది.  ఇందులోని ‘కశ్మీరు లోయలో కన్యాకుమారి’ ,  ‘బ్రేక్‌ డాన్స్‌ ’ పాటలకు చిరు-విజయశాంతిల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఛాలెంజ్‌

యండమూరి నవల ‘డబ్బు టు ది పవర్‌ ఆఫ్‌ డబ్బు’ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ ఛాలెంజ్’.  యండమూరి‌-చిరు కలయికలో వచ్చిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాశాయి. అందులో ఇది కూడా ఒకటి. కొదండరామి రెడ్డి దర్శకుడు. ఇళయరాజా సంగీతం అందించాడు. చిరుతో పాటుగా విజయశాంతి, సుహాసిని నటించారు. ఇందులో చిరు రావుగోపాలరావుతో డబ్బు సంపాదించే విషయంపై ఛాలెంజ్‌ చేసే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది. 1984లో విడుదలై అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది చిత్రం. 

కొండవీటి రాజా 

ర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రాల్లో ‘కొండవీటి రాజా’ ఒకటి. ఇందులో చిరు-విజయశాంతి మధ్య వచ్చే గీతాలలో నృత్యాలతో పాటు  రాఘవేంద్రరావు మార్క్‌ గ్లామర్‌ సినిమాకు అదనపు ఆకర్షణ తెచ్చింది. నిధి అన్వేషణ బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్‌ కథ, మాటలు అందించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చారు. 

ఇవే కాదు, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘స్టువర్ట్‌పురం పోలీస్‌స్టేషన్‌’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘యుద్ధభూమి’, ‘చాణక్య శపథం’, ‘ధైర్యవంతుడు’, ‘భాగ్యలక్ష్మి’, ‘దేవాంతకుడు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘రుస్తుం’ చిత్రాలు వీరి కాంబినేషన్‌లోప్రేక్షకులను అలరించాయి. 

-ఇంటర్నెట్‌డెస్క్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు