ఈ ఇండియన్‌ ఐడల్‌.. షూ పాలిషర్‌

పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు.. కానీ పేదవాడిగా చావడం మాత్రం మన తప్పే..’ ఇలాంటి కొటేషన్లు ఇతరులకు చెప్పడానికి బాగుంటాయి. వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకుంటే వహ్వా అన్న ప్రశంసలు లభిస్తాయి.

Published : 25 Feb 2020 20:29 IST

షూ పాలిష్‌ చేసిన చేతులు.. రూ.25 లక్షల చెక్‌ అందుకున్నాయి! 

‘పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు.. కానీ పేదవాడిగా చావడం మాత్రం మన తప్పే..’ ఇలాంటి కొటేషన్లు ఇతరులకు చెప్పడానికి బాగుంటాయి. వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకుంటే వహ్వా అన్న ప్రశంసలు వస్తాయి. కానీ, ఆచరించాలంటే మాత్రం ఎంతో కష్టపడాలి. అదే చేశాడో నిరుపేద యువకుడు. కట్‌ చేస్తే ‘షూ పాలిష్‌ చేసే ఓ కుర్రాడు. బెలూన్లు అమ్ముతూ, ఇంటింటికీ తిరిగి బియ్యం అడుక్కొచ్చి కుటుంబాన్ని పోషించే ఓ తల్లి.... నేడు దేశానికి ఆదర్శమయ్యారు. సూర్యుడి వెలుగుని మేఘాలు ఆపలేవన్నట్లు కష్టాలన్నీ కట్టకట్టుకొని వచ్చినా ఆ యువకుడి విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. తన తల్లి కష్టాన్నీ, తన కృషి ఫలితాన్నీ దేశానికి పరిచయం చేసేలా కుర్రకారుని ఉర్రూతలూగించే ఇండియన్‌ ఐడల్‌ పోటీల్లో అద్భుతంగా పాడి టైటిల్‌ విజేతగా నిలిచిన అతడే సన్నీ హిందుస్థానీ. 

సన్నీ హిందుస్థానీ అసలు పేరు.. సన్నీ మాలిక్‌.  అతడిది పంజాబ్‌లోని భటిండా చిన్న టౌను. అమ్మానాన్నలు రోజంతా కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లని పరిస్థితి. అగ్గిపెట్టె లాంటి ఇల్లు. అందులోనే అమ్మ, నాన్న, తను. అట్టహాసాలు అస్సలు తెలియవు. పస్తులే పరిచయం. అలాంటి పరిస్థితిలో సంగీతమే తనకు సాంత్వనగా మారింది. ఆనందం వచ్చినా, బాధ కలిగినా పాటలు పాడుకునే వాడు. పదిమందీ శభాష్‌ సన్నీ అంటుంటే సంతోషపడే వాడు. బడికి వెళుతూనే నెమ్మదిగా స్టేజీ షోలలో పాటలు పాడేవాడు. హార్మోనియంతో పాటు ఇతర సంగీత వాద్యాలూ బాగా పలికించేవాడు. కొడుకు ప్రతిభ చూసి మురిసిపోయిన తండ్రి ఓ హార్మోనియం బహుమతిగా ఇచ్చాడు. ఎగిరి గంతేసిన సన్నీ.. ఇక అనుక్షణం దాంతో సాధన చేసేవాడు. చదువు, సంగీతం.. అంతా హ్యాపీ అనుకుంటున్న సమయంలో ఇంటి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ఆరో తరగతిలోనే తన చదువుకు చుక్క పడింది. అందరిలా బడికి వెళ్లలేక, ఇంట్లో ఖాళీగా ఉండలేక.. మనసంతా దిగులు. ఏదో తెలియని వెలితి. సరిగ్గా ఈ స్థితిలో 2014లో తండ్రి ఆకస్మిక మరణం. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా సమస్యలు ఎక్కువయ్యాయి. ఏం చేయాలి? అమ్మని ఎలా పోషించాలి? ఇల్లు ఎలా నెట్టుకురావాలి? ఎటు చూసినా ప్రశ్నలే. పదిహేనేళ్ల వయసులో పాతికేళ్లకు మించిన భారం మోయాల్సి వచ్చింది. ఏం పాలుపోలేదు! కానీ బతకడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. పొట్టకూటి కోసం షూ పాలిషింగ్‌ చేయడం మొదలు పెట్టాడు. తల్లి మనసు తల్లడిల్లింది. ‘నేనూ బెలూన్లు అమ్ముతాను’ అంటూ బయలుదేరింది. అయినా ఎప్పుడైనా తిండి గింజలు లేకపోతే, ఇంటింటికీ తిరిగి బియ్యం అడిగి తెచ్చి, అన్నం వండేది. ప్రతి కష్టం వెనుకా ప్రతిఫలం ఉంటుంది కదా!! సన్నీకి ఆ అవకాశం ఇండియన్‌ ఐడల్‌ రూపంలో వచ్చింది.

ఎలాంటి శిక్షణ లేకుండానే..

హేమాహేమీలను మట్టికరిపించి విజేతగా నిలిచిన సన్నీ నిజంగానే ఏకలవ్యుడని చెప్పాలి. ఎందుకంటే.. ఏకలవ్యుడు ఎలాగైతే ద్రోణాచార్యుడి విగ్రహం ముందు సాధన చేసి మేటి విలుకాడిగా మారిన విషయం మనకు తెలిసిందే. సన్నీ కూడా అలాగే సాధన చేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ఓ ప్రముఖ గాయకుడు నుస్రత్‌ అలీఖాన్‌ను స్ఫూర్తిగా తీసుకొని పాటలు పాడటం మొదలుపెట్టాడు. మొత్తానికి ఎలాంటి శిక్షణ లేకుండానే ఇండియన్‌ ఐడల్‌గా నిలిచాడు. 

అక్కడే తొలిమెట్టు ఎక్కాడు..

‘ఇండియన్‌ ఐడల్‌’ గురించి విన్న సన్నీ అందులో పాల్గొనేందుకు ఆడిషన్స్‌కు వెళ్లాడు. నిజానికి సన్నీ విజయానికి అక్కడే తొలి అడుగుపడింది. ఆడిషన్స్‌లో భాగంగా సన్నీ పాడిన పాట వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రాను అమితంగా ఆకట్టుకుంది. సన్నీ పాట విన్న తర్వాత దానికి సంబంధించిన ఓ వీడియోను స్వయంగా తన ట్విటర్‌లో పోస్టు చేశారాయన. దాంతో సన్నీకి అభిమానుల మద్దతు పెరిగింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌ సైతం సన్నీ విజయంపై స్పందించారు. ‘మేము తలెత్తుకునేలా చేశావు. అభినందనలు’అన్నారు. 


 

2019 అక్టోబర్‌లో ప్రారంభమైన ఇండియన్‌ ఐడల్‌11వ సీజన్‌లో ప్రారంభం నుంచే సన్నీ ఆధిపత్యం ప్రదర్శించాడు. అలా ఫైనల్‌కు చేరుకున్నాడు. తుది పోరులోనూ అద్భుత ప్రదర్శనతో అందర్నీ మెప్పించాడు. న్యాయనిర్ణేతలతో పాటు అభిమానులు అతని పాటను మెచ్చి ఓటింగ్‌లో అత్యధిక ఓట్లు వేశారు. అలా సన్నీ ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీని ముద్దాడాడు. అలా ఒకప్పుడు షూ పాలిష్‌ చేసిన చేతులు ఇండియన్‌ ఐడల్‌ ట్రోఫీతో పాటు రూ.25లక్షల చెక్కు అందుకున్నాయి.

నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది..

‘మొదటి రౌండ్లోనే పోటీ నుంచి వెనక్కి వెళతానేమో అనుకున్నాను. కానీ, విజేతగా నిలుస్తానని అసలు ఊహించలేదు. ఇలాంటి గొప్ప వేదికపై న్యాయనిర్ణేతల ఎదుట పాడటం, చివరికి అవార్డు సొంతం చేసుకోవడం నమ్మలేకపోతున్నాను. నా కల నిజమైంది. దేశం మొత్తం నా గొంతు వినడం, నాకు మద్దతుగా నిలిచి నన్ను గెలిపించడం నమ్మలేకపోతున్నాను’ అంటున్న సన్నీ తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని చెబుతున్నాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని