Published : 08 Mar 2020 10:24 IST

వీరంతా చాలా గ్రేట్‌ బాబోయ్‌..!

అడ్డంకులు దాటి అగ్ర కథానాయికలుగా..

చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ల వయసులోనూ రాణిస్తున్న కథానాయకులు చాలా మందే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా అభిమానులు వారిని ఆదరిస్తుంటారు. కానీ ఓ కథానాయిక విషయానికి వస్తే.. ఆ ఫార్ములా పూర్తిగా మారిపోతుంది. హీరోయిన్ల కాల పరిమితి ఇక్కడ తక్కువ. కొన్నేళ్లకు సహాయ పాత్రల్లో నటించాల్సిందే. అందం, అదృష్టం, శ్రమ కలిస్తే తప్పా ఇక్కడ పట్టుమని పదేళ్లు రాణించడం కష్టం. ఇలా వచ్చి కాలం కలిసి రాక.. మెరుపు తీగల్లా వెళ్లిపోయిన ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. ఈ తరుణంలో హీరోలకు ధీటుగా కొందరు దక్షిణాది భామలు అభిమానుల మన్ననలు పొందుతూ శభాష్‌ అనిపించుకున్నారు. పది, పదిహేనేళ్ల కంటే ఎక్కువగా వెండితెరపై మ్యాజిక్‌ చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి వైపు ఓ లుక్కేద్దాం..

త్రిష వస్తానంటే వద్దంటామా

త్రిష నవ్వితే ఎవరైనా పడిపోవాల్సిందే. అంత ముద్దుగా ఉంటుంది ఆమె రూపం. దానికి తోడు చక్కటి అభినయం తోడైంది. 1999 ‘జోడీ’లో చిన్న పాత్రలో కనిపించిన ఆమె.. ఇప్పుడు దక్షిణాదిలో అగ్రతారగా వెలుగుతున్నారు. పలు తమిళ హిట్లు అందుకున్న తర్వాత 2003లో ‘నీ మనసు నాకు తెలుసు’తో తెలుగు వారిని పలకరించారు. ఆపై ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘అతడు’, ‘ఆరు’, ‘స్టాలిన్’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’.. ఇలా దాదాపు అందరు అగ్ర కథానాయకుల సరసన నటించారు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా త్రిష అదే ఫాంలో ఉన్నారు. ఇప్పటి హీరోల సినిమాలకు కూడా సంతకం చేసి హిట్లు అందుకుంటున్నారు. అంతేకాదు కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలతోనూ ఆకట్టుకుంటున్నారు. 2018లో ‘96’, 2019లో ‘పేట’లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ కూడా ఉంది.


లేడీ సూపర్‌స్టార్‌ జోరు తగ్గలే..

టీవీ యాంకర్‌గా కెరీర్‌ ఆరంభించి... నేడు అందరితోనూ లేడీసూపర్‌స్టార్‌ అనిపించుకుంటున్నారు నయనతార. ఆమె కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలున్నాయి. వ్యక్తిగతంగానూ పలు కారణాల వల్ల కుంగిపోయారు. కెరీర్ ప్రారంభ దశలో తప్పటడుగులు వేసినప్పటికీ ఆపై ప్రత్యేక స్టార్‌గా ఎదిగారు. 2003లో ఓ మలయాళ సినిమా ద్వారా నయన్‌ కెరీర్‌ ఆరంభమైంది. ఆపై పలు మలయాళ, తమిళ సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో ఆమె మొదటి సినిమా ‘లక్ష్మి’. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయన్‌ ప్రత్యేక కథలు, పాత్రలతో అలరిస్తూనే ఉన్నారు. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో హిట్లు అందుకోవడమే కాదు.. బాక్సాఫీసు వసూళ్లు కూడా రాబడుతున్నారు. గత ఏడాది నయన్‌ ‘సైరా’లో సిద్ధమ్మగా అలరించారు. ఆపై ‘బిగిల్‌’, ‘దర్బార్‌’లో కనిపించారు. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు తమిళ ప్రాజెక్టులు ఉన్నాయి.


అందరి స్వీటీ

ఒకప్పటి యోగా టీచర్‌.. ఇప్పుడు అందరు మెచ్చే అనుష్క. అనుకోకుండా ఆమె సినీ కెరీర్‌ ఆరంభమైంది. 2005లో పూరీ జగన్నాథ్‌ ‘సూపర్‌’ సినిమాతో అరంగేట్రం చేశారు. ఆరంభంలో గ్లామర్‌ ప్రపంచం చూసి కాస్త భయపడ్డ ఆమె.. ఆపై నిలదొక్కుకున్నారు. ‘విక్రమార్కుడు’, ‘లక్ష్యం’, ‘డాన్‌’, ‘చింతకాయల రవి’, ‘కింగ్‌’ వంటి కమర్షియల్‌ సినిమాల్లో సందడి చేశారు. 2009లో వచ్చిన ‘అరుంధతి’ ఆమె ఇమేజ్‌ను మార్చింది. 2015 ‘బాహుబలి’తో అంతర్జాతీయంగా అనుష్క పేరు మారుమోగింది. 2019లో ‘సైరా’లో అతిథిగా కనిపించిన ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతోంది. స్వీటీ తదుపరి సినిమాలు ప్రకటించాల్సి ఉంది.


మిల్కీబ్యూటీ మెరుపులు

2005లో ‘శ్రీ’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన తమన్నా ఆపై ‘హ్యాపీడేస్‌’తో గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100%లవ్‌’ ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆపై తమన్నా అగ్ర కథానాయకుల సరసన తళుక్కుమన్నారు. 2015లో వచ్చిన ‘బాహుబలి’ ఆమె కెరీర్‌కు ప్లస్‌ అయ్యింది. ‘బెంగాల్‌ టైగర్‌’, ‘ఊపిరి’, ‘అభినేత్రి’, ‘ఎఫ్2’ వంటి హిట్లు అందుకున్నారు. ఇటీవల ‘సైరా’లో చిరు ప్రేయసి లక్ష్మిగా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. అగ్ర నటిగానే కాకుండా ప్రత్యేక గీతాల్లోనూ మిల్కీబ్యూటీ ఆడిపాడుతున్నారు. బాలీవుడ్‌లోనూ తమన్నా గుర్తింపు పొందారు.


చందమామ సొగసులు

2007 ‘లక్ష్మీకల్యాణం’లో పల్లెటూరి అమ్మాయిగా అందరి మనసులు దోచారు కాజల్‌. ఆపై ‘చందమామ’లో మెప్పించారు. ‘మగధీర’ కాజల్‌ కెరీర్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఆపై వరుస సినిమాలు, హిట్లతో బిజీ అయ్యారు. ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘బృందావనం’, ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘తుపాకీ’, ‘బాద్‌షా’.. తదితర సినిమాల్లో మెరిశారు. కాజల్‌ బాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఇటీవల ఆమె నటించిన తమిళ సినిమా ‘కోమలి’ విడుదలై, మంచి టాక్‌ అందుకుంది. ప్రస్తుతం కాజల్‌ చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’ ఒకటి.


రేస్‌లో రకుల్‌

టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ప్రశంసలు పొందిన కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ భామ తొలి సినిమా 2009లో కన్నడంలో వచ్చిన ‘గిల్లి’. ఆమె తెలుగులో ‘కెరటం’తో పరిచయం అయ్యారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ రకుల్‌కు బ్రేక్‌ ఇచ్చింది. ఆపై ‘లౌక్యం’, ‘కరెంటుతీగ’, ‘పండగచేస్తో’, ‘బ్రూస్‌లీ’, ‘నాన్నకుప్రేమతో’, ‘సరైనోడు’, ‘ధృవ’ తదితర చిత్రాలతో హిట్లు అందుకున్నారు. హిందీలో ఆమె తొలి ప్రాజెక్టు ‘అయ్యారి’. కానీ 2019 ‘దే దే ప్యార్‌ దే’తో హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ, రెండు హిందీ సినిమాలున్నాయి.


మాయ చేస్తూనే ఉంది

తొలి సినిమాతోనే ప్రేక్షకుల్ని మాయ చేశారు సమంత. ఆపై ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ తదితర హిట్లు అందుకున్నారు. తెలుగులోపాటు కోలీవుడ్‌లోనూ అగ్ర నటిగా ఎదిగారు. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాల్లో నటిస్తూ.. వసూళ్లకు ఢోకా లేదనిపించారు. ఈ కోవలో వచ్చినవే ‘యూటర్న్‌’, ‘ఓ బేబీ’. ఇప్పుడు సామ్‌ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా అభిమానుల్లో ఆమెకున్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.


సొట్టబుగ్గల సుందరి జోరు

2010లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీసిన ‘ఝుమ్మందినాదం’ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన నటి తాప్సి. ఆపై ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’, ‘వీర’, ‘మొగుడు’, ‘దరువు’, ‘గుండెల్లో గోదారి’ వంటి చిత్రాల్లో ఆమె నటించారు. 2015 తర్వాత బాలీవుడ్‌లో ఆమె ప్రయాణం కెరీర్‌ను మలుపు తిప్పింది. ‘బేబీ’, ‘పింక్‌’, ‘రన్నింగ్‌ షాదీ’, ‘నామ్‌ షబానా’, ‘జుడ్వా 2’, ‘ముల్క్‌’, ‘బద్లా’, ‘గేమ్‌ ఓవర్‌’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’, ‘థప్పడ్‌’తో తాప్సి హిందీలో అగ్ర నటిగా మారారు. మంచి పాత్రలతో అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘హసీన్‌ దుల్‌రుబా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. సెప్టెంబరులో ఇది విడుదల కాబోతోంది.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని