మన హీరోలు ఒక్కొక్కరుగా రావట్లేదుగా..!

కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి ఎంతో శ్రమ కావాలి. ఎన్నో కాస్ట్యూమ్స్‌, టేక్స్‌ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. ఏ విధంగా చెప్పాలంటే సినిమా భారం.....

Published : 19 Mar 2020 09:17 IST

బాలకృష్ణ, రామ్‌, విక్రమ్‌..

కథానాయకుడు ఓ పాత్ర పోషించడమే ఎంతో సవాలుతో కూడుకున్న పని. అలాంటిది రెండు, అంత కంటే ఎక్కువ చేయాలంటే.. దానికి మరింత కష్టపడాలి. ఎన్నో కాస్ట్యూమ్స్‌, టేక్స్‌ తీసుకోవాల్సి వస్తుంది. ఓ పాత్రకి మరో పాత్రకి తేడా స్పష్టంగా చూపించాలి. సినిమా భారం మొత్తం భుజాల మీద వేసుకుని మోయాలి. ఇలా ఒకటి కంటే ఎక్కువ పాత్రలు, షేడ్స్‌ పోషించిన హీరోలు చాలా మందే ఉన్నారు. రానున్న రోజుల్లోనూ మన హీరోలు ఒకటి కంటే ఎక్కువ పాత్రల్లో సందడి చేయబోతున్నారు. బాలకృష్ణ, రామ్‌, విక్రమ్‌ తదితరులు తమ తర్వాతి ప్రాజెక్టులో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేయబోతున్నారట. వారివైపు ఓ సారి చూద్దాం..

రామ్‌ రెడ్‌

‘ఇస్మార్ట్ శంకర్’లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత రామ్ మరో విభిన్న కథను ఎంచుకున్నారు. కోలీవుడ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్‌ను ‘రెడ్‌’ టైటిల్‌తో రీమేక్‌ చేసి తెలుగు ప్రేక్షకులకు తన స్టైల్‌లో అందిస్తున్నారు. ఇందులో ఆయన సిద్ధార్థ్‌, ఆదిత్యగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ కథానాయికలు. కిశోర్‌ తిరుమల దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. రామ్‌ రెండు విభిన్న పాత్రల్లో చక్కటి వ్యత్యాసం చూపించారు. ఏప్రిల్‌ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరోమారు..

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే పలుమార్లు ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఇప్పుడు మరోసారి రెండు పాత్రల్లో కనిపించి, వినోదం పంచబోతున్నారట. ఆయన హీరోగా బోయపాటి శ్రీనివాస్‌ దర్శకుడిగా ఓ సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు ప్రచారం ఉంది. ఈ చిత్రంలో అంజలి, శ్రియలను కథానాయికలుగా అనుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలి. ఒక పాత్రలో అఘోరగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్‌ పూర్తయింది. కరోనా నేపథ్యంలో చిత్ర షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఏకంగా ఏడు..

కథానాయకుడు విక్రమ్ మరోసారి తనలోని ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఆయన ఇప్పటికే పలు చిత్రాల్లో ఒకటి కంటే ఎక్కువ పాత్రలు పోషించారు. కాగా ఇప్పుడు ‘కోబ్రా’ సినిమాలో ఏడు పాత్రల్లో కనిపించి వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. విక్రమ్‌ ప్రతి పాత్రకీ అద్భుతమైన వ్యత్యాసం చూపించారు. ఆర్‌.అజయ్‌ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా కరోనా ప్రభావం పడింది. 

ఇద్దరు మహేశ్‌లు నిజమేనా?

మహేశ్‌బాబు రెండు పాత్రల్లో కనిపించబోతున్నారట. ఆయన హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘బాషా’ తరహాలో ఈ చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మహేశ్‌ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఓ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారంటూ టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!

ఒకరా? ఇద్దరా?

రవితేజ మరోసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న కొత్త చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ఇటీవలే పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాజకీయాంశాలతో ముడిపడిన కథతోనే ఆ చిత్రం తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రవితేజా ఒకరా? ఇద్దరా? అనే సందేహం కలిగేలా పాత్ర ఉంటుందట.

వరుసగా.. 

తమిళ స్టార్‌ విజయ్‌కు ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. ఆయన ఇప్పటికే అనేక చిత్రాల్ల్లో విభిన్న పాత్రల్లో సందడి చేశారు. ‘మెర్సల్‌’లో మూడు పాత్రల్లో కనిపించారు. ఇటీవల వచ్చిన ‘విజిల్‌’లోనూ అలానే మెప్పించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించింది. త్వరలో ఆయన నటించిన ‘మాస్టర్‌’ చిత్రం రాబోతోంది. ఇందులోనూ విజయ్‌ రెండు షెడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని